న్యూస్‌పేపర్‌ల ప్రచురణ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేని పేరు.. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధీనంలోని బ్యూరో ఆఫ్ అవుట్ రీచ్ అండ్ కమ్యూనికేషన్ (బీవోసీ). గతంలో ఇదే విభాగాన్ని DIRECTORATE OF ADVERTISING AND VISUAL PUBLICITY (DAVP)గా వ్యవహరించేవారు. ఏడాదికి రెండుసార్లు చేపట్టే న్యూస్‌పేపర్‌ల ఎంపానెల్‌మెంట్ (Empanelment) తరహాలోనే తగ అయిదేళ్లుగా ఇంటర్నెట్ వెబ్‌సైట్‌ల‌ను గుర్తిస్తూ ఎంపానెల్‌మెంట్ చేసి రేట్ కార్డులను జారీచేస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ‘న్యూ మీడియా’ పేరిట దీని కోసం ప్రత్యేక నిబంధనలతో కూడిన జాతీయ విధానాన్ని కూడా అమలుచేస్తోంది.

ఇందులో భాగంగా ఇప్పటికే పలుమార్లు వెబ్‌సైట్ల ఎంపానెల్‌మెంట్‌ కోసం అవకాశం కల్పించిన బీవోసీ గతంలో జారీచేసిన రేట్ కార్డుల గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల క్రితం ఎంపానెల్‌మెంట్ పొందిన వెబ్‌సైట్‌ల గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. గడువు ముగియడానికి ముందుగానే పాత వాటి రెన్యూవల్‌కు, కొత్తగా అర్హత సాధించిన వాటిని గుర్తించేందుకు గాను, గత ఏడాది చివరిలో నోటిఫికేషన్ జారీచేసి వాణిజ్య బిడ్ (Commercial bid), ఆర్థిక బిడ్ (Financial bid)లతో పాటు దరఖాస్తుల సమర్పణకు జనవరి 15వ తేదీని తుది గడువుగా ప్రకటించింది. అయితే, అప్పట్లో ఫైనాన్షియల్ బిడ్‌లను ఓపెన్ చేసిన అధికారులు టెక్నికల్ బిడ్‌లను నేటికీ ఓపెన్ చేసి అర్హుల జాబితాను ప్రకటించలేదు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ ప్రక్రియ ఆలస్యం అయినట్లు ప్రకటించిన బీవోసీ మార్చి 31తో గడువు ముగిసిన వెబ్‌సైట్‌ల ఎంపానెల్‌మెంట్‌ను మాత్రం ఈనెల (మే) 31 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ పొడిగించింది. ఈ మేరకు ‘న్యూ మీడియా’ జాయింట్ డైరెక్టర్ అనురాగ్ జైన్ ఉత్తర్వులు వెలువరించారు.

2016 జూన్ 7 నుంచి అమలులోకి వచ్చిన సవరించిన ‘The Print Media Advertisement Policy of the Government of India – 2016’ ప్రకారం ఏడాదికి రెండుసార్లు వార్తా పత్రికల ఎంపానెల్‌మెంట్‌ (Empanelment) ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల రీత్యా గత మూడు పర్యాయాలుగా ఈ విధానం తాత్కాలికంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే, ప్రింట్ మీడియా తరహాలో ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌ విధానంలో వెబ్‌సైట్‌ల ఎంపానెల్‌మెంట్‌ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌తో కూడిన ప్రకటన వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేసి పరిశీలించడచ్చు. ఎంపానెల్‌మెంట్‌ (Empanelment) కోసం ఏ విధంగా దరఖాస్తుచేయాలి? విధివిధానాలను ఔత్సాహిక వెబ్ ప్రచురణకర్తలు తెలుసుకుని దరఖాస్తుచేసుకోవచ్చు.

పైన ఇచ్చిన మార్గదర్శకాలకు కొనసాగింపుగా BOC గత నెలలో జారీచేసిన ఉత్తర్వులను కూడా పరిశీలించవచ్చు. కమిట్‌మెంట్, డెడికేషన్‌తో వెబ్‌సైట్‌లు/ఛానళ్లు నిర్వహించే ఔత్సాహిక ప్రచురణకర్తలకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వరమనే చెప్పాలి. వాణిజ్య బిడ్ (Commercial bid), ఆర్థిక బిడ్ (Financial bid)ను వేర్వేరుగా సమర్పించాల్సి ఉంటుంది.

‘న్యూ మీడియా’కు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంలో భాగంగా ఇంటర్నెట్ వెబ్‌సైట్‌ల ఎంపానెల్‌మెంట్‌కు సంబంధించి బీవోసీ న్యూఢిల్లీ లోధీ రోడ్‌లోని సీజీవో కాంప్లెక్స్ ప్రధాన కేంద్రంగా అంతర్జాల ప్రచురణకర్తలకు సేవలందిస్తోంది.

అన్నీ పక్కాగా ఉంటే ఎంపానెల్‌మెంట్ చాలా ఈజీ…

మార్గదర్శకాల ప్రకారం బిడ్‌ల సహా దరఖాస్తులు సమర్పించిన వెబ్‌సైట్‌లు ఎంపానెల్‌మెంట్ పొందడం చాలా ఈజీ అనే చెప్పాలి. బీవోసీ నిర్ణయించిన ఫార్మెట్‌లో కాకుండా తమ ఇష్టప్రకారం బిడ్‌ సమర్పించిన వారు మాత్రమే ఈ ప్రయత్నంలో విఫలమవుతున్నారు.‌ ఏడాది సీనియారిటీ కలిగిన అన్ని ఇంటర్నెట్ వెబ్‌సైట్‌లూ డీఏవీపీ (బీవోసీ) ఎంపానెల్‌మెంట్‌కు అర్హత సాధించినట్లే. అయితే, ఇంత వరకూ సరైన అవగాహన లేకనో, ఆర్ధిక ఇబ్బందుల వల్లో, లేక ఇతరత్రా అనేక కారణాల రీత్యో తెలియదు కానీ, ప్రచురణకర్తలు చాలా వరకూ అన్ని అర్హతలు ఉండి కూడా డీఏవీపీ ‘రేటు కార్డు’ కోసం దరఖాస్తుచేయలేకపోయారు. కరోనా విపత్తు సమయంలో ప్రచురణ (ప్రింట్ మీడియా) రంగంతో సహా వెబ్‌ మీడియానూ ఆదుకోవాలన్న ఆశయంతోనే కావచ్చు, ఇలాంటి ఆపత్కాల‌ పరిస్థితుల్లోనూ డీఏవీపీ సుదీర్ఘ విరామం తర్వాత వెబ్‌సైట్‌ల ఎంపానెల్‌మెంట్ కోసం దరఖాస్తుల‌ను ఆహ్వానిస్తూ ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో అర్హత కలిగిన అంతర్జాల ప్రచురణకర్తలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తుచేసుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. పైరవీలతో ఏ మాత్రం సంబంధం లేకుండా అర్హత కలిగిన ఇంటర్నెట్ వెబ్‌సైట్‌లు పొందగలిగే ఈ ‘గర్తింపు’ను వదులుకోకుండా జర్నలిజాన్ని నమ్ముకున్న ప్రచురణకర్తలు సద్వినియోగం చేసుకుంటారని సలహా.

మరిన్ని వివరాలకు డీఏవీపీ అధికారిక వెబ్‌సైట్ http://davp.nic.inను సందర్శించవచ్చు.