అవావంతరాలకు ఎదురొడ్డి…

98
ధాన్యం కొనుగోలు కేంద్రంలో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

వరంగల్, ఏప్రిల్ 23 (న్యూస్‌టైమ్): ‘‘ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా ముఖ్య‌మంత్రి కేసీఆర్ వెర‌వ‌డంలేదు. స‌మ‌స్య‌లెన్ని ఉన్నా పేద‌ల సంక్షేమాన్ని వీడ‌టం లేదు. మ‌న‌కు అన్నం పెట్టే రైతన్న‌ల‌ను ఆదుకోవ‌డానికే ప్రాధాన్య‌మిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్ర‌భుత్వ‌మే ధాన్యం కొనుగోలు చేస్తున్న‌ది. రైతులుగా మ‌నం చేయాల్సింద‌ల్లా… నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించాలి. తాలు లేకుండా, తేమ లేకుండా, ధాన్యాన్ని బాగా ఆర‌బెట్టి… కొనుగోలు కేంద్రాల‌కు తేవాలి’’ అని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు రైతుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా రాయ‌ప‌ర్తి మండ‌లం రాగ‌న్న గూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆక‌స్మిక త‌నిఖీ చేసిన మంత్రి, కొల‌న్ ప‌ల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ రెండు సంద‌ర్భాల్లోనూ మంత్రి రైతులు, అధికారుల‌తో మాట్లాడారు. స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం రైతుల‌నుద్దేశించి మాట్లాడారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌ర‌హాలో రైతుల కోసం పాటు ప‌డుతున్న ప్ర‌భుత్వాలే లేవ‌ని ఎర్ర‌బెల్లి అన్నారు. 24 గంట‌ల విద్యుత్, విత్త‌నాలు, ఎరువులు, పెట్టుబ‌డులు అన్నీ ఇస్తూనే, చివ‌ర‌కు ధాన్యం కొనుగోలు చేయ‌డం ఎక్క‌డా లేద‌న్నారు. అన్న‌దాత‌ను ఆదుకుంటే… మ‌న‌కు ఇంత అన్నం దొరుకుతుంది. అందుకే సీఎం కెసిఆర్ ఆర్థిక‌, క‌రోనా వైర‌స్ సంక్షోభంలోనూ రైతాంగానికి అన్ని విధాలుగా వెన్నుద‌న్నుగా ఉన్నార‌న్నారు. చ‌త్తీస్‌గ‌డ్ వంటి ప‌క్క రాష్ట్రాల్లో ధాన్యం విలువ‌లు ప‌డిపోయాయ‌ని, దీంతో వాళ్ళంతా మ‌న రాష్ట్రంలో ధాన్యం అమ్ముకోవ‌డానికి వస్తున్నార‌ని చెప్పారు.

ఈ ద‌శ‌లో రైతులుగా మ‌న‌మంతా సిఎం కెసిఆర్ కి స‌హ‌క‌రిద్దామ‌ని, తాలు లేకుండా, తేమ లేకుండా బాగా ఆర‌బెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి కేటాయించిన తేదీల్లోనే వ‌ద్దామ‌న్నారు. అలాగే, క‌రోనా వైరస్ నిర్మూల‌న జ‌రిగే వ‌ర‌కు కంప్లీట్ లాక్‌డౌన్‌ని పాటిద్దామ‌ని మంత్రి రైతుల‌కు పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మాల్లో స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, కొనుగోలు కేంద్రాల వ‌ద్ద అధికారులు, రైతులు త‌దిత‌రులు పాల్గొన్నారు.