కుటుంబ ప్రగతికి విద్య దోహదపడుతుంది

70
ఏయూ పూర్వవిద్యార్థుల సంఘం వార్షిక సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని తన తండ్రి దివండత రాజశేఖరరెడ్డి చిత్రపటంతో రూపొందించిన జ్ఞాపికతో సత్కరిస్తున్న దృశ్యం
  • ఏయూ అభివృద్ధిలో పూర్వవిద్యార్థులు భాగం కావాలి

  • రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి ఆకాంక్ష

విశాఖపట్నం, డిసెంబర్ 13 (న్యూస్‌టైమ్): కుటుంబ రూపురేఖలను మార్పుచేసే శక్తి విద్యకు మాత్రమే ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం బీచ్‌ రోడ్డులోని కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏయూ పూర్వవిద్యార్థుల సంఘం వార్షిక సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ముందుగా వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.

ఈ సందర్భంగా పూర్వవిద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతీ విశ్వవిద్యాలయంలో పూర్వవిద్యార్థుల సంఘాలు చురుకైన భూమికను పోషించాలన్నారు. తాము చదువుకున్న విశ్వవిద్యాలయానికి చేయూతనివ్వడానికి ఎప్పుడూ పూర్వవిద్యార్థులు ముందుండాలని పిలుపునిచ్చారు. పూర్వవిద్యార్థుల సంఘం రూ 50 కోట్లు కార్పస్‌ ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవాలని తాను ప్రభుత్వ పరంగా మరో 50 కోట్లు రూపాయలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానని ప్రకటించారు.

ఏయూ పూర్వవిద్యార్థుల సంఘం వార్షిక సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి

విద్య మెరుగైన జీవనాన్ని అందిస్తుందని తాను విశ్వసిస్తున్నానన్నారు. ప్రతీ అడుగు ఈ దిశగా వేయాలన్నారు. రాష్ట్రంలోని 45 వేల పాఠశాలలను మూడు దశల్లో 12 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. చదువుల దేవాలయంగా ఆంధ్రవిశ్వవిద్యాలయం నిలుస్తోందన్నారు. దేశంలోని అత్యుత్తమ 5 విశ్వవిద్యాలయాలలో ఒకటిగా ఏయూ నిలవాల్సిన అవసరం ఉందన్నారు. దేశం గర్వించే విధంగా ఏయూ నిలవాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిక్స్‌ దేశాలలో పరిశీలిస్తే భారత్‌లో కేవలం 23 శాతం మంది మాత్రమే ఇంటర్‌ విద్యను దాటి డిగ్రీ స్తాయికి వెళ్లడం జరుగుతోందన్నారు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందన్నారు.

2020 జూన్‌ నుంచి రాష్ట్రంలో ఒకటి నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడం జరుగుతుందన్నారు. నాలుగు సంవత్సరాలలో విద్యార్థి పదోతరగతి ఆంగ్లంలో పరీక్ష రాయడం సాధ్యపడుతుందన్నారు. దీనికి అవసరమైన ప్రణాళికలను సిద్దం చేస్తున్నామన్నారు. ఈ ప్రక్రియలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, వాటిని అధిగమిస్తామన్నారు. అధ్యాపకులకు శిక్షణ, విద్యార్థులకు బ్రిడ్జికోర్సుల రూపకల్పన జరుపుతామన్నారు. ఉపాధిని అందించే విధంగా కోర్సుల రూపకల్పన జరగాల్సి ఉందన్నారు.

దీనిలో భాగంగా డిగ్రీ, ఇంజనీరింగ్‌లో హానర్స్‌ను ప్రవేశపెడతామన్నారు. ఒక సంవత్సరం పూర్తిగా ప్రత్యక్ష శిక్షణ అందించి, ఉపాధికి ఉపయుక్తంగా విద్యార్థిని తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. చిన్నారులను చదివించడానికి తల్లిదండ్రులు అప్పులు చేయాల్సిన అవసరం లేకుండూ పూర్తి రీయింబర్స్‌మెంట్‌, విద్యాదీవెన పథకంలో వసతికి అదనంగా మరో రూ 20 వేలు అందిస్తామన్నారు. ఉన్నత విద్యా రంగాన్ని పూర్తిస్థాయిలో ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.

