ప్రాణాలకు తెగించి కరోనా విధులు

కొవిడ్-19 నియంత్రణ పోరులో ప్రాణాలకు తెగింపు

‘వారియర్సు’ను అంటరాని వారిగా చూస్తున్న వైనం…

సర్కార్ సాయం అంతంత మాత్రమే.. వైద్యులపై దాడులు

కరోనావైరస్‌తో వరంగల్ డిప్యూటీ డీఎంహెచ్‌వో నరేష్ మృతి

సమస్యలను పరిష్కరించాలంటూ కోరుతున్న వైద్యులు…

(* బొల్లెపల్లి కిషన్)

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలందిస్తున్న వైద్యులపై ఇటీవల కాలంలో దాడులు, దూషణలు మరింత పెరిగాయి. ఒకప్పుడు ఫర్నీచరు, ఆసుపత్రులను ధ్వంసం చేసే వరకే పరిమితమైన రోగుల బంధువుల దాడులు ఇప్పుడు ఏకంగా వైద్యలను, సిబ్బందిపై కూడా దాడులు చేసే వరకు వెళ్తున్నారు. కొన్ని సమయాల్లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్న మాట వాస్తవమే కావచ్చు. కానీ చాలా సందర్భాల్లో సేవలందిస్తున్న వారు లేకపోలేదు.

మరోవైపు అసలు ప్రభుత్వ ప్రచారానికి పూర్తి భిన్నంగా ఆసుపత్రులు నడుస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సకల సౌకర్యాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కల్పిస్తున్నామని గొప్పలు చెప్పుకోవడమే తప్ప కనీస సౌకర్యాలు కల్పించిన దాఖలాలు లేవని వైద్యులు, సిబ్బంది ఆరోపిస్తున్నారు. ప్రజలను భ్రమల్లో పెట్టడం వల్ల వారు తమపై దాడులు చేస్తున్నారని మనోవేదనకు గురవుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వం నుంచి ప్రజలకు, ముఖ్యంగా కరోనా రోగులకు అందించాల్సిన పరికరాలు, మందులు, ఆక్సిజన్ వెంటిలేటర్స్ రోగుల సంఖ్యంకు అనుగుణం ఎక్కడా లేవని అంటున్నారు.

కొన్ని ప్రాధమిక ఆసుపత్రుల్లోనైతే పీపీఈ కిట్లు లేక ఇబ్బందులకు పడుతున్నారని అంటున్నారు. సానిటైజర్లు కూడా ఒక్కోసారి తమ స్వంత డబ్బులతోనే కొనుక్కునే పరిస్థితి ఉందని ఉద్యోగలు వాపోతున్నారు. వీటిని గమనించని ప్రజలు, రోగుల బంధువులు తమను తప్పుబడుతూ దాడులకు, దూషణలకు దిగుతుండటంపై వారంతా మనోవేధనకు గురువుతున్నారు.

ప్రభుత్వం ప్రజలకు వైద్యం అందించాలన్నా చిత్తశుద్ధి అవసరమని, అందుకు అనుగుణంగా సౌకర్యాలను మెరగుపర్చాలని వైద్యులు, వైద్య సిబ్బంది కోరుతున్నారు. కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్ఓగా భద్రాచలంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ నరేష్ కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన కరోనాతో మృతి చెందడంతో ఒక్కసారిగా వైద్యులు షాకకు గురయ్యారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో గత కొంతకాలంగా కొవిడ్ విధులలో ఉన్న డాక్టర్ నరేష్ ఒక్కసారిగా అనారొగ్యానికి గురి కావడం టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ తేలడంతో అందరూ కొంత భయబ్రాంతులకు గురి అయ్యారు. త్వరలోనే కోలుకుని మళ్ళీ విధుల్లో చేరుతారని అందరూ ఆశించారు.

కానీ అందుకు భిన్నంగా శనివారం డాక్టర్ నరేష్ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని ఆయన సన్నిహితులు తెలిపారు. విషయం తెలియడంతో వైద్య వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్‌తో ఫ్రంట్ వారియర్లుగా పోరాటం చేస్తున్న తమకు ప్రభుత్వం ఎటువంటి భరోసా ఇవ్వడం లేదని వైద్య సిబ్బంది మానసికంగా మదన పడుతున్నారు. డాక్టర్ నరేష్ మృతదేహం సాక్షిగా కొందరు వైద్యులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డట్లు సమాచారం. ఒక డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్ఓ విధి నిర్వహణలో మరణిస్తే కనీసం ఆయన కుటుంబానికి ప్రభుత్వం ఎటువంటి భరోసా ఇవ్వకపోవడం చాలా బాధాకరమని కొందరు వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధులు నిర్వర్తిస్తూ కరోనాతో మరణించిన డాక్టర్ నరేష్ కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఆయన భార్యకు గెజిటెడ్ స్థాయి ఉద్యోగం ఇవ్వాలని ఈ సందర్భంగా కొందరు వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.

(* వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, ‘ఘంటారావమ్’ తెలుగు దినపత్రిక; +91 89783 92904)