న్యూఢిల్లీ, నవంబర్ 27 (న్యూస్‌టైమ్): వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని వ్య‌వ‌సాయ‌, విధాయిత ఆహార ఉత్ప‌త్తుల ఎగుమ‌తుల‌ అభివృద్ధి అథారిటీ (అగ్రిక‌ల్చ‌ర‌ల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాడ‌క్ట్స్ ఎక్స్పోర్ట్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ -ఎపిఇడిఎ), ప‌లు ఎగుమ‌తుల ప్రోత్సాహ‌క కార్య‌క‌లాపాల ద్వారా అంత‌ర్జాతీయ కొనుగోలుదారు, అమ్మ‌కందారు స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌, స‌భావ్య దిగుమ‌తి దేశాలలో ఎగుమ‌తిదారుల భాగ‌స్వామ్యం, నిర్దిష్ట ఉత్ప‌త్తి మార్కెట్ల‌లో ప్రోత్సాహ‌క కార్య‌క్ర‌మాల ద్వారా నిర్దిష్ట ఉత్ప‌త్తుల ఎగుమ‌తుల‌ను సుల‌భ‌త‌రం చేస్తుంది.

ఈ చొర‌వ‌లు భార‌తీయ వ్య‌వ‌సాయ‌క ఉత్ప‌త్తులు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రాచుర్యం పొంద‌డానికి తోడ్ప‌డ‌డ‌మే కాక‌, ఎగుమ‌తిదారులు అంత‌ర్జాతీయ మార్కెట్ల‌ను చేరుకునే సౌక‌ర్యాన్ని క‌ల్పించింది. కోవిడ్‌-19 సంక్షోభ కాలంలో, భౌతిక స‌మావేశాలు, మార్కెట్ ప్రోత్సాహ‌క కార్య‌క్ర‌మాలు సాధ్యం కావు. ఈ క్ర‌మంలో వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల ఎగుమ‌తుల‌ను ప్రోత్స‌హించే ప్ర‌య‌త్నంలో భాగంగా ఎపిఇడిఎ దృశ్య మాధ్య‌మాన్ని అన్వేషించి ఎగుమ‌తి మార్కెట్ ప్రోత్సాహ‌పు చొర‌వ‌ల‌ను వివిధ వ‌ర్చువ‌ల్ కొనుగోలుదారు, అమ్మ‌కందారు స‌మావేశాల‌ను (విబిఎస్ఎం) విదేశాల‌లో ఉన్న భార‌తీయ రాయ‌బార కార్యాల‌యాల భాగ‌స్వామ్య‌తో నిర్వ‌హించింది.

ఏప్రిల్ నుంచి అక్టోబ‌ర్ 2020 మ‌ధ్య కాలంలో ఎపిఇడిఎ – యుఎఇ, ద‌క్షిణ కొరియా, జ‌పాన్‌, ఇండొనేషియా, కువైట్‌, ఇరాన్ వంటి సంభావ్య దిగుమ‌తి దేశాల‌తో ఎపిఇడిఎ ఉత్ప‌త్తుల‌న్నిటికీ ప్రాచుర్యం క‌ల్పించ‌డం కోసం వ‌ర్చువ‌ల్ అమ్మ‌కందారు, కొనుగోలుదారు స‌మావేశాల‌ను నిర్వ‌హించింది. దానితో పాటుగా సింగ‌పూర్‌, ర‌ష్యా, బెల్జియం, స్విట్జ‌ర్లాడ్‌, స్వీడ‌న్‌, లాట్వియా వంటి దేశాల‌తో తాజా ప‌ళ్ళు, కాయ‌గూర‌లు, కెనెడాతో సేంద్రీయ ఉత్ప‌త్తులు, యుఎస్ఎ, యుఎఇతో జిఐ ఉత్ప‌త్తుల వంటి నిర్దిష్ట ఉత్ప‌త్తుల ప్రోత్సాహం కోసం వ‌ర్చువ‌ల్ నెట్‌వ‌ర్కింగ్ స‌మావేశాలు నిర్వ‌హించ‌డం జ‌రిగింది. ఈ దృశ్య మాధ్య‌మం ద్వారా నిర్వ‌హించిన ఈ స‌మావేశాలు భార‌తీయ ఎగుమ‌తిదారులు, దిగుమ‌తిదారుల మ‌ధ్య భార‌తీయ వ్య‌వ‌సాయ ఉత్త‌త్తులైన బాస్మ‌తి, బాస్మ‌తియేత‌ర బియ్యం, ద్రాక్ష‌, మామిడి, అర‌టి, దానిమ్మ‌, తాజా కాయ‌గూర‌లు, సేంద్రీయ ఉత్ప‌త్తులు త‌దిత‌రాలలో భార‌త‌దేశానికి ఉన్న వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల బ‌లాన్ని గురించి చ‌ర్చించేందుకు ఒక వేదిక‌ను అందించాయి. ఈ కార్య‌క్ర‌మాలు భార‌తీయ వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను దిగుమ‌తి చేసుకునే దిగుమ‌తిదారుల‌లో విశ్వాసాన్ని బలోపేతం చేసి, ఎగుమ‌తులకు మార్గాన్ని సుగ‌మం చేస్తాయ‌ని అంచ‌నా.