అక్రమాలకు తావులేకుండా ఎన్నికలు: కలెక్టర్‌

155

నెల్లూరు, మార్చి 17 (న్యూస్‌టైమ్): అక్రమాలకు తావులేకుండా జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని, ఈ విషయంలో పోటీచేసే అభ్యర్ధులు, అన్ని రాజకీయ పార్టీలు తమకుు పూర్తిగా సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు అన్నారు. సోమవారం ఫారం-1 పబ్లిక్‌ నోటీస్‌ అనంతరం నామినేషన్‌ల ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు.

ఆదివారం సాయంత్రం కలెక్టర్‌ బంగ్లాలోని తన ఛాంబర్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నామినేషన్‌లు దాఖలు చేసే సమయంలో అభ్యర్థితోపాటు ఐదుగురికి అనుమతి ఉంటుందని, అఫిడవిట్‌ను కూడా తీసుకుంటామన్నారు. ప్రతి రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో రెండు డిజిటల్‌ గడియారాలతోపాటు గేటువద్ద వీడియో కెమెరా, ఛాంబర్‌లోపల 360 డిగ్రీల కోణాల్లో చిత్రీకరించేలా నాలుగు కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.

పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి రూ.25 వేలు, అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి రూ.10 వేలు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుందన్నారు. స్వతంత్ర అభ్యర్థికి సంబంధించి చెక్‌లిస్ట్‌ ద్వారా పతి ప్రతిపాదనలను అందించవచ్చని పేర్కొన్నారు. ఇలాగే ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్‌ల ప్రక్రియ కొనసాగుతుందని, 26న స్క్రూట్నీ, 28న విత్‌డ్రాల్స్‌ ముగిసిన తర్వాత తుది జాబితాను ప్రకటిస్తామని వివరించారు. ఓటర్ల మార్పులు, చేర్పులకు సంబంధించి 25వ తేదీలోపు పూర్తి చేస్తామని అన్నారు.

ఏప్రిల్‌ 9న మూడో రాండమైజేషన్‌ ద్వారా ఆయా పోలింగ్‌ స్టేషన్‌లకు వీవీఎంల కేటాయిస్తారని చెప్పారు. 11వ తేదీన ఎన్నికల ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎంపీ అభ్యర్థి రూ. 70 లక్షలు, అసెంబ్లీ అభ్యర్థి రూ. 28 లక్షలు వరకు ఖర్చుకు అనుమతి ఉందన్నారు. ఎస్పీ ఐశ్వర్యరస్తోగి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 6 వేల సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. ఈ సమావేశంలో జేసీ వెట్రిసెల్వి పాల్గొన్నారు.