కాంగ్రెస్ సత్తా చాటనుందా?

3984
  • ‘కెప్టెన్‌’ సారథ్యానికి హారతులు

  • కదులుతున్న అనుకూల పవనాలు

తెలంగాణ రాష్ట్రం ఇచ్చాక కూడా గత ఎన్నికల్లో ప్రజల ఆదరణకు అంతగా నోచుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో మాత్రం సత్తాచాటనుందనే సంకేతాలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, టీపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కెప్టెన్ నలమద ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నాయకత్వం పట్ల నమ్మకంతో అనేక మంది పార్టీలో కొత్తగా చేరుతున్నారు. గతంలో పార్టీలో పనిచేసి వేర్వేరు కారణాల చేత కాంగ్రెస్‌ను వీడిన పలువురు సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులూ తిరిగి పార్టీలోకి వస్తున్న తీరుతో పాటు మొత్తంగా ప్రజల్లో కూడా అధికార పార్టీపై కొంత వరకు వ్యతిరేకత పెరిగినట్లు తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో చోటుచేసుకున్న పలు పరిణామాలు, టీఆర్ఎస్ నేతల వ్యవహారశైలి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే అనుముల రేవంత్‌రెడ్డి వంటి వారిపై కేసులు నమోదుకావడం కాంగ్రెస్‌కు బాగా కలిసొచ్చే అంశమనే చెప్పాలి. ఈ కేసులతో తెరాసకు ప్రవేమయం ఉందా? లేదా? అన్న అంశాన్ని పక్కనపెడితే, ఎన్నికల సమయాన ఇలాంటి పరిణామాలు పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తాయన్నది కేసీఆర్ బృందం పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. మరోవైపు, టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా వివిధ విపక్ష పార్టీలు ఏకం అవుతున్న పరిస్థితి, ఆయా కూటమికి ఆచార్య కోదండరామ్ లాంటి మేథావుల సహకారం ఉండడం గమనార్హం.

టీపీసీసీ చీఫ్ కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంపై నానాటికీ ఇటు పార్టీలోను, అటు ప్రజల్లోనూ పెరుగుతున్న నమ్మకం కాంగ్రెస్‌కు ప్రధానంగా కలిసొచ్చే అంశం. 1962 జూన్‌ 20న పూర్వపు నల్లగొండ జిల్లా, నేటి నూతన జిల్లా సూర్యాపేటలో ఎన్. పురుషోత్తమ్‌రెడ్డి, ఉషాదేవి దంపతులకు జన్మించిన ఉత్తమ్ రాజకీయాలలో తక్కువ సమయంలోనే రాణించారు. సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండలం తాటిపాముల ఆయన స్వగ్రామం. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు.

అనంతరం ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో పైలెట్‌గా పనిచేశారు. ఎంఐజీ 21, ఎంఐజీ 23 విమానాలకు యుద్ధ విమానాలను నడిపిన ధీరుడుగా కూడా కీర్తిగడించారు. భారత రాష్ట్రపతి విదేశీ పర్యటనల సమయంలో ప్రోటోకాల్‌ పరిపాలనా విభాగంలో కంట్రోలర్‌ ఆఫ్‌ సెక్యూరిటీగా పనిచేసి సేవలందరించారు. రాష్ట్రపతి భవన్‌లో సెక్యూరిటీ రక్షణ బాధ్యతలను సమర్ధంగా నిర్వహించారు.

అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి 1999లో కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌పై కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. అదే నియోజకవర్గం నుంచి వరసగా 2004 ఎన్నికల్లోనూ విజయ పరంపర కొనసాగించి హ్యాట్రిక్‌ నమోదు చేశారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కారణంగా 2009 ఎన్నికలలో కాంగ్రెస్ హుజ్‌నగర్ నుండి గెలిచింది. నాలుగోసారి 2014లో హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి తొలి తెలంగాణ చట్టసభలో ప్రవేశించి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బలహీనవర్గాలకు ఇళ్ల నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు.

కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలకపాత్ర పోషించారనే చెప్పాలి. ఉత్తమ్‌ నాయకత్వంలోనే అఖిలపక్ష నేతలను 2011 జనవరి మొదటి వారంలో అప్పటి కేంద్ర హోం శాఖ మంత్రి పి.చిదంబరం దగ్గరకు తీసుకువెళ్లి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వినతిపత్రాలు ఇచ్చారు. తెలంగాణ ఆవశ్యకతను శ్రీకృష్ణ కమిటీకి తెలియజేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టాన వర్గం వద్ద తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి బలంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

ఇక, కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలనే నిర్ణయం తీసుకునేలా చేయడంలో కూడా ఆయనది కీలకపాత్రనే చెప్పాలి. మొత్తానికి కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకునేందుకు ఉత్తమ్‌ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. 2015 ఫిబ్రవరిలో కెప్టెన్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) చైర్మన్‌ పగ్గాలను కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం అప్పగించింది.

కెప్టెన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పద్మావతిరెడ్డిని వివాహం చేసుకున్నారు. ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేట్‌ అయిన పద్మావతికి రాజకీయాలంటే అమితాసక్తి. 2014లో కోదాడ అసెంబ్లీ సీటు నుంచి ఆమె పోటీ చేసి భారీ మెజార్టీతో విజయ దుందుభి మోగించారు. కోదాడ నుంచి పోటీ చేసిన తొలి మహిళ కూడా ఆమె కావడం విశేషం. తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టిన పద్మావతి కూడా ప్రజా సమస్యల పరిష్కారం నిత్యం శ్రమిస్తున్నారు. భారత వైమానిక దళంలో యుద్ధ విమానాలను నడిపిన ధీరుడిగానే కాకుండా కాంగ్రెస్‌ పార్టీ ఆశీస్సులతో రాజకీయాలోలకి వచ్చి ప్రజల హృదయాల్లో స్థానం పొందడంలోనూ సఫలీకృతుడయ్యారు. ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరు చేస్తూ యువతను ఆకట్టుకునే ప్రసంగాలతో ప్రజలతో మమేకమైన నేతగా అందరూ ఉత్తమ్‌ను ‘కెప్టెన్‌’ అని పిలుచుకుంటున్నారు.

తెలంగాణ తెచ్చిన నేతగా, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని 2019 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చే దిశగా పయనిస్తున్నారు. ఆయన వ్యక్తిగత, రాజకీయ అంశాలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్ల వర్షం కురిపించనున్నాయన్న ఆశతో పార్టీ సీనియర్లు సైతం ఎదురుచూస్తుండడం ఆసక్తిదాయకం.