బొజ్జన్నకొండపై తూర్పు నావికాదళ బ్యాండ్‌ ప్రదర్శన

విశాఖపట్నం, ఆగస్టు 6 (న్యూస్‌టైమ్): 74వ స్వతంత్ర దినోత్సవాల్లో భాగంగా, కరోనా పోరాట యోధులకు కృతజ్ఞతలు చెబుతూ, విశాఖపట్నంలోని బొజ్జనకొండలో తూర్పు నావికాదళ బ్యాండ్‌ ప్రదర్శన నిర్వహించింది. ముఖ్య అతిథి, అనకాపల్లి ఎంపీ డాక్టర్ బీశెట్టి వెంకట సత్యవతికి, జిల్లా యంత్రాంగం సిఫారసు చేసిన కరోనా పోరాట యోధులకు నావికాదళ కమాండెంట్‌ సంజీవ్‌ ఇస్సార్‌ స్వాగతం పలికారు. గంటపాటు సాగిన ప్రదర్శనలో మార్షల్, ఆంగ్ల పాప్ సంగీతం నుంచి ఉత్సాహభరిత దేశభక్తి పాటలను ప్రదర్శించారు.

ప్రజలకు సుపరిచితమైన ‘సునో గోర్‌ సే దునియా వాలో’, ‘ఆయే మేరే వతన్‌ కే లోగోన్’ పాటలతోపాటు త్రివిధ దళాల పాటలను సైతం ప్రదర్శించి ఉల్లాసవంత ముగింపునిచ్చారు. డీడీ సప్తగిరి, డీడీ యాదరిగిలో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమైంది. స్వతంత్ర దినోత్సవ సన్నాహాల్లో భాగంగా, ఈనెల 1వ తేదీ నుంచి మిలిటరీ బ్యాండ్లు దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తున్నాయి. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న కరోనా యోధులను అభినందిస్తూ తొలిసారి ఈ విధంగా మిలిటరీ బ్యాండ్‌ ప్రదర్శన జరిగింది.