మరణాలు వేగంగా తగ్గుముఖం, 20 రోజులుగా 300 లోపు నమోదు..

న్యూఢిల్లీ, జనవరి 18 (న్యూస్‌టైమ్): దేశంలో రోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ ఉండగా గత 7 రోజులుగా రోజువారీ కెసులు 20 వేల లోపే ఉంటున్నాయి. గడిచిన 24 గంటలలో కేవలం 16,946 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 17,652 మంది కోలుకున్నారు. దీంతో చికిత్సలో ఉన్నవారి సంఖ్య నికరంగా 904 తగ్గింది. భారతదేశంలో రోజువారీ కోవిడ్ మరణాలు తగ్గుదల బాటలో సాగుతున్నాయి.

గడిచిన 20 రోజులుగా సగటున రోజుకు 300 లోపు మరణాలు నమోదవుతూ ఉన్నాయి. దేశంలో కోవిడ్ బాధితులలో మరణాల శాతం 1.44% గా నమోదైంది. 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతలలో మరణాల శాతం జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ చికిత్స పొందుతున్న వారి సంఖ్య 2,13,603కు తగ్గింది. మొత్తం పాజిటివ్ కేసులలో వీరి వాటా ప్రస్తుతం 2.03%కు తగ్గింది. 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో సగటు చికిత్సలో ఉన్న బాధితుల సంఖ్య 5,000 లోపు ఉంది. భారతదేశంలో కోవిడ్ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,01,46,763 కు చేరింది. కోలుకున్నవారి శాతం 96.52% కు చేరింది. కేరళలో అత్యధికంగా ఒక్క రోజులోనే 5,158 మంది కోలుకోగా, మహారాష్టలో 3,009 మంది, చత్తీస్‌గఢ్‌లో 930 మంది కోలుకున్నట్టు నమోదయ్యారు.

కొత్తగా నిర్థారణ జరిగిన కేసులలో 76.45% మంది ఏడు రాష్టాలకు చెందినవారు కాగా కేరళలో అత్యధికంగా 6,004 కేసులు, మహారాష్టలో 3556 కేసులు, కర్నాటకలో 746 కేసులు వచ్చాయి. గడిచిన 24 గంటలలో 198 మంది కోవిడ్ బాధితులు మరణించారు. వారిలో 75.76% మంది కేవలం ఆరు రాష్టాలకు చెందినవారే ఉన్నారు. వీరిలో అత్యధికంగా మహారాష్ట్రలో 70 మంది మరణించగా, కేరళలో 26 మంది, పశ్చిమ బెంగాల్‌లో 18 మంది చనిపోయారు.