అనంతపురం, ఆగస్టు 25 (న్యూస్‌టైమ్): అక్రమంగా పాఠ్యపుస్తకాల విక్రయాలతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలని మంగళవారం నాడు ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, ఎస్ఎఫ్, ముస్లిం విద్యార్థి సంఘం, ఎన్ఎస్ఎస్ఎఫ్, ఏఎస్ ఓ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ఉన్న నారాయణ పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జాన్సన్ బాబు, మనోహర్, పిడిఎస్‌యు నరేష్ యనమల, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సురేష్, బిసిఎస్ఎఫ్ విష్ణు, ముస్లిం విద్యార్థి సంఘం కిరణ్, ఎన్ఎస్ఎస్ఎఫ్ ఆలం, ఏ ఎస్ఓ ఓబులేష్, ఏఐఎస్ఎఫ్ కుల్లాయి స్వామి, మాట్లాడుతూ విద్యాశాఖ అధికారుల అండతోనే విద్యా దోపిడీ జరుగుతోందని ఉదాహరణనే నారాయణ పాఠశాలలో అక్రమ పాఠ్యపుస్తకాల విక్రయాలే నిదర్శనమన్నారు. పలుమార్లు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందారు అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నారాయణ విద్యాసంస్థల పేరును పాఠ్యపుస్తకాలపైన ముద్రించి విక్రయిస్తున్న విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తూ ఉండటం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు.

జిల్లాలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న నారాయణ విద్యా సంస్థలపైన తక్షణం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు. కరోనా వ్యాప్తి ఉన్న సమయంలోనూ ఆన్లైన్ తరగతులు, పాఠ్యపుస్తకాలు, ముందస్తు అడ్మిషన్లు, కన్ఫర్మేషన్ ఫీజులతో వివిధ రకాల ఫీజుల పేర్లతో నారాయణ విద్యాసంస్థలు విద్యను మాఫియా దందాలాగా కొనసాగించారన్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వం, జిల్లా ఉన్నత స్థాయి అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడం శోచనీయం అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ విద్యా దోపిడీకి అడ్డుకట్ట వేయాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణస్వామి, కేశవ, అబ్దుల్, తదితరులు పాల్గొన్నారు.