పోలీసు కుటుంబాలకు అండ: జిల్లా ఎస్పీ

149

ఏలూరు, మార్చి 18 (న్యూస్‌టైమ్): విధి నిర్వహణలో ఉంటూ కుటుంబాలను నిర్లక్ష్యం చేయడం పోలీసు వృత్తిలో సహజమని, అయితే, ఇది అన్ని వేళలా మంచిది కాదని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ఎం. రవిప్రకాష్ అన్నారు. ఏలూరులోని తన కార్యాలయంలో సోమవారం ఆయన గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఫిర్యాదుదారుల నుండి స్వయంగా అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ఈశ్వరరావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెం నుండి వచ్చిన ఓ మహిళ తనను ప్రేమ పేరిట మోసం చేసిన వ్యక్తిగా చర్యలు తీసుకోవాలని కోరింది. తడికలపూడికి చెందిన మరో మహిళ భూలావాదేవీలకు సంబంధించిన మోసంపై ఫిర్యాదు చేసింది. తనను మోసం చేసి పొలం అమ్మి సివిల్ కోర్ట్‌లలో కేసు పెట్టి వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఏలూరుకు చెందిన మహిళ ఇంటి నిర్మాణానికి సంబంధించిన వేధింపులపై ఫిర్యాదు చేసింది. బుట్టాయిగూడానికి చెందిన మహిళ తన భర్త వేధింపులపై ఫిర్యాదు చేసింది.

వ్యసనాలకు బానిసైన భర్త మద్యం మత్తులో తనను నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తంచేసింది. చింతలపూడికి చెందిన వ్యక్తి గ్రామంలో కొనసాగుతున్న మూఢనమ్మకాలపై ఫిర్యాదు చేశారు. కొంత మంది అసత్య ఆరోపణలతో తను చేత బడి చేస్తునానని దాడులకు పాల్పడి గాయపర్చినట్లు ఫిర్యాదు చేశారు. కాగా, అర్జీదారుల సమస్యలను సహనంతో ఆలకించిన ఎస్పీ వాటి పరిష్కారానికి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. జిల్లా నలుమూలల నుండి ఫిర్యాదుదార్లు ఎక్కవగా కుటుంబ సమస్యలు, ఆస్తి తగాదాలు, సివిల్ సంబంధిత విషయాలపై ఫిర్యాదు చేసేందుకు వస్తున్నారని ఎస్పీ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.

సివిల్ సంబంధిత విషయాలను సివిల్ కోర్టులలో కేసులు వేసి పరిష్కరించుకోవాలని సూచించారు. ఫిర్యాదుల్లో క్రిమినల్ సంబంధిత అంశాలను విచారించి కేసులు నమోదు చేస్తామన్నారు. సార్వత్రిక ఎన్నికలకు తమ యంత్రాంగం సిద్ధంగా ఉందని ఎస్పీ చెప్పారు. 1057 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు గుర్తించామని, మోడల్ కోడ్‌ను అతిక్రమిస్తే కేసులు నమోదుచేస్తామని స్పష్టంచేశారు. పారా మిలటరీ బలగాలతో కవాతు చేస్తున్నామని, బైండోవర్లు, ఆయుధాల స్వాధీనం పూర్తయిందన్నారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాల వద్ద నో మాన్ జోన్ ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు.