సుబ్బారెడ్డికి లాక్‌డౌన్ వర్తించదా?

0
8 వీక్షకులు
తన పుట్టినరోజు సందర్భంగా తిరుమలేశున్ని కుటుంబ సమేతంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దర్శించుకున్నప్పటి చిత్రం

అమరావతి, మే 2 (న్యూస్‌టైమ్): లాక్‌డౌన్ వేళ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరుమల వెంకన్న దర్శనం చేసుకున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు. కరోనా వైరస్ (కోవిడ్ 19) వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను మూసివేశారు. ఇందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సైతం చరిత్రలో మొట్టమొదటి సారి మూతపడింది. దీంతో లాక్‌డౌన్ ఎత్తివేసే వరకు భక్తులకు శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనంపై నిషేధం విధిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అయితే ప్రస్తుత లాక్‌డౌన్ వేళ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారని నారా లోకేష్ శనివారం షాకింగ్ ట్వీట్ చేశారు.

సాధారణ భక్తులకు లేని దర్శనం వైఎస్ తోడల్లుడు వచ్చేసరికి ఎలా తలుపులు తెరుచుకున్నాయని ప్రశ్నించారు. ‘‘ఆప‌ద‌మొక్కులవాడా! అనాథ‌ర‌క్షకా! నీకూ పేదా పెద్ద తేడాల్లేవంటారు. కరోనా వైర‌స్ వ్యాప్తి చెందుతున్న ఈ కాలంలో సామాన్యుల‌కు నీ ద‌ర్శన‌భాగ్యమే లేదు. వైఎస్ తోడల్లుడు స‌కుటుంబ స‌మేతంగా వ‌చ్చేస‌రికి నీ గుడి త‌లుపులు ఎలా తెరిచార‌య్యా! దేవ‌దేవుడు ఉత్సవాల‌తో అల‌రారిన తిరుమ‌ల‌గిరులు నిర్మానుష్యంగా మారిన‌వేళ‌ నిబంధ‌న‌లు తుంగ‌లోతొక్కి నీ స‌న్నిధిలో పుట్టిన‌ రోజు వేడుక‌లు జ‌రుపుకోవ‌డం అప‌రాధం కాదా! ఏడుకొండ‌లే లేవ‌న్నోళ్లు.. నువ్వున్నావంటే న‌మ్ముతారా? నీ కొండ‌ను నువ్వే కాపాడుకో స్వామీ!’’ అంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here