న్యూఢిల్లీ, జులై 23 (న్యూస్‌టైమ్): ఎరువుల పరిశ్రమను అన్ని విధాలా బలోపేతం చేయడానికిగాను ఎన్డిఏ ప్రభుత్వం అనేక చర్యలను తీసుకున్నదని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డివి సదానంద గౌడ అన్నారు. ఈ చర్యల కారణంగా ఈ పంటల సీజన్లో రైతులకు కావలసినన్ని ఎరువులు అందుబాటులోకి వస్తున్నాయని అన్నారు. నూతన పెట్టుబడి విధానం-2012, దానికి 2014లో జరిగిన సవరణల ప్రకారం చంబల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ సంస్థ ఆధ్వర్యంలో రాజస్థాన్‌లో గడేపాన్లో బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ప్రారంభమైందని గౌడ అన్నారు. ఇందులో ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 12.7 లక్షల మెట్రిక్ టన్నులు. ఇక్కడ వాణిజ్య సరళిలో ఉత్పత్తి గత ఏడాది జనవరి 1న మొదలైందని, దాంతో అది దేశవ్యాప్తంగా 2019-20లో 244.55 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తికి దోహదం చేసిందని కేంద్ర మంత్రి అన్నారు.
యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికిగాను రామగుండం, తాల్చేర్, గోరఖ్ పూర్, సింద్రీలలోని ఎఫ్‌సిఐఎల్ యూనిట్లను బరౌనీలోని హెచ్ఎఫ్సిఎల్ యూనిట్‌ను పునరుద్ధరించడం జరిగిందని కేంద్ర మంత్రి అన్నారు. ఇది ఎంపికైన పిఎస్‌యుల జాయింట్ వెంచర్. ఇవి ఒక్కొక్కటి 1.27 ఎంఎంటిపిఏ సామర్థ్యమున్న గ్యాస్ ఆధారిత పరిశ్రమలు. సవరించిన నూతన ధరల పథకం (ఎన్ పిఎస్- 111) ప్రకారం నాప్తా మీద నడుస్తున్న పరిశ్రమలన్నీ సహజ వాయువును వినియోగించేలా మార్పులు చేయడం జరుగుతోందని కేంద్ర మంత్రి అన్నారు. ఇప్పటికే మద్రాస్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నాప్తా ఫీడ్ స్టాక్‌కు బదులుగా సహజవాయువును ఫీడ్ స్టాక్‌గా ఉపయోగిస్తోందని అన్నారు.
పైపులైన్ కనెక్టివిటీ వచ్చిన తర్వాత గత ఏడాది జులై 29నుంచి ఇది సహజవాయువు ఫీడ్ స్టాక్‌తో నడుస్తోంది. ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్ కోర్ లిమిటెడ్ ( ఎఫ్ఏసిటి)ను ఆధునీకరించేందుకుగాను రూ. 900 కోట్ల నిధులను ఖర్చు చేయాలనే ప్రధాన నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రమంత్రి తెలిపారు.