అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎఫ్‌సీఆర్ఐ

36

హైదరాబాద్, నవంబర్ 20 (న్యూస్‌టైమ్): ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎఫ్‌సీఆర్ఐ)ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, యూనివర్సిటీలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. అడవులు, పర్యావరణ రక్షణకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని, అందుకు అవసరమైన ప్రమాణాలతో అటవీ విద్య, కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు అటవీ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.

బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం(కెనడా)తో పాటు, అమెరికా అలబామాలోనిఆబర్న్ విశ్వవిద్యాలయం ప్రతినిధులతో అటవీ శాఖ ఉన్నతాధికారుల బృందం చర్చలు జరుపుతోంది. అలబామాఆబర్న్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ వైల్డ్ లైఫ్ సైన్స్ ప్రొఫెసర్, డీన్ డాక్టర్ జానకి రామ్ రెడ్డి అలవాలాపతి, ములుగులో కొత్తగా ఏర్పాటు చేస్తున్న క్యాంపస్ (ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)ను సందర్శించారు. అధ్యాపకులు, డీన్, ఎఫ్.సి.ఆర్.ఐ. విద్యార్థులతో సమావేశమయ్యారు.

బోధన పరంగా చేయవల్సిన మార్పులు, క్షేత్ర స్థాయి పర్యటనలు, అధ్యాపకుల అభివృద్ధి, సహకార కార్యకలాపాల అవకాశాలను చర్చించారు. ఆ తర్వాత అరణ్యభవన్‌లో అటవీ శాఖ ఉన్నతాధికారులతోనూ ఆయన సమావేశం అయ్యారు. అటవీ విద్య -కాలేజీ ఏర్పాటు, విద్యార్థుల పురోగతి, బోధనా సిబ్బందికి అవసరమైన మెలుకువలపై ఆయన పలు సూచనలు చేశారు. ఫారెస్ట్ కాలేజీ, అబర్న్ యూనివర్సిటీల మధ్య అవగాహన ఒప్పందంపై సమావేశంలో ప్రాధమిక చర్చ జరిగింది.
ముఖ్యంగా అబర్న్ విశ్వవిద్యాలయంలో అమలు చేస్తున్న అటవీ విద్య, పరిశోధన, విస్తరణ కార్యక్రమాలపై తన అనుభవాలకు జానకి రామ్ రెడ్డి పంచుకున్నారు.

ఫారెస్ట్ బేస్డ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఎకనామిక్స్, మార్కెటింగ్‌కు సంబంధించిన వివిధ అంశాలపై ఆయన వివరించారు. వుడ్ సైన్స్, టెక్నాలజీ పేరును బయోమెటీరియల్ ఇంజనీరింగ్‌గా మార్చాలని ఆయన సూచించారు. ప్యాకేజింగ్ పరిశ్రమలకు బయోమెటీరియల్స్, నిర్వహణలో అవకాశాలు అపారంగా ఉంటాయని తెలిపారు. క్రాస్ లామినేటెడ్ కలప భవనాలు నిర్మాణ రంగంలో భవిష్యత్తులో ఉంటాయన్నారు. ప్రస్తుతం విస్తారంగా వాడుతున్న ప్లాస్టిక్ వస్తువుల స్థానాన్ని బయో మెటీరియల్‌తో తయారైన వస్తువులు భర్తీ చేయాల్సి ఉంటుందన్నారు.

ఆబర్న్ స్కూల్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ వైల్డ్ లైఫ్ సైన్స్ వీడియో ఆధారిత తరగతి గదులు, కొత్త కోర్సుల రూపకల్పనలో సహాయం చేస్తుంది. సమ్మర్ ఇంటర్న్‌షిప్, ఇతర అటవీ విద్యా కార్యక్రమాలకు సంబంధించి గత మూడేళ్లలో అటవీ కళాశాల చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. సమావేశంలో పీసీసీఎఫ్ఆర్.శోభ, పీసీసీఎఫ్ (అడ్మిన్ ) మునీంద్ర, హైదరాబాద్, రంగారెడ్డి చీఫ్ కన్జర్వేటర్లు చంద్రశేఖర రెడ్డి, సిధానంద్కుక్రేటీ పాల్గొన్నారు.