న్యూఢిల్లీ, జులై 24 (న్యూస్‌టైమ్): కేంద్ర యువ‌జ‌న‌ స‌ర్వీసులు, క్రీడ‌ల శాఖ మంత్రి, కిర‌ణ్ రిజ్జు కామ‌న్ వెల్త్ దేశాల మంత్రుల స్థాయి స‌మావేశంలో దృశ్య‌మాధ్యమం ద్వారా పాల్గొన్నారు. కోవిడ్ -19 మ‌హ‌మ్మారి అనంత‌ర కాలంలో తిరిగి క్రీడా పొటీల‌ను పున‌రుద్ధ‌రించ‌డానికి సంబంధించి భార‌త దేశ ఆలో‌చ‌న‌ల‌ను, కామ‌న్ వెల్త్ దేశాల‌తో పంచుకునేందుకు, కోవిడ్ అనంత‌ర కాలంలో స‌మ‌ష్టి క్రీడా విధానాన్ని రూపొందించడంలో త‌న వంతు పాత్ర‌ను పోషించేందుకు ఆయ‌న ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

అన్ని కామ‌న్ వెల్త్ దేశాల నుంచి ప్ర‌తినిధులు పాల్గొన్న ఈ అంత‌ర్జాతీయ వేదిక‌పై మంత్రి కిరణ్ మాట్లాడుతూ ‘‘కామ‌న్ వెల్త్ దేశాల స‌భ్యులుగా మ‌నం అన్ని అంశాల‌పై, ప్ర‌త్యేకించి ఇలాంటి స‌మ‌యంలో సంఘీభావంతో నిల‌బ‌డాలి. అన్ని కామ‌న్ వెల్త్ దేశాల‌తో క‌లిసి ముందుకు సాగ‌డానికి స‌హ‌క‌రించేందుకు ఈ వేదిక‌లో ఉండ‌డం ఆనందంగా ఉంది. ఇత‌ర దేశాల‌కు చెందిన మంత్రులు ప్రస్తావించిన అంశాల‌లో చాలావ‌ర‌కు ఇండియాకూ వ‌ర్తించేవే. అయితే ఈ మ‌హమ్మారి స‌మ‌యంలో చెప్పుకోద‌గ్గ స్థాయిలో సాధించిన‌వి, నేర్చుకున్న‌వీ ఉన్నాయి. వాటిని నేను మీతో పంచుకోద‌ల‌చాను.’’ అని ఆయ‌న అన్నారు.

కోవిడ్ మ‌హమ్మారి స‌మ‌యంలో పౌరులు శారీర‌క దృఢ‌త్వాన్ని క‌లిగి ఉండ‌డానికి గ‌ల ప్రాధాన్య‌త‌ను తెలియ‌జెప్తూ కేంద్ర క్రీడ‌ల శాఖమంత్రి కిర‌ణ్ రిజ్జూ ‘‘ఈ స‌మావేశంలోని మంత్రులంద‌రికీ నేను ఒక ముఖ్య‌మైన కార్య‌క్ర‌మం గురించి చెప్ప‌బోతున్నాను. అది ఫిట్ ఇండియా ఉద్య‌మం గురింది. దీనిని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ గ‌త ఏడాది ప్రారంభించారు. కొవిడ్‌ను ఎదుర్కొవ‌డంలో ఇది ఎంతో ఉప‌యోగ‌క‌ర‌మైన‌ది. ఎందుకంటే, కొవిడ్ స‌మ‌యంలో శ‌రీర దృఢ‌త్వం క‌లిగి ఉండ‌డం, రోగ‌నిరోధ‌క శ‌క్తి రెండూ ఎంతో ముఖ్య‌మైన‌వి. దృఢ‌త్వం క‌లిగి ఉండ‌డంపై ఇండియా ప్ర‌జ‌ల‌కు విజ‌యవంతంగా అవ‌గాహ‌న క‌ల్పించింది. ఇందుకు ప్ర‌త్యేకంగా ఎన్నో ఆన్‌లైన్ ప్ర‌చార కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. కోవిడ్ మ‌హ‌మ్మారి స‌మ‌యంలో ఫిట్‌నెస్ గురించి, ప్ర‌జ‌ల శ్రేయ‌స్సుకు సంబంధించి ప‌లు కార్య‌క్ర‌మాలు ప్ర‌చారం చేయ‌డం జ‌రిగింది. నిపుణులు, ఆరోగ్యం, పౌష్టికాహారం, వ్యాయామం వంటి వాటిపై త‌మ సూచ‌న‌లు అంద‌జేశారు. అన్ని వ‌య‌సుల వారూ వీటిని విజ‌య‌వంతంగా ఉప‌యోగించుకున్నారు.’’ అని ఆయ‌న అన్నారు. కామ‌న్ వెల్త్ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ పాట్రీసియా స్కాట్‌లాండ్ క్యుసి, కోవిడ్ మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు ఇండియా చేప‌ట్టిన ప్ర‌త్యేక ‌కార్య‌క్ర‌మాన్ని అభినందించారు.