ఏయూ పూర్వవిద్యార్థుల సంఘం ప్రత్యేక సంచికను వార్షిక సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీపీ గుర్నాని, గ్రంథి మల్లిఖార్జునరావు (జీఎంఆర్), ఏయూ వీసీ ప్రసాదరెడ్డి, మంత్రులు ఆదిమూలపు సురేష్‌, కురసాల కన్నబాబు తదితరులతో కలిసి ఆవిష్కరించినప్పటి దృశ్యం

టెక్‌ మహేంద్ర సీఈవో సి.పి. గుర్నానీ మాట్లాడుతూ ఆంధ్రవిశ్వవిద్యాలయంతో సంయుక్తంగా పనిచేస్తామన్నారు. మహానేత వై.ఎస్‌ రాజశేఖర రెడ్డి కన్న కలలను సాకారం చేద్దామన్నారు. టెక్‌మహేంద్ర సంస్థకు మహానేత శంకుస్థాపన చేసారని, నేడు 1200 మందికి ఉపాధిని కల్పిస్తున్నామని, దీనికి 6 వేలకు పెంచుతామన్నారు. కలసి పనిచేస్తే సాధ్యం కానిది లేదన్నారు. నిరంతరం నేర్చుకోవడం, సంపాదించడం, సమాజానికి తిరిగి ఇవ్వడం అనే మూడు అంశాలను ప్రతీ వ్యక్తి ఆచరణలో చూపాలన్నారు.

ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి. ప్రసాద రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చొరవతో ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల సీట్లు రెట్టింపు చేయడం సాధ్యపడిందన్నారు. అక్వాసంస్థలో ఏంఓయూ, జిఎంఆర్‌ హాస్టల్‌ బ్లాక్‌, లవ్‌ అండ్‌ కేర్‌ సంస్థ రీడింగ్‌ రూమ్‌, హూన్‌ సంస్థలో నైపుణ్య శిక్షణ వంటివి కేవలం గత ఆరు నెలల కాలంలోనే సాకారం అయ్యాయన్నారు. ఆచార్యుల పదవీ విరమణలతో తాత్కాలిక ఉద్యోగులతో వర్సిటీని నిర్వహణ జరుగుతోందన్నారు. వర్సిటీ రహదారుల నిర్వహణ జీవీఎంసీ స్వీకరించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ముఖ్య మంత్రిని కోరారు. యువతకు వై.ఎస్‌ జగన్‌ మోహన రెడ్డి రోల్‌మోడల్‌గా నిలుస్తున్నారన్నారు.

పూర్వవిద్యార్థుల సంఘం వ్యవస్థాపక చైర్మన్‌, జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు మాట్లాడుతూ విద్యా రంగాన్ని ప్రోత్సహించే ముఖ్యమంత్రి నేడు రాష్ట్రం కలిగి ఉండటం మంచి పరిణామమన్నారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యా భోధన మంచి పరిణామమన్నారు. ఆంగ్ల భాష ఉన్నత అవకాశాలకు వారధిగా నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి దూరదృష్టి అభినందనీయమన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం శతాబ్ధం దిశగా అడుగులు వేస్తోందన్నారు.

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ అంబేద్కర్‌ సూచించిన విధంగా ఆంగ్ల మాధ్యమాన్ని రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టారన్నారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు.విద్యా రంగంలో చేస్తున్న మార్పులను దేశం ఆసక్తిగా చూస్తోందన్నారు. 21వ శతాబ్ధానికి అవసరమైన నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందిచడం ఎంతో అవసరమన్నారు.

పూర్వవిద్యార్థుల సంఘం చైర్మన్‌ ఆచార్య బీల సత్యనారాయణ అతిధులకు ఆహ్వానం పలికారు.

గ్రంధిమల్లికార్జున రావు నూతనంగా నిర్మించి ఇవ్వనున్న హాస్టల్‌ సముదాయం, లవ్‌ అండ్‌ కేర్‌ సంస్థ నిర్వాహకులు యేసుపాదం నిర్మించి ఇవ్వనున్న రీడింగ్‌ రూమ్‌ భవనాల నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. పూర్వవిద్యార్థుల సంఘం సంచికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాస రావు, ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణ, సత్యవతి,గొట్టేటి మాధవి, శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి, గుడివాడ అమర్‌నాథ్‌, చెట్టి ఫల్గుణ, విఎంఆర్‌డిఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌, లవ్‌ అండ్‌కేర్‌ సంస్థ అధినేత పి.యేసుపాదం, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌, ఆపూస ఉపాద్యక్షులు మాజీ డీజీపీ ఎన్‌.సాంబశివ రావు, కార్యదర్శి బి.మోహన వెంకట రామ్‌, కుమార్‌ రాజ, మాజీ వీసీలు, ప్రిన్సిపాల్‌ల్స్‌,ఆచార్యులు, పూర్వవిద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

కార్యక్రమంలో భాగంగా పలువురు పూర్వవిద్యార్థులు తమ అనుభవాలను వేదికపై పంచుకున్నారు. పలువురు పూర్వవిద్యార్థులను ముఖ్యమంత్రి సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంసృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.