తొలి దశ ‘పరిషత్‌’ పోలింగ్‌కు సర్వం సిద్ధం!

189

హైదరాబాద్, మే 5 (న్యూస్‌టైమ్): తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల తొలి దశ ఎన్నికల పోలింగ్ సోమవారం జరగనుంది. మొత్తం మూడు దశల ఎన్నికలలో భాగంగా తొలి దశలో 2,097 ఎంపీటీసీ, 195 జడ్పీటీసీ స్థానాల్లో పోలింగ్‌ నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. అన్నిచోట్లా ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కానీ పోలీస్‌ శాఖ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు 6 జిల్లాల పరిధిలోని 640 ఎంపీటీసీ స్థానాల్లో పోలింగ్‌ను సాయంత్రం 4 గంటలకే ముగించాలని తాజాగా నిర్ణయించింది. వీటిలో 217 స్థానాలు మొదటి దశలో ఉన్నాయి. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా పోలీస్‌ శాఖ వెల్లడించడం వల్లనే ఎన్నికల సంఘం ఇలాంటి మార్పులు చేసింది.

రాష్ట్రంలో మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాల పదవులకు పోలింగ్‌ను ఎన్నికల సంఘం మూడు దశల్లో చేపట్టనుంది. ఇందులో భాగంగా తొలిదశ పోలింగ్‌ను సోమవారం నిర్వహించేందుకు అన్ని జిల్లాల్లో సన్నాహాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రం మొత్తమ్మీద వివిధ కారణాల వల్ల వాయిదా పడ్డ వాటిని మినహాయించి మిగతా 5,817 ఎంపీటీసీల్లో ఎన్నికలను నిర్వహిస్తుండగా వాటిలో 2,166 స్థానాలు మొదటి దశలోనే ఉన్నాయి. వీటిలో 69 స్థానాల్లో ఒక్కొక్క నామినేషన్‌ మాత్రమే దాఖలవ్వడంతో ఆయా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారులు ప్రకటించారు. మిగతా 2,097 స్థానాలకు సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ మొదలవుతుంది.

మొత్తం 538 జడ్పీటీసీ స్థానాల్లో మొదటి దశలో 197 ఉండగా వాటిలో రెండు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇవి తప్ప మిగతా 195 జడ్పీటీసీ స్థానాలకు ఎంపీటీసీ స్థానాలతో పాటుగా పోలింగ్‌ నిర్వహిస్తారు. ఒక్కో ఓటరు ఒకదాని తర్వాత మరొకటి చొప్పున రెండేసి ఓట్లను వేయాల్సి ఉంటుంది. తొలిదశ ఎన్నికల్లోని అభ్యర్థుల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 640 ఎంపీటీసీ స్థానాలు అంటే మొత్తంలో 11 శాతం తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా డీజీపీ నివేదిక ఇచ్చారు.

ఈమేరకు ఆయన నుంచి నివేదిక రావడంతో వాటిలో పోలింగ్‌ను 4 గంటలకే ముగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇవి భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల పరిధిలో ఉన్నాయి. వీటిలో 217 (10 శాతం) ఎంపీటీసీ స్థానాలు మొదటి దశ పోలింగ్‌ నిర్వహించే వాటిలో ఉన్నాయి. పోలింగ్‌ను 4 గంటలకు ముగించినట్లైతే ఆయా ప్రాంతాల్లోని పోలింగ్‌ సిబ్బంది బ్యాలెట్‌ బాక్సులతో సహా వెలుతురు ఉండగానే గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకొనేందుకు వీలవుతుందని డీజీపీ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా కలెక్టర్లతో చర్చించి పోలింగ్‌ వేళల్లో మార్పులు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్‌ తెలిపారు.

కాగా, పరిషత్ ఎన్నికలలో కూడా తన సత్తాచాటుకునేందుకు అధికార టీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సహా పార్టీలోని కీలక నాయకులందరినీ పరిషత్ ఎన్నికల వ్యూహరచనలో భాగస్వాములను చేసింది టీఆర్ఎస్. పంచాయతీ, అసెంబ్లీ ఎన్నికలలో ఉనికిని కాపాడుకోలేకపోయిన విపక్షాలు కనీసం పరిషత్ పోరులోనైనా తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. చివరికి ఓటరు ఎవరిని కరునిస్తాడో చూడాల్సిందే.