ఓటర్ల జాబితా సవరణపై క్షేత్ర స్థాయి పరిశీలన

225

కాకినాడ, మార్చి 8 (న్యూస్‌టైమ్): ఓటర్ల జాబితా సవరణపై క్షేత్ర స్థాయి పరిశీలన జరగాలి వీడియోకాన్ఫరెన్స్‌లో తూర్పు గోదావరి జిల్లా కలెక్టరు కార్తికేయమిశ్రా ఓటర్ల జాబితా సవరణలో భాగంగా జిల్లాలోని వివిధ నియోజక వర్గాల ఎలక్ట్రోరల్ అధికారులకు వచ్చిన క్లైయిమ్‌లను, అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో క్షుణంగా పరిశీలించాలని కలెక్టరు కార్తికేయమిశ్రా ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ నుండి వివిధ నియోజకవర్గాల రిటర్నింగు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో క్లైయిమ్‌లు, అభ్యంతరాలపై వచ్చిన ధరఖాస్తులను వారం రోజుల్లో పరిష్కరించవల్సి ఉంటుందని, ఈమేరకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.

వచ్చే నాలుగు రోజులు ఈ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ద చూపాలని కలెక్టరు సూచించారు. జిల్లాలో పట్టభద్రుల నియోజక వర్గ నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారంతో ముగుయనున్నందున శనివారం నుండి జిల్లాలోని ఆయా డివిజన్లలోని నియోజక వర్గాల వారీగా సంబంధిత తాహసిల్థార్లు, పోలీస్ స్టేషన్ హౌస్ అధికార్లతో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా శనివారంనాడు కాకినాడ డివిజన్‌లోని నియోజకవర్గాలను సమీక్షిస్తామని కలెక్టరు తెలిపారు.

జిల్లాలోని పోలింగ్ స్టేషన్ల లోమౌలిక సదుపాయాల కల్పనలను పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్లు కలెక్టరు ఈ సందర్భంగా తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టరు ఎ.మల్లిఖార్జున, జెసి-2 సిహెచ్.సత్తిబాబు, డిఆర్ఓ ఎమ్.వి.గోవిందరాజులు, తదితరులు పాల్గొన్నారు.