న్యూఢిల్లీ, జులై 25 (న్యూస్‌టైమ్): దేశంలో అంత‌ర్గ‌త జల ర‌వాణాను ప్రోత్స‌హించేలా కేంద్ర‌ ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌ను ప్ర‌క‌టించింది. జ‌ల ర‌వాణాను అనుబంధ మార్గాలుగా మ‌ర‌ల్చ‌డం, పర్యావరణ అనుకూలమైన, చౌకైన రవాణా విధానాల‌ను ప్రోత్సహించాలన్న భారత ప్రభుత్వ దృష్టి కోణానికి అనుగుణంగా తక్షణమే జలమార్గ వినియోగ ఛార్జీలను ర‌ద్దు చేయాలని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. తొల‌తగా‌ మూడేండ్ల‌ పాటు ఈ ఛార్జీలు మాఫీ చేయబడతాయి. ప్రస్తుతం మొత్తం సరుకు రవాణాలో 2% మాత్రమే జలమార్గాల ద్వారా జ‌రుగుతోంద‌ని కేంద్ర షిప్పింగ్ శాఖ స‌హాయ మంత్రి (స్వ‌తంత్ర హోదా) మ‌న్‌సుఖ్‌ మాండవియా తెలిపారు. జలమార్గ ఛార్జీలను ర‌ద్దు చేయ‌డం వ‌ల్ల పరిశ్రమలు జాతీయ జల మార్గాల ద్వారా త‌మ‌ రవాణా కార్య‌క‌లాపాలు చేప‌ట్టే విధంగా ఆకర్షిస్తుందన్నారు. జ‌ల రవాణా విధానం పర్యావరణ అనుకూలమైనది, చౌకైనది కనుక ఇది ఇతర రవాణా విధానాలపై భారాన్ని తగ్గించడమే కాక దేశంలో వ్యాపారం చేసే సౌలభ్యాన్ని ప్రోత్సహిస్తుంది అని మంత్రి అన్నారు. జాతీయ జలమార్గాలను ఓడ‌ల ద్వారా వాడుకోవ‌డంపై నీటి వినియోగ ఛార్జీలు వర్తిస్తాయి.

ట్రాఫిక్ కదలికల నిర్వహణ మరియు ట్రాఫిక్ డేటా సేకరణలో ఇది ఒక అవరోధంగా ఉంది. ప్రస్తుతం, ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడ‌బ్ల్యూఏఐ) ర‌వాణా నౌక‌ల‌కు జలమార్గ వినియోగ ఛార్జీలను.. స్థూల రిజిస్టర్డ్ టన్ను (జీఆర్టీ) కిలోమీటరుకు రూ.0.02 చొప్పున వసూలు చేస్తుంది. జాతీయ జలమార్గాలపై క్రూయిస్ నడపడానికి కిలో మీటరుకు స్థూల రిజిస్టర్డ్ టన్నుకు (జీఆర్టీ) రూ.0.05గా నిర్ణ‌యించింది. కేంద్రం తాజాగా తీసుకున్న ర‌వాణా ఛార్జీల రద్దు నిర్ణ‌యంతో 2019-20 మ‌ధ్య 72 ఎంఎంటీ గా ఉన్న జలమార్గ ట్రాఫిక్ కదలిక 2022-23 నాటికి 110 ఎంఎంటీల‌కు పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేయ‌డ‌మైంది. ‌ఇది ఈ ప్రాంత ఆర్థిక కార్యకలాపాలు, అభివృద్ధికి ప్రయోజనం చేకూర్చ‌నుంది.