సీజనల్ వ్యాధులపై దృష్టి: ఆళ్ల

0
9 వీక్షకులు

కాకినాడ, మే 26 (న్యూస్‌టైమ్): కొవిడ్-19 మహమ్మారిపై ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంభిస్తూ నివారణకు చర్యలు చేపడుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో మంగళవారం ఆయన ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి కొత్తగా మంజూరు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి స్థలం సేకరణలో ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న మంత్రి ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు ఆదేశాలు జారీచేసిందన్నారు.

రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందోస్తు చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను నాని ఆదేశించారు. ముఖ్యంగా ఏజన్సీ ప్రాంతాలలో వివిధ వ్యాధులతో బాధపడుతున్న గిరిజనలకు వైద్యం అందించేందుకు 24 గంటలు పని చేయడానికి వైద్యులను నియమిస్తున్నామన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతంలో ప్రత్యేకంగా వైద్య క్యాంపులు నిర్వహించడం కోసం జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించాలని కోరారు.

చింతూరు మండలంలోని పలు గ్రామాలలో గిరిజనలు అవగాహన లేక నాటు వైద్యం వాడుతున్న దృష్ట్యా వారికి అవగాహన కల్పించడానికి వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి వైద్య సదుపాయం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను అదేశించారు. ఏజెన్సీలో కాళ్ళ వాపులతో బాధ పడుతున్న వారికీ కాకినాడలో మెరుగైన వైద్యం అందించడానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని సూచించారు. చింతూరులో పది పడకల డయాలసిస్ సెంటర్ రెండు రోజులలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులను అదేశించామన్నారు.

ఏజెన్సీ ఏరియా హాస్పిటల్స్‌లో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండడానికి చర్యలు చేపట్టామన్నారు. త్వరలో మళ్ళీ జిల్లాలో పర్యటిస్తానని, వైద్య సదుపాయాల తీరును స్వయంగా పరిశీలిస్తానన్నారు. వ్యాధులు ఎక్కువగా ప్రభులుతున్న ప్రాంతాలలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తరసుగా పర్యటన చేయాలన్నారు. పేదలకు వైద్య సదుపాయం కల్పించడంలో అలసత్వం వహిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.

‘‘రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి పేదలకు వైద్యం అందించే విషయంలో ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టారు. కరోనా వైరస్ సోకకుండా ప్రజలను అప్రమత్తం చేయండి. మాస్క్‌లు తప్పనిసరిగా వినియోగించుకోవాలి. భౌతిక దూరం పాటించాలి.’’ అని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here