క్రీడ‌ల‌కు సంబంధించి వైవిధ్యంతోకూడిన వివిధ న‌మూనాల గురించీ ఆయ‌న ఈ సందర్భంగా ప్ర‌స్తావించారు. క్రీడాకారుల‌కు ఆన్‌లైన్ శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు ఎలా నిర్వ‌హిస్తున్న‌దీ, నైపుణ్యాభివృద్దికి కోచ్‌లకు ఎలాంటి శిక్ష‌ణ‌నిస్తున్న‌దీ ఆయ‌న ఈ సంద‌ర్భంగా వివ‌రించారు. ‘‘వివిధ స్థాయిల‌లోని వేలాది మంది క్రీడాకారులు ఇలాంటి శిక్ష‌ణ‌లో పాల్గొన‌డాన్ని, పెద్ద ఎత్తున కోచ్‌లు దీనినుంచి ప్ర‌యోజ‌నం పొంద‌డాన్ని మేం గ‌మ‌నించాం’’ అని ఆయ‌న అన్నారు.

రెండోద‌శ లాక్‌డౌన్ స‌మ‌యంలో, క్రీడాప్రాంగ‌ణాల‌లో శిక్ష‌ణ‌,క్రీడ‌ల కార్య‌క‌లాపాల నిర్వ‌హ‌ణ‌పై భార‌త ప్ర‌భుత్వం దృష్టి పెట్ట‌డం జ‌రుగుతున్న‌ట్టు ఆయ‌న పున‌రుద్ఘాటించారు. ‘‘ప్ర‌భుత్వం కొన్ని ర‌కాల క్రీడా కార్య‌క్ర‌మాల‌ను కొన్నిప‌రిమితుల‌తో, కోవిడ్ ముందుజాగ్ర‌త్త‌ల‌కు సంబంధించిన ప్ర‌మాణాల‌ను క‌ఠినంగా పాటిస్తూ నిర్వ‌హించేందుకు అనుమ‌తించింది. ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ప్ర‌తి క్రీడా సంస్థ పాటించాల్సి ఉంటుంది. ఒలింపిక్ క్రీడ‌ల‌లో ఆడ‌బోయే మా ఉన్న‌త స్థాయి క్రీడాకారులకు, ఇటీవ‌ల ప్ర‌త్యేక క్యాంపుల‌లో శిక్ష‌ణ ప్రారంభ‌మైంది. నేను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల క్రీడాశాఖ‌ల మంత్రుల‌తో, జాతీయ క్రీడ‌ల ఫెడ‌రేష‌న్‌తో మాట్లాడాను. నెమ్మ‌దిగా క్రీడా కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించాల్సిందిగా నేను వారికి సూచించాను. ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని పెంచేందుకు ఇది అవ‌స‌రం. సెప్టెంబ‌ర్ లేదా అక్టోబ‌ర్ నుంచి ఇండియాలో క్రీడా కార్య‌క్ర‌మాలు ఉండ‌బోతాయని నేను భావిస్తున్నాను. అంతేకాదు పెద్ద పెద్ద క్రీడా కార్య‌క్ర‌మాల‌ను పున‌రుద్ధ‌రించే అంశం కూడా ప‌రిశీల‌న‌లో ఉంది’’ అని కిర‌ణ్ రిజ్జు చెప్పారు. కోవిడ్ మ‌హ‌మ్మారికి వ్య‌తిరేకంగా పోరాటంలో యువ‌జ‌న వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన యువ‌జ‌న వాలంటీర్ల కృషి గురించి ఆయ‌న ప్ర‌స్తావిస్తూ, ‘‘యువ‌జ‌న స‌ర్వీసుల శాఖ మంత్రిగా, మా వ‌ద్ద 60 ల‌క్ష‌ల మంది యువ‌జ‌న వలంటీర్లు ఉన్నారు. వీరు పౌర సంస్థ‌లు, ప్ర‌జ‌ల‌కు కోవిడ్ సంద‌ర్బంగా నిరంత‌రాయంగా త‌మ సేవ‌లు అందించారు. ప్ర‌స్తుతం వీరు ప్ర‌భుత్వం ప్రారంభించిన కొత్త ప‌థ‌కాల‌పైన‌, అన్‌లాక్ ద‌శ‌లొ పేద‌ల‌ను ఆదుకునేందుకు అందిస్తున్న స‌హాయంపైన ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. ప్ర‌భుత్వం పేద‌ల‌కు న‌వంబ‌ర్ నెల వ‌ర‌కు ఉచిత రేష‌న్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. మా కార్య‌క‌ర్త‌లు ప‌ట్ట‌ణాలు, మారుమూల ప్రాంతాల‌లో ఈ ప్ర‌భుత్వ‌ ప‌థ‌కాల గురించి వివ‌రించి వారు ల‌బ్ధి పొందేట్టు చేస్తున్నారు’’ అని ఆయ‌న అన్నారు.

కామన్వెల్త్ దేశాల సహకార స్ఫూర్తిని ప్రశంసిస్తూ, రిజ్జూ, ‘‘2022 కామన్వెల్త్ క్రీడలలో, షూటింగ్ విలువిద్య విభాగాలను చేర్చడానికి అంగీకరించినందుకు కామన్వెల్త్ గేమ్స్ కమిటీకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ పోటీలు బ్రిట‌న్‌లోకాక ఇండియాలోనే జ‌ర‌గ‌నున్నాయి. భార‌త దేశ విజ్ఞ‌ప్తిని అంగీక‌రించినందుకు నేను కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటున్నాను. ఇలాంటి ఇచ్చిపుచ్చుకునే వైఖ‌రి కామ‌న్‌వెల్త్‌దేశాల మ‌ధ్య బంధాన్నిబ‌లోపేతం చేయ‌గ‌ల‌దు’’ అని కిర‌ణ్ రిజ్జు అన్నారు.