సమర్థవంతంగా సర్వేలెన్స్ ప్రణాళిక అమలు

0
11 వీక్షకులు
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న రాజీవ్ గౌబ

ఒంగోలు, ఏప్రిల్ 25 (న్యూస్‌టైమ్): హాట్ స్పాట్, కంటైన్‌మెంట్ జోన్లు వున్నచోట ప్రత్యేక దృష్టి సారించి కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు సర్వేలెన్స్ ప్రణాళిక సమర్థవంతంగా అమలుచేయాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ పరిస్థితులపై ఆయన ఢిల్లీ నుండి శనివారం ఉదయం రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిక ప్రాంతాల ఉన్నతాధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాట్ స్పాట్, కంటైన్‌మెంట్ జోన్లు వున్న ప్రాంతాలలో ఎటువంటి షాపులు తెరవడానికి వీలు లేదని కేంద్ర హోం మంత్రిత్వశాఖ జారీచేసిన ఉత్తర్వులలో స్పష్టం చేసిందన్నారు. మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాల్లో షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌‌లో రిజిస్టర్ అయిన షాపులు మాత్రమే తెరవవచ్చని తెలిపారు.

కిరాణా షాపులు, నిత్యవసర, అత్యవసర మందులు, ఫార్మసీ షాపులు కేంద్రం సూచించిన షరతులకు లోబడి మాత్రమే తెరిచేలా చూడాలన్నారు. దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ మాత్రం తెరవడానికి వీలులేదన్నారు. గ్రామీణ ప్రాంతాలలో షాపింగ్ కాంప్లెక్స్‌లు, జన సమూహాలు ఎక్కువగా గుమికూడే ప్రాంతాలలో షాపులు తెరవకూడదని భౌతిక దూరం పాటించే అవకాశం వుండదని, వైరస్ వ్యాప్తికి అవకాశం కల్పించినట్లు వుంటుందని ఆయన వివరించారు.

అనుమతించిన షాపులలో 50 శాతం మంది ఉద్యోగులతోనే నడిపేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు ఇచ్చిన సడలింపుల అంశాలు పరిగణలోనికి తీసుకొని వ్యాపార కార్యకలాపాలు నిర్వహించవలసి వుంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం, ఉపాధి హామీ పథకం అమలు, తయారీ రంగాలు, ఎగుమతులకు సంబంధించి గతంలో కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలుకు కృషి చేయాలన్నారు.

సమావేశంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్, ఎస్.పి. సిద్ధార్డ్ కౌశల్

అందరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, పనిచేసే చోట శానిటైజేషన్ ఎప్పటికప్పుడు చేపట్టేలా చూడాలన్నారు. నిత్యవసర సరుకులు రవాణాకు సంబంధించి చెక్ పోస్టుల వద్ద ఎటువంటి అవరోధం కలుగకుండా చూడాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాలపై వుందన్నారు. నిర్మాణ రంగం, పారిశ్రామిక రంగానికి సంబంధించి స్కిల్స్ అన్ స్కిల్ కార్మికులను వినియోగంచుకునే అంశంలో స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ పక్కాగా అమలు చేసేలా చూడాలని సూచించారు. ఈ నెల 20వ తేదీ నుండి లాక్‌డౌన్ నుండి గ్రామీణ ప్రాంతాలలో ఇచ్చిన మినహాయింపులు ఏ విధంగా అమలు చేస్తున్నది రాష్ట్రాల వారీగా సమీక్షించారు. అదే విధంగా లాక్‌డౌన్ వలన వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీల స్థితిగతులు వీరికి అందుతున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు.

లాక్‌డౌన్ అమలుకు సంబంధించి పలు అంశాలపై ఆయన పంజాబ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో సమీక్షించారు. వీడియో సమావేశంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్, జిల్లా ఎస్.పి. సిద్ధార్డ్ కౌశల్, డి.ఆర్.ఓ. వెంకట సుబ్బయ్య, ప్రత్యేక కలెక్టర్ గంగాధర్ గౌడ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పల నాయుడు, అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పద్మావతి, డి.సి.హెచ్.ఎస్. డాక్టర్ ఉషారాణి, ఎన్.ఐ.సి. అధికారి వెంకట సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here