వేసవి ప్రత్యామ్నాయాలపై దృష్టి: సీఎస్

116

హైదరాబాద్, మార్చి 26 (న్యూస్‌టైమ్): వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పశువులు, సన్న జీవాలైన గొర్రెలు, మేకలకు పశుగ్రాసం, తాగునీటి కొరత లేకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు.మంగళవారం సచివాలయం నుండి ఆయన జిల్లా స్థాయి పశుసంవర్ధక శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏప్రిల్ నుండి జూన్ 15 వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని గ్రామాలలో పశువులు నీరు తాగడానికి నీటి తొట్లలో నీరు ఉండే విధంగా చూడాలన్నారు.

ఇందుకు అవసరమైన ఆదేశాలను జిల్లా కలెక్టర్ల ద్వారా జిల్లా పంచాయతీ అధికారులకు, వారి ద్వారా గ్రామ పంచాయతీ అధికారులకు జారీ చేసే విధంగా చూడాలన్నారు. నీటి తొట్లకు అవసరమైన పక్షంలో మరమత్తులు వెంటనే చేయించాలన్నారు. కొత్త నీటి తొట్ల నిర్మాణాలను ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలకు అవసరమైన పశుగ్రాస విత్తనాలను వెంటనే పంపించాలని అధికారులను ఆయన ఆదేశించారు. రైతులు, గొర్రెల కాపర్లు వేసవి తాపం నుండి తమ పశువులను ఏవిధంగా సంరక్షించుకోవాలన్న విషయాలపై అవగాహన కల్పించాలన్నారు.

పశుసంవర్ధక శాఖ అధికారులు గ్రామాలలో పర్యటించి నీటి తొట్లలో నీరు, పశుగ్రాసం వివరాలను ఫోటోల ద్వారా డైరెక్టరేట్‌కు పంపించాలన్నారు. ఎండ తీవ్రతపై పోస్టర్లు, కరపత్రాలను ముద్రించి జిల్లాలకు పంపించాలని ఆయన అధికారులను ఆదేశించారు. పశువుల గుర్తింపు ప్రక్రియను 10 రోజుల లోపు పూర్తి చేసి కంప్యూటరైజేషన్ చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న గొర్రెల, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నీటి తొట్ల నిర్మాణానికి ఉపాధి హమీ పథకంలో అవకాశం ఉన్నందున, ఎక్కువ నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.

గొర్రెల షెడ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని, చొప్ప నరికే యంత్రాలను ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంచాలన్నారు. అటవీ శాఖ అధికారులు, పండ్ల తోటల పెంపకం అధికారులతో సమన్వయంచేసుకొని పశుగ్రాసాన్ని జీవాలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పశుగణాభివృద్ధి సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి మంజువాణి, పశుసంవర్ధక శాఖ అదనపు డైరెక్టర్ రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.