ప్రాధమిక దశనుంచే పోరు

114
మంత్రి ధర్మాన కృష్ణదాస్, స్పీకర్ తమ్మినేని సీతారాంతో కలిసి సమీక్షలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని
  • కొవిడ్-19 సమీక్షలో మంత్రి నాని

శ్రీకాకుళం, ఏప్రిల్ 26 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ వ్యాప్తి, మహమ్మారి నియంత్రణకు చేపట్టిన చర్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) ఆదివారం ఇక్కడ జిల్లా స్థాయిలో సమీక్ష నిర్వహించారు. శాసన సభాపతి తమ్మినేని సీతారాం, రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖర్‌తో కలిసి కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో జిల్లాలో కరోనా వ్యాప్తి, యంత్రాంగం చేపట్టిన నిరోధక చర్యలను ఆయన సమగ్ర సమీక్షించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాప్తి నిరోధకానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామన్నారు.

ఇప్పటి వరకూ కరోనాకు దూరంగా ఉన్న శ్రీకాకుళంలో తాజాగా నాలుగు పాజిటివ్ కేసులు నమోదుకాగానే ముఖ్యమంత్రి స్పందించి తమను అప్రమత్తం చేశారని, ఈ నేపథ్యంలో యంత్రాంగం కూడా వ్యాధిని ప్రాధమిక స్థాయిలోనే అడ్డుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టిందన్నారు. అందరూ జాగ్రత్త వహించాల్సిన సమయమిదని, దురదృష్టవశాత్తు కొవిడ్-19 మహమ్మారి శ్రీకాకుళం జిల్లాకు కూడా సోకిందని, దీనిపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారన్నారు.

కోవిడ్ నిరోధక ఉద్యమంలో భాగంగా అమలుచేస్తున్న లాక్‌డౌన్ మార్గదర్శకాలను అందరూ పాటించాలని, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఇళ్లలోనే ఉంటూ కరోనాపై ఉద్యమించాలని మంత్రి కోరారు. జిల్లాలో వ్యాధి నియంత్రణకు చేపట్టిన చర్యలలో భాగంగా శ్రీకాకుళంలో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటుతో పాటు రాష్ట్రస్థాయిలో టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటుచేశామన్నారు. ఈ వివరాలను అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని యంత్రాంగాన్ని కోరారు. వ్యాధి లక్షణాలు ఉంటే ప్రజలు స్వయంగా తెలియజేయాలని, రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు సిద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లా కలెక్టర్ జె. నివాస్ మాట్లాడుతూ ఢిల్లీ నుండి మార్చి 10 నుండి 22వ తేదీ వరకు వచ్చిన వారి వివరాలు తీసుకున్నామని, వారందరినీ ప్రస్తుతానికి క్వారంటైన్‌లో పెట్టామన్నారు.

క్వారంటైన్‌లో ఉన్న ప్రతి వ్యక్తికి ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఇచ్చి నిరంతరం వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రతి పది మందికి ఒక వైద్య అధికారిని నియమించామని, జిల్లాలో ఇప్పటి వరకూ 15483 మందిని క్వారంటైన్‌లో ఉంచినట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లాలో వ్యాధిని ప్రాధమిక దశలోనే గుర్తించి నివారణకు మేల్కొన్నామని, పాజిటివ్ కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. లాక్‌డౌన్ మరింత పటిష్టంగా అమలుచేసేందుకు కృషిచేస్తామని, దీనికి ప్రజలంతా స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమించేవారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని హెచ్చరించారు.

సమావేశంలో శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు, గొర్లె కిరణ్‌కుమార్, కోవిడ్ జిల్లా ప్రత్యేక అధికారి ఎం.ఎం. నాయక్, ఎస్పీ ఆర్.ఎన్. అమ్మిరెడ్డి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు, సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్-2 ఆర్. గున్నయ్య, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, ఏఎస్పీ పి.సోమశేఖర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.చెంచయ్య, జీజీహెచ్ సూపరింటిండెంట్ డాక్టర్ కె. కృష్ణమూర్తి, డిసిహెచ్ఎస్ డాక్టర్ బి.సూర్యారావు, ఆర్డీవో ఎం.వి. రమణ, డీపీవో వి. రవికుమార్, జడ్పీ సీఈవో జి.చక్రధరరావు, శ్రీకాకుళం నగర పాలకసంస్థ కమిషనర్ పి.నల్లనయ్య, ఆరోగ్య అధికారి డాక్టర్ జి. వెంకటరావు, ప్రత్యేక అధికారి జి. శ్రీనివాసరావు, విపత్తుల విభాగం ఇంచార్జి డిఎం బి.నగేష్, వైద్య శాఖ అధికారులు డాక్టర్ రామ్మోహన్ రావు, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ సాయిరాం, ఎస్డీసీలు గణపతి, జయదేవి, అప్పారావు, డీఈవో చంద్రకళ, డీటీసీ సుందర్ తదితరులు పాల్గొన్నారు.