ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

హైదరాబాద్, అమరావతి, జనవరి 9 (న్యూస్‌టైమ్): ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 11న కోర్టుకు హాజరుకావాలని ఆ సమన్లలో ఆదేశించింది. హెటేరో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ట్రైడెంట్ శరత్ చంద్ర, అరబింద్ ఎండీ నిత్యానందరెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యకు కూడా సమన్లు వచ్చాయి. హెటేరో, అరబిందో ఫార్మాకు భూముల కేటాయింపు కేసులో సమన్లు ఇచ్చారు. ఈ కేసు ఇటీవలే నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు బదిలీ అయ్యింది.

సుప్రీం కోర్టు ప్రజా ప్రతినిధులపై కేసుల్ని రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జగన్ ఆస్తుల కేసులు కూడా రోజువారీ విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే హెటిరో, అరబిందో ఛార్జ్‌షీట్‌ ఇటీవలే నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు బదిలీ అయ్యింది.. ఈ విచారణలో భాగంగా ఈడీ కోర్టు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, 11న నెల్లూరు జిల్లాలో అమ్మఒడి రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉంది. అదే రోజు ఈడీ కోర్టుకు రావాలని సమన్లు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. ఆ రోజు జగన్ కోర్టుకు హాజరవుతారా? లేదా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here