‘ఎగ్‌టేరియన్స్‌’… వెరీ ‘గుడ్డు’

347

పేరుకే కాదు, పోషకాహారంగా కూడా గుడ్డు ప్రసిద్ధిచెందింది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఓ ఆమ్లెట్‌ వేసుకుని తినేయడం, ఉడికించిన కోడిగుడ్లతో కూరలు చేసుకోవడం తెలిసిందే! అయితే వాటితో ఎప్పుడూ ఈ వంటలేనా? వాటితో ఎప్పటికప్పుడు కొత్త రుచులను ప్రయత్నించాలనే ప్రయోగాలు చేసేవారు అనేకం. గుడ్డువల్ల ఆరోగ్యం మెరుగవుతుందని ఇప్పుడు చెప్పుకువస్తున్న పోషకాహార నిపుణులే ఒకప్పుడు గుడ్డువల్ల స్థూలకాయం వస్తుందని, గుండెపోటు తరహా సమస్యలు తలెత్తుతాయని జనాన్ని భయపెడుతూ వచ్చేవారు. చివరికి అవన్నీ కేవలం కల్పితాలు మాత్రమేనని అనేక ప్రయోగాలు రుజువుచేశాయనుకోండి.

ఈవారం కొన్ని కొత్త రకం గుడ్డు వంటకాల గురించి చర్చించుకుంటే, సూఫ్లె తయారీ మొదటిది. దీని తయారీకి కావల్సినవి: బ్రెడ్‌పొడి – అరకప్పు, వెన్న – పావుకప్పు, మైదా – రెండు టేబుల్‌స్పూన్లు, పాలు – కప్పు, టొమాటో ముద్ద – మూడు టేబుల్‌స్పూన్లు, పుదీనా తరుగు – టేబుల్‌స్పూను, గుడ్లు – మూడు (తెల్ల, పచ్చసొనల్ని విడివిడిగా తీసుకోవాలి), చీజ్‌ తురుము – గుప్పెడు, ఉప్పు – కొద్దిగా, ఉల్లిపాయ – ఒకటి.
తయారీ: వెడల్పాటి గాజు పాత్రలో బ్రెడ్‌పొడి పరిచి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిని పొయ్యి మీద పెట్టి వెన్న కరిగించాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు వేయించాలి.

రెండు నిమిషాలయ్యాక మైదా వేసి వేయించి దింపేయాలి. ఇందులో పాలు పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. దీన్ని మళ్లీ సన్ననిమంటపై ఉంచాలి. మైదా ఉడికి చిక్కని సాస్‌లా తయారయ్యాక దింపేయాలి. ఇందులో టొమాటో ముద్ద, పుదీనా తరుగు, కొద్దిగా ఉప్పు కలిపి పెట్టుకోవాలి. ఐదు నిమిషాల తరవాత గిలకొట్టిన పచ్చసొనను ఈ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. తరవాత తెల్లసొన వేసుకోవాలి.

ఈ మిశ్రమాన్నంతా ముందుగా బ్రెడ్‌పొడి పరిచిన గాజుపాత్రలో పరిచి పైన చీజ్‌ తురుము వేయాలి. ఈ పాత్రను ముందుగా వేడి చేసుకున్న ఓవెన్‌లో ఉంచి ఇరవై అయిదు నిమిషాలు బేక్‌ చేసుకుంటే చాలు. సూఫ్లె సిద్ధం.

కొంత మంది తమను తము ‘ఎగ్‌ టేరియన్స్‌’గా చెప్పకుంటుంటారు. అందుకు కారణం వారు మాంసాహారం తీసుకోకపోయినా గుడ్డులో అధిక పోషకాలు ఉన్నందు వల్ల, గుడ్డును తినడానికి ఎక్కువగా ఇష్టపడటం వల్ల ఎగేటేరియన్లుగా ఫిక్స్‌ అయిపోతారు. అంతే కాకుండా గుడ్డును మాసాంహారం అంటారు కానీ, చాలా మంది శాకాహారంగానే భావిస్తున్నారు. కాబట్టే శాకాహారులు కూడా గుడ్డును తినడం మొదలు పెట్టేసారు.

గుడ్డులో చెప్పుకోలేనన్ని ఆరోగ్యప్రయోజనాలు మొండుగా ఉన్నాయి. గుడ్డు మంచి పౌష్టికాహారం. చిన్నపిల్లలు మొదలుకొని, ముసలివారి వరకు డాక్టర్లు గుడ్డు తినమని చెబుతారు. కోడిగుడ్డు ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రొటీన్లను అందజేస్తుంది. పోష కాహారలేమితో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా వైద్యులు సలహాలిస్తుంటారు. గుడ్డులో పలురకాల లవణాలు, అరుదైన లవణాలతో పాటు ఫాస్పరస్‌, అయోడిన్‌, సెలీనియం, ఐరన్‌, జింక్‌లు ఉన్నాయి. ఇవన్నీ శరీరానికి మేలుచేసేవే. ప్రతి రోజూ గుడ్డు తినడం వల్ల గుండెజబ్బు వస్తుందని వేడిచేస్తుందనే భావన చాలా మందిలో ఉంటుంది.