కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా దేశరాజధాని ఢిల్లీలో రైతులు నిరసన వ్యక్తంచేస్తున్నప్పటి చిత్రం
(* ప్రొఫెసర్‌ కె. నాగేశ్వర్‌)

టీవల నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. నిరసన తెలుపుతున్న రైతులు దళారీలని మొదట ముద్ర వేసారు. తరువాత ఖాలిస్తాన్‌ వేర్పాటువాదులు ఈ నిరసనలలో చొచ్చుకుపోయారని ఆరోపణ చేశారు. అటు తరువాత ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలకు ప్రభావితులై ఎక్కువ మంది రైతులు వస్తున్నారని ఆరోపించారు. చివరిగా ప్రధాన మంత్రి స్వయంగా వ్యవసాయ చట్టాలను బలపరుస్తూ రంగంలోకి దిగారు. కార్పొరేట్‌ మీడియా, సోషల్‌ మీడియాలో వ్యవసాయ చట్టాలు రైతులకు లాభం చేస్తాయని బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారానికి పూనుకున్నది.

  • అపోహ నెం.1: రైతులు వ్యవసాయ మార్కెట్‌లలోనే కాకుండా తన పంటను ఎవ్వరికైనా అమ్ముకొని మంచి ధర పొందే స్వేచ్ఛను ఇస్తుంది.

సమాధానం: ఇది వాస్తవానికి విరుద్ధమైనది. ఇప్పటికే భారతదేశంలో పంటలు అత్యధికం పంటలను వ్యవసాయ మార్కెట్‌ బైటనే అమ్ముతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం కూడా 29 శాతం వరి, 44 శాతం గోధుమలు మాత్రమే వ్యవసాయ మార్కెట్‌లో అమ్ముతున్నారు. 49 శాతం వరి, 36 శాతం గోధుమలు స్థానిక వ్యాపారులకు లేదా విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు ఇచ్చిన డీలర్‌కే అమ్ముతున్నారు. మన దగ్గర పండే 31 పంటలలో 29 పంటలను స్థానిక ప్రయివేటు వ్యాపారులే కొంటున్నారు.

  • అపోహ నెం.2: వ్యవసాయ మార్కెట్‌లను సామర్థ్యం లేని మధ్య దళారులు కబ్జా చేసుకొని ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇది రైతులను నష్టపరుస్తున్నది.

సమాధానం: ఇప్పటికే 18 రాష్ట్రాలు వ్యవసాయ మార్కెట్‌లకు బదులు ప్రయివేటు మార్కెట్‌లు ఏర్పాటుకు అనుమత్తించాయి. 19 రాష్ట్రాలు రైతుల దగ్గర నుంచి నేరుగా కొనుక్కునేందుకు అనుమతించాయి. వ్యవసాయ జాతీయ కమిషన్‌ ప్రతిపాదన ప్రకారం ఒక రైతు మార్కెట్‌కు తన ఎడ్లబండిపై గంటసేపులో చేరుకునేలా ఏర్పాటు జరగాలి. దీని ప్రకారం ఒక వ్యవసాయ మార్కెట్‌ 80 చదరపు కిలోమీటర్ల పరిధిలో పని చేయాలి. ఈ లెక్క ప్రకారం దేశంలో కనీసం 41,000 మార్కెట్‌లు ఉండాలి. అయితే 2019 లెక్కల ప్రకారం దేశంలో 6,630 మార్కెట్‌లో ఉన్నాయి. అంటే 463 చదరపు కిలోమీటర్లల పరిధిలో పని చేస్తున్నాయి. దేశంలో సరిపడ మార్కెట్‌లు లేవనేది ఈ లెక్కల ప్రకారం తెలుస్తున్నది.

  • అపోహ నెం.3: కొత్త చట్టాలు అమలులోకి వచ్చిన తరువాత కూడా ప్రభుత్వ సేకరణ జరుగుతున్నదని కేంద్ర ప్రభుత్వ నాయకులు చెపుతున్నారు. రాబోయే స్వేచ్ఛ మార్కెట్‌ వ్యవస్థ రైతులు ఎవ్వరికైనా అమ్ముకునే స్వేచ్ఛను ఇస్తుంది.

సమాధానం: బీహార్‌లో వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను 2006లో రద్దు చేశారు. బీహార్‌ అనుభవాన్ని పరిశీలిస్తే స్వేచ్ఛా మార్కెట్‌ వ్యవసాయ చట్టాలు ఏ విధంగా ఉంటాయో అర్థం అవుతుంది. భారత ప్రభుత్వానికి చెందిన డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ లెక్కల ప్రకారం బీహార్‌లో 20 శాతం కంటే తక్కువ వరినీ, గోధుమలను అసలుకే ప్రభుత్వ సంస్థలు సేకరించలేదని స్పష్టమవు తున్నది. ప్రభుత్వ నివేదికల ప్రకారం ఆహార ధాన్యాల సేకరణను ప్రభుత్వం నడుపుతున్న కేంద్రాలు 2015-16లో 9000 ఉంటే, 2019-20కి వచ్చేసరికి 1,619కి తగ్గిపోతున్నాయి.

  • అపోహ నెం.4: కొత్త చట్టాలు కనీస మద్దతు ధరను రద్దు చేయవు. దానితో రైతులు తమ పంటను ప్రయివేటు మార్కెట్‌లో ఎక్కువ ధరకు అమ్ముకునే స్వతంత్రత ఉంటుంది.

సమాధానం: 2018లో రైతులను, వ్యాపారస్తులను చేసిన సర్వే ఆధారంగా రిజర్వ్‌ బ్యాంక్‌ తయారు చేసిన నివేదిక ప్రకారం 50 శాతం రైతులు కనీస మద్దతు ధర లాభదాయకమైన స్కీం అని అభిప్రాయపడ్డారు. కానీ ఈ చట్టంలో ఎక్కడా అగ్రి బిజినెస్‌ సంస్థగానీ, వ్యాపారిగాని కనీస మద్దతు ధరకంటే తక్కువగా కొనకