పట్టణాల్లో పర్యావరణ పరిరక్షణ

55

హైదరాబాద్, జనవరి 26 (న్యూస్‌టైమ్): హైదరాబాద్ నగరంతో పాటు, ఇతర నగరాలు, పట్టణాలు కాలుష్య కూపాలుగా మారకుండా పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నగరాల లోపల, బయట ఉన్న అటవీ భూముల్లో విరివిగా చెట్లు పెంచి, దట్టమైన అడవులు ఉండేలా చూడాలని సీఎం కోరారు.

‘‘హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్నది. నగరంలో జనాభా అంతకంతకూ పెరుగుతున్నది. మనది సముద్ర తీరం లేని నగరం. కాలుష్యం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నిర్లక్ష్యం చేస్తే ఇతర నగరాల మాదిరిగా జనజీవనం నరకప్రాయం అవుతుంది. దీనికి విరుగుడుగా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలి. హైదరాబాద్ లోపల, బయట లక్షా 60 వేల ఎకరాల అటవీ భూమి ఉంది. వీటిలో విరివిగా చెట్లు పెంచాలి. దట్టమైన అడవులుగా తీర్చిదిద్దాలి. దీనివల్ల హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు పెరగకుండా, కాలుష్యం పెరగకుండా చూడవచ్చు. నగరంలో కూడా విరివిగా చెట్లు పెంచాలి. హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి బడ్జెట్లలో పదిశాతం నిధులను పచ్చదనం పెంచడానికి ఉపయోగించాలి. ఇతర నగరాలు, పట్టణాల్లో కూడా హరిత ప్రణాళిక రూపొందించాలి. అన్ని పట్టణాల్లో కనీసం వార్డుకొకటి చొప్పున నర్సరీలు ఏర్పాటు చేయాలి. తెలంగాణలోని అన్ని పట్టణాలు పచ్చదనంతో కళకళలాడే విధంగా పట్టణ ప్రగతిలో చర్యలు ప్రారంభించాలి’’ అని ముఖ్యమంత్రి కోరారు.