నిఘా నీడలో ఎన్నికల ప్రచారాలు

193
  • సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు

  • ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలపై కన్ను

కడప, మార్చి 29 (న్యూస్‌టైమ్): సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం నిఘా పెట్టింది. ఇప్పటికే పలు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలను అడ్డుకుంటోంది. నియోజక వర్గాల వారీగా సరిహద్దు ప్రాంతాలు, జిల్లా సరిహద్దు ప్రాంతాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయడంతో నగదు, మద్యం, బహుమతులు ఇలా ఎన్నో రకాల వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నారు.

కాగా ఎన్నికల్లో అక్రమాలను నివారించేందుకు జిల్లా కంప్లెంట్‌ సెల్‌కు గానీ, ఆయా నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకుగానీ, కలెక్టర్‌ కార్యాలయంలోగానీ నేరుగా ఫిర్యాదు చేయవచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో పాటుగా సీవిజిల్‌ యాప్‌లోనూ, 1950 టోల్‌ఫ్రీ నంబర్‌లో గానీ ఫిర్యాదు చేయవచ్చని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. టీవీ ప్రసార మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలపై కూడా కలెక్టర్‌ కార్యాలయంలో నిఘా ఉంచారు.

ఇందుకోసం ప్రత్యేకంగా టీవీలు, కంప్యూటర్లు ఏర్పాటు చేసి టీవీల్లో వచ్చే ప్రకటనలు, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, మెయిల్స్‌, వాట్సప్‌లలో వచ్చే ప్రచారాలపై కూడా పరిశీలించి ఆయా అభ్యర్థుల ఖాతాల్లో జమ చేసేందుకు సిబ్బంది నిర్విరామంగా నమోదు చేసుకుంటున్నారు. అంతేగాకుండా 1950లో వచ్చే ఫిర్యాదులను కూడా నమోదు చేసుకుంటూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇందుకోసం కలెక్టర్‌ కార్యాలయంలో అన్ని విభాగాలను ఏర్పాటు చేశారు.