అందరి సహకారంతో కరోనాపై పోరు

0
7 వీక్షకులు

హైదరాబాద్, ఏప్రిల్ 8 (న్యూస్‌టైమ్): కరోనా వైరస్ మహమ్మారిపై సమష్టిగా పోరాడేందుకు ప్రతి ఒక్కరూ చేయూతను అందించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఎల్.బీ. స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పేదలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ లాక్‌డౌన్ నేపథ్యంలో ఏ ఒక్కరూ ఆహారానికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

అన్నార్తులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. దాతలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం సహాయం చేస్తుందని ఆయన హామీనిచ్చారు. కరోనా వైరస్ నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రభాగాన ఉందని వినోద్ కుమార్ అన్నారు. ప్రధాని మోడీ సూచనలు తూచ తప్పకుండా అమలు చేయడమే కాకుండా.. కరోనా విషయంలో కీలక సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు కేంద్రానికి అందజేస్తున్నారని వినోద్ కుమార్ గుర్తు చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రైవేటు ఉద్యోగులను ఆయా యాజామాన్యాలు ఆదుకోవాలని వినోద్ కుమార్ సూచించారు. ఇంటి అద్దెల కోసం యజమానులు ఒత్తిడి చేయకూడదని ఆయన కోరారు. ఇతర రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది వలస కార్మికులకు అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటోందని వినోద్ కుమార్ తెలిపారు. రేషన్ కార్డులతో సంబంధం లేకుండా అర్హులైన పేదలకు ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం, రూ. 1500 నగదును ప్రభుత్వం అందజేస్తోందని వినోద్ కుమార్ వివరించారు.

స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ స్పూర్తితో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఎనిమిది రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే సోమవారం ముగింపు సందర్భంగా ప్రముఖ క్రీడాకారిణి పీ.వీ. సింధు హాజరవుతారని అల్లీపురం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here