ఏలూరు, జనవరి 9 (న్యూస్‌టైమ్): రైతులకు ప్రభుత్వం చెల్లించవలసిన ధాన్యం బకాయిలు 2700 కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శాసనసభ్యుడు డాక్టర్ నిమ్మల రామానాయుడు అధ్వర్యాన రైతులు నిరసనకు దిగారు. అన్నదాతల నిరసన దీక్షకు సంఘీభావంగా ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌రావు, తదితరులు పాల్గొని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్బంగా నిరాహారదీక్ష చేస్తున్న ఎమ్మెల్యే రామానాయుడుకు, రైతులకు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు.

గతేడాదికి సంబంధించిన ధాన్యం బకాయిలను నేటికీ చెల్లించని రాష్ట్ర ప్రభుత్వం.. రైతు వ్యతిరేకి కాదా? అని ఎమ్మెల్యే రామానాయుడు ప్రశ్నించారు. గత సార్వా పంట పెట్టుబడికి తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేక, ప్రస్తుతం దాళ్వా పంటకు పెట్టుబడి దొరక్క అన్నదాతలు సతమతమవుతుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతు దినోత్సవాలంటూ ప్రకటనలు చేయడం కాదని, ధాన్యం బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఎమ్మెల్సీ అంగర తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు చిట్టూరి సీతారామాంజనేయులు, గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, కోడి విజయభాస్కర్‌, మాతా రత్నరాజు, గండేటి వెంకటేశ్వరరావు, కడలి గోపాలరావు, మామిడిశెట్టి పెద్దిరాజు, బోణం నాని తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here