గ్రామీణ సమస్యల పరిష్కారానికి కృషి: ఎంపీ రెడ్డెప్ప

91

చిత్తూరు, జూన్ 23 (న్యూస్‌టైమ్): చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్ వెనుకబడిన ప్రాంతమని, ఈ ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తానని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు కె. రెడ్డెప్ప పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక జిల్లా ప్రజా పరిషత్ సమావేశపు మందిరంలో జిల్లా ప్రజాపరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిత్తూరు ఎం.పి మాట్లాడుతూ చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్‌కు అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపారు. చిత్తూరు పార్లమెంట్ పరిధిలో సెంట్రల్ స్కూల్‌ల ఏర్పాటుకు కృషి చేస్తానని, అలాగే చిత్తూరు మీదుగా వెళ్లే అన్ని రైళ్లు చిత్తూరులో ఆగే విధంగా కృషి చేస్తానని తెలిపారు.

కేంద్రం నుండి రాష్ట్రానికి అందవలసిన ఆర్థిక సాయంపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో భాగంగా ఎంఎల్సీలు రాజసింహులు, గౌనివాని శ్రీనివాసులు మాట్లాడుతూ తాగునీటి సమస్యలపై చర్యలు చేపట్టాలని కోరారు. ఎంఎల్సీ యండవల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యా శాఖలో పెండింగ్‌లో ఉన్న పోస్ట్‌లను బర్తీ చేయాలని కోరారు. సమావేశంలో భాగంగా కొత్తగా ఎన్నికైన పీలేరు, తంబళ్ళపల్లె, మదనపల్లె, పలమనేరు, చిత్తూరు, పూతలపట్టు, శ్రీకాళహస్తి, సత్యవేడు శాసన సభ్యులు చింతల రామచంద్రారెడ్డి, ద్వారకనాథ రెడ్డి, వెంకటే గౌడ్, ఎ.శ్రీనివాసులు, ఎం.ఎస్.బాబు, బియ్యపు మధుసూధనరెడ్డి, ఆదిమూలం శేఖర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్నదని దీనిపై అధికారులు వెంటనే స్పందించి సత్వర చర్యలు చేపట్టాలని కోరారు.

గత ఐదేళ్లుగా జెడ్పిటిసిలు, ఎంపిటిసిలుగా సేవలందించిన వారందరికీ చైర్‌మన్ సన్మానం చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పి సిఈఓ ఓబులేశు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.