ఆ పీఠం కోసం…

0
12 వీక్షకులు
విశాఖపట్నంలోని వీఎంఆర్‌డీఏ ప్రధాన కార్యాలయం
(* పోతుమహంతి నారాయణ్)

విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) చైర్మన్ పీఠం కోసం వైసీపీ వర్గాలు జోరుగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. వీఎంఆర్టీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు పదవీకాలం వచ్చేనెల 13వ తేదీతో ముగియనుంది. ఏడాది పాటు మాత్రమే పదవిలో కొనసాగేలా ఆయనకు అప్పట్లో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన పదవీకాలం మరో ఏడాది పాటు పొడిగించే అవకాశాలు కూడా లేకపోలేదు. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర మహాస్వామి ఆశీస్సులతోనే ద్రోణంరాజుకు చైర్మన్ పీఠం దక్కిందన్న ప్రచారం లేకపోలేదు. చైర్మన్‌గా ద్రోణంరాజు అవగాహన పెంపొందించుకునే సమయానికే కరోనా మహమ్మారి మీద వచ్చి పడింది. వాస్తవంగా ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నాటికి ఎస్ఏడి ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు పూర్తిచేయాలని భావించారు. అయితే కరోనా నేపథ్యంలో పనులు ముందుకు సాగలేదు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భూమి పూజ చేసిన అభివృద్ధి పనులు కూడా కుంటినడక నడుస్తున్నాయి. ఈనెల 30వ తేదీ వరకు లాక్‌డౌన్ అమల్లో ఉండడంతో వీఎంఆర్టీఏ కార్యకలాపాలు కూడా అంతంతమాత్రంగానే సాగే అవకాశాలు ఉన్నాయి. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా మారి నట్లయితే వీఎంఆర్టీఏకు కొత్త రూపు రానుంది. వుడా, సీఆర్టీఏ హోదా పొందే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ముఖ్యమంత్రి ఆ సంస్థకు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అయితే ఆ ప్రక్రియ ఒకటి రెండు నెలల్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే వీఎంఆర్డు చైర్మన్ పదవి కోసం వైసీపీ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రధానంగా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ప్రయత్నాలు చేస్తున్నారు. కొయ్య ప్రసాదరెడ్డి వంటి వారు కూడా రేస్‌లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలోచనలు ఎలా ఉన్నాయనేది ఎవరి అంచనాలకు అందదు.

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి ఆశీస్సులు ఉన్నవారికి చైర్మెన్ పదవి లభిస్తుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇటీవల కాలంలో జగన్‌కు ఆయనకు మధ్య అభిప్రాయ బేధాలు పొడసూపాయని వినిపిస్తోంది. దీంతో చైర్మన్ పదవికి ఆయన ఎవరి పేరు సిఫార్సు చేసే అవకాశాలు కనిపించడం లేదు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఇటీవల పార్టీలో చేరిన వుడా మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్.ఏ.రహమాన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

ఎవరికి వారు తమ తమ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ద్రోణంరాజు శ్రీనివాస్‌కు మరో అవకాశం లభించే సూచనలు లేక పోలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. శ్రీనివాస్ పదవీకాలం ముగిసేనాటికి కొత్త చైర్మన్ నియామకం జరుగుతుందా? లేదా? అనేది చూడాలి. ప్రస్తుతం అధికారులతో ఉన్న బోర్డు మాత్రమే కొనసాగుతోంది. అనధికారులతో బోర్డు ఏర్పాటు చేయలేదు. కొత్త చైర్మన్‌తో పాటే బోర్డు కూడా నియమిస్తారని వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ చైర్మెన్ పోస్టులో ఎవరు నియమితులు కానున్నారన్న దానిపై చర్చ జోరుగా సాగుతోంది.

(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్, ‘ఎరుక’ తెలుగు దినపత్రిక ప్రాంతీయ బాధ్యుడు, +91 98491 47350)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here