కోట వైకాపాలో కొట్లాట షురూ!

99

నెల్లూరు, జులై 13 (న్యూస్‌టైమ్): కోట మండలంలోని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వర్గపోరు మరోసారి బగ్గుమంది. కోట మండలానికి చెందిన ఇద్దరు నాయకుల మధ్యనున్న వివాదం రోజురోజుకు పెరిగి వర్గపోరుగా మారుతున్నట్లుగా తెలుస్తోంది. ఈక్రమంలో కోట మండలం వెంకన్నపాళెంలోని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటీవల గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్రావుకు ఆత్మీయ సత్కారాన్ని చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు.

అయితే నిన్నటి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఫ్లెక్సీలపై పెట్రోల్ పోసి నిప్పంటిచిన ఘటనతో ఒక్కసారిగా నాయకులు అప్రమత్తం అయ్యారు. ఆ మేరకు బాధిత నాయకులు వలిపి శ్రీనివాసులు, మల్లి శ్రీనివాసులు కోట పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఫిర్యాదును అందుకున్న ఎస్ఐ మహేంద్ర నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోట మండలం వెంకన్నపాళెం గ్రామంలోని వలిపి శ్రీనివాసులు, మల్లి శ్రీనివాసులు నల్లపరెడ్డి కుటుంబానికి ముఖ్య అనుచరులుగా ఉన్నారు.

అయితే వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన తరువాత మొదటిసారిగా గ్రామంలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావుకు ఆత్మీయ సత్కారాన్ని అందించ తలపెట్టారు. ఈక్రమంలో వారు ఎమ్మెల్యే ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు. ఇంతవరకూ బాగానేవున్నా ఎన్నికల అనంతరం గ్రామానికి చెందిన టిడిపి నాయకులు వైకాపాలోని ఓ నాయకులని సమక్షంలో వైకాపాలో చేరేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇటీవల గ్రామంలో ఓ కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించుకున్నారు.

గ్రామంలో పోటాపోటీగా కార్యక్రమాలను చేపడుతున్న క్రమంలో వారి వారి అనుచరులు ఫ్లెక్సీలకు నిప్పంటించినట్లుగా తెలుస్తోంది. ప్లెక్సీల వివాదంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని బాధిత నాయకులు కోరుతున్నారు. వైకాపాని జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు పట్టించుకోకపోవడం, పార్టీలో నెలకొనివున్న ఈ వర్గపోరుతో కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.