అంతా జనసేన జెండాల మయం

467

విశాఖపట్నం, నవంబర్ 3 (న్యూస్‌టైమ్): పవన్ కల్యాణ్ పిలుపు మేరకు ఆదివారం జనసేన చేపట్టిన ‘చలో విశాఖపట్నం’ నిరసన కార్యక్రమానికి ఊహించినదానికంటే ఎక్కువే స్పందన కనిపించింది. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పడిన ఇసుక కొరత కారణంగా నిర్మాణ రంగం దెబ్బతినడం, దానిపై ఆధారపడిన కార్మికులు ఉపాధి కోల్పోయి బలవన్మరణాలకు పాల్పడతుతుండడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పవన్ జనసైనికులతో విశాఖ మార్చ్‌ను నిర్వహించారు.

రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా నుంచి కూడా ఈ నిరసనకు పెద్ద సంఖ్యలో పవన్ అభిమానులు తరలిరావడంతో విశాఖ మహానగరం సందడిగా మారింది. అనంతపురం, కర్నూలు, కడప, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా నాయకులు జనసమీకరణ చేసినట్లు పరిస్థితులు కనిపించాయి. వపన్ కల్యాణ్ స్పందించడానికి ముందు నుంచే ఇసుక కొరత, కార్మికుల బలవన్మరణాలపై ఆందోళన వ్యక్తంచేస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ సహా వామపక్షాలు, పలు ప్రజా, కార్మిక సంఘాలు కూడా జనసేన నిరసనకు సంఘీభావం తెలపడంతో అనూహ్య స్పందన కనిపించింది.

ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై, ఇసుక సమస్యపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కార్మిక ప్రదర్శన ఏర్పాటు చేయడం అన్ని విధాలా మంచి పరిణామమే. ఓడినా గెలిచినా ఆ మాత్రం ప్రజలకు అండగా నిలవడం అభినందనీయమనే చెపపాలి. అయితే ఆ ప్రదర్శనకు ‘లాంగ్ మార్చ్’గా నామకరణ చేయడం అభ్యంతరకరం. లాంగ్ మార్చ్ అనే పదాన్ని పవన్ కల్యాణ్ చైనా నుంచి సేకరించినట్టు మనం అర్థం చేసుకోవచ్చు.

1949లో చైనా దేశాన్ని పూర్తిగా విముక్తి చేసి శ్రామికవర్గ రాజ్య స్థాపన కోసం మావో లాంగ్ మార్చ్ పేరుతో కోట్లాదిమంది ప్రజలను రెడ్ ఆర్మీని సమీకరించి వేల కిలోమీటర్లు మార్చ్ నిర్వహించి దేశాన్ని విముక్తి చేశారు. ఆ లాంగ్ మార్చ్ ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపింది. ఇంతటి చరిత్ర కలిగిన దాన్ని తీసుకొచ్చి ఒకసమస్యపై 2 కిలోమీటర్లు కూడా లేని ప్రదర్శనకు నామకరణం చేయటం హాస్యాస్పదంగా ఉంది. ప్రపంచంలో మార్క్సిజం, లెనినిజం ప్రపంచ విముక్తి సిద్ధాంతాలుగా కీర్తి కెక్కాయి. అందుకు తగిన భావజాలం ఆ సిద్ధాంతాలలో ఉన్నాయి.

కానీ పవన్ జనసేన ఏర్పాటుచేసి ప్రజా సమస్యల పరిష్కారంపై పుస్తకం రాసి దానికి ‘పవనిజం’ అని పేరు పెట్టడం మరో అభ్యంతరకరం. దాంట్లో మార్పు కోసం కొన్ని ప్రతిపాదనలు తప్ప దేశ ప్రజల విముక్తి సిద్ధాంతం ఏమీ లేదు. ‘ఇజం’ అంటే వ్యవస్థను సమూలంగా మార్చే ఒక విముక్తి సిద్ధాంతం అని అర్థం. ఏది ఏమైనా మిగతా పార్టీల మాదిరిగానే జనసేన కూడా ధనిక వర్గ స్వభావం కలిగిన పార్టీగానే చూడాలి. అదే సమయంలో ఆ పార్టీ లేదా పవన్ కల్యాణ్ చేస్తున్న కృషిని అభినందించాలి.

మొత్తానికి లాంగ్ మార్చ్ కార్యక్రమం సందర్భంగా నగరాన్ని జనసేన జెండాలతో పార్టీ శ్రేణులు నింపేశారనే చెప్పవచ్చు. రాష్ట్రంలోని పదమూడు జిల్లాలకు చెందిన నియోజకవర్గం స్థాయి నాయకుల పేరు మీద కూడా ఫ్లెక్సీలు, జెండాలు ఇక్కడ కనిపించడం విశేషం. ఇక పవన్ కల్యాణ్ పేరిట జరిగిన ప్రచారం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు.