రసవత్తరంగా మారిన రాజధాని పోరు!

169

అమరావతి, జనవరి 3 (న్యూస్‌టైమ్): రాజధాని పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. మూడు రాజధానుల ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో సర్కారు పెద్దలు తమపై మరకల్ని తుడుచుకునే ప్రయత్నం ఒకపక్క చేస్తుండగానే మరోవైపు, ప్రతిపక్షాలు ఈ అంశాన్ని తమకు మరింత అనుకూలంగా మలచుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ‘‘మా భవిష్యత్తుతో ఆడుకోవద్దు’’ అంటూ రైతులు రోడ్డెక్కి కన్నీరు పెడుతుంటే, అధికార పార్టీ నాయకులు వారిని అత్యంత ఘోరంగా అవమానించారంటూ విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. పెయిడ్ ఆర్టిస్టులు అంటూ కించపరుస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ఉద్యమిస్తున్న రైతులకు అందరూ అండగా ఉండాల్సిన సమయం ఇదని, రైతులకు మద్దతు ఇస్తున్న మేధావులకు ఉద్యమ వందనాలంటూ మాజీ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

మొత్తానికి రాజధాని రైతుల నిరసన శుక్రవారం నాటికి 17వ రోజుకు చేరుకుంది. నిన్నటికే రైతులు తమ పోరును మరింత ఉద్ధృతం చేసిన విషయం తెలిసిందే. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు, మహిళలు, విద్యార్థులు చేపట్టిన నిరసన దీక్షలు 17వ రోజుకు చేరాయి. ఆందోళనల్లో భాగంగా శుక్రవారం ఐకాస నేతలు ‘సకల జనుల సమ్మె’కు పిలుపునిచ్చారు. అత్యవసర సేవలు మినహా అన్నికార్యకాలాపాలు నిలిపివేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సచివాలయ పరిధి మందడంలో రైతులు దుకాణాలు మూసివేయించారు. దుకాణాలు తెరిపించేందుకు పోలీసులు యత్నించడంతో రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

మంగళగిరి అంబేడ్కర్‌ కూడలిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఎర్రబాలెం, నీరుకొండ, నవులూరు గ్రామాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో వివిధ రాజకీయ పక్షాలు అమరావతి కోసం ఆందోళనలకు సిద్ధమయ్యాయి. మరోవైపు వెలగపూడి, మల్కాపురం గ్రామాల్లో రైతులకు నోటీసులు ఇవ్వడం కలకలం రేపింది. గతరాత్రి పలువురు రైతులకు నోటీసులు జారీ చేసిన పోలీసులు 307 హత్యాయత్నం కేసుతో పాటు మరో ఏడు సెక్షన్ల కింద కేసులు ఉన్నందున పోలీస్ స్టేషన్‌కు రావాలని పేర్కొన్నారు. విచారణకు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్‌కు రావాలని వెలగపూడి, మల్కాపురం గ్రామస్థులకు నోటీసులు అందజేశారు. దాదాపు 15 మందికి పైగా రైతులు, రైతు కూలీలకు నోటీసులు జారీ అయ్యాయి.

ఇదిలావుండగా, రైతులకు అండగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వామపక్షాలు సహా పలు ప్రజా, కార్మిక సంఘాలు సంఘీభావంగా నిరసన కార్యక్రమాలు ఉద్దృతం చేశాయి. ఒకపక్క రాజకీయ పార్టీలు రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపడుతూనే ఇంకోవైపు, రాజధాని అమరావతి కేంద్రంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ‘‘ప్రభుత్వంలో ఉన్నది మీరే కదా… విచారణ జరిపించుకోండి. తప్పుచేసిన వాళ్లపై చర్యలు తీసుకోండి’’ అంటూ తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విసిరిన సవాలుకు ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి జగన్ నుంచి సమాధానంగా రాలేదు. కాగా, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు విపక్షాలపై ఎదురుదాడిని పెంచాయి.

అమరావతి రైతుల పేరిట పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దింపి రాజకీయం చేస్తున్నారంటూ కొంత మంది ఎమ్మెల్యేలు చేస్తున్న విమర్శలు దుమారం రేపుతున్నాయి. మొత్తానికి పరిస్థితి రోజురోజుకూ చే దాటిపోతున్నా గవర్నర్ జోక్యం చేసుకోవడం లేదన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి.