ప్రయోగాల ‘టైగర్’

0
9 వీక్షకులు
సత్యజిత్ రే
  • 20వ శతాబ్దపు ఉత్తమ దర్శకుల్లో సత్యజిత్‌ రే ఒకరు

సత్యజిత్ రే… భారతదేశంలోని బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత. ప్రపంచ సినీ చరిత్రలో 20వ శతాబ్దపు ఉత్తమ దర్శకుల్లో ఒకరిగా ఆయన పేరు గడించాడు. కలకత్తాలో ఒక ప్రముఖ బెంగాలీ కళాకారుల కుటుంబంలో జన్మించిన సత్యజిత్ రే కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలోనూ, రవీంద్రనాథ్ ఠాగోర్ స్థాపించిన శాంతినికేతన్‌లోని విశ్వభారతి విద్యాలయంలోనూ చదివారు. వ్యాపార కళాకారునిగా కెరీర్ ప్రారంబించిన రే, లండన్లో ఫ్రెంచి నిర్మాత జాన్ రెన్వాను కలిసాక, ఇటాలియన్ నియోరియలిస్టు సినిమా బైసికిల్ థీవ్స్ తరువాత సినిమాలు తీయడంపై ఆసక్తి పెంచుకున్నాడు. రే సినిమాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు కలిపి మొత్తం ముప్పై ఏడు విత్రాలకు దర్శకత్వము వహించాడు. ఆయన మొదటి సినిమా పథేర్ పాంచాలీ, కేన్స్ చలనచిత్రోత్సవంలో 11 అంతర్జాతీయ బహుమతులు గెలుచుకుంది.

ఆయనకి దర్శకత్వమే కాక, సినిమా తీయడంలోని ఇతర విభాగాల పట్ల కూడా మంచి పట్టు ఉంది. తన సినిమాలో చాలా వాటికి స్క్రీన్ ప్లే (కథాగమనం), కేస్టింగ్ (నట సారథ్యం), సంగీతం, సినిమెటోగ్రాఫీ, కళా దర్శకత్వం, కూర్పు, పబ్లిసిటీ డిజైన్ చేసుకోవడం – వంటివి కూడా ఆయనే చూసుకునేవాడు. సినిమాలు తీయడమే కాక రే ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు కూడా రాసాడు. అలాగే, ఆయన ప్రచురణకర్త కూడా. బెంగాలీ పిల్లల పత్రిక సందేశ్‌ను చాలా ఏళ్ళు నిర్వహించారు. అనేక అవార్డులు పుచ్చుకున్న రే 1992లో ఆస్కార్ కూడా అందుకున్నారు. రే తాత ఉపేంద్రకిషోర్ రే చౌదరి, ఒక రచయిత, తత్త్వవేత్త, ప్రచురణకర్త, బ్రహ్మ సమాజం నాయకుడు. ఉపేంద్రకిషోర్ కొడుకు సుకుమార్ బెంగాలీలో నాన్సెన్స్ కవిత్వం (అంటే యతి ప్రాసలు లేకుండా వింతగా ఉండి, నవ్వు పుట్టించే కవిత్వం) సృష్టికర్త, బాల సాహిత్యవేత్త, విమర్శకుడు.

సత్యజిత్ సుకుమార్, సుప్రభ దంపతులకు 1921 మే 2న జన్మించాడు. రేకు 3 సంవత్సరాలు ఉన్నపుడు సుకుమార్ చనిపోగా సుప్రభ చిన్న ఆదాయంతో రేని పెంచింది. రే కళలపై ఆసక్తి ఉన్నపటికీ ప్రెసిడెన్సీ కాలేజీ లో అర్థశాస్త్రం చదివాడు. శాంతినికేతన్‌పై చిన్న చూపు ఉన్నపటికీ తల్లి ప్రోద్బలంతో టేగోర్ కుటుంబంపై గౌరవంతో విశ్వభారతికి వెళ్ళాడు. అక్కడ ప్రాచ్య కళలు (ఓరియంటల్ ఆర్ట్)లను ఆభ్యసించాడు. ప్రముఖ పెయింటర్లు నందలాల్ బోస్ వినోద్ బిహారీ ముఖర్జీ నుంచి నేర్చుకున్నాడు, అజంతా గుహలు, ఎల్లోరా గుహలు, ఎలిఫెంటా గుహలు దర్శించి భారతీయ కళలపై మక్కువ పెంచుకున్నాడు. సత్యజిత్ రే మరణానంతరం భారత ప్రభుత్వ తపాలా శాఖ ఆయనపై ఓ స్టాంపును విడుదల చేసింది.

ప్రపంచానికి సత్యజిత్ రే ఒక దర్శకుడిగా మాత్రమే తెలిసినా కూడా ఆయన బెంగాలీలో ఎన్నో రచనలు చేశాడు. తన తాత ప్రారంబించిన సందేశ్ పత్రిక మధ్యలో ఆగిపోతే సత్యజిత్ రే తిరిగి ప్రారంభించాడు. ఇది చిన్న పిల్లల కోసం ప్రారంభింపబడిన పత్రిక. ఇందులోనే సత్యజిత్ రే పిల్లల కోసం ఫెలూదా అన్న డిటెక్టివ్‌ని సృష్టించారు. 1965 మొదలుకుని 1994 దాకా 35 ఫెలూదా నవలలు రాసారు. ఇందులో – ఫెలూదా, అతని కజిన్ తపేష్, జటాయు అని పిలువబడు లాల్ మోహన్ గంగూలీ ప్రధాన పాత్రలు. వీరు ముగ్గురు కలిసి పరిష్కరించే సమస్యల సంకలనమే ఫెలూదా కథలు. ఇది కాక సత్యజిత్ రే ప్రొఫెసర్ శొంకు అన్న మరో పాత్రని కూడా సృష్టించి నవలలు రాసారు. బెంగాలీ పిల్లల సాహిత్యంలో ఈ రెండు పాత్రలకి ఓ విశిష్ట స్థానం ఉంది. సత్యజిత్ రే కథా రచయిత కూడా. ఆయన రాసిన కథలు ఆయనకు వివిధ రంగాలలో ఉన్న విశేష పరిజ్ఞానాన్ని తెలియజేస్తాయి. ఆయన రచనల్లో చాలా వరకు గోపా మజుందార్ ఆంగ్లానువాదం చేసారు. సత్యజిత్ రే పిల్లల నవల – ఫతిక్ చంద్ తెలుగులోకి కూడా అనువదితమైంది. ఇవి కాక, సినిమాలు తీయడం గురించి ఆయన అనేక వ్యాసాలు రాశాడు. వాటిలో కొన్ని తెలుగులోకి అనువదితం అయ్యాయి కూడా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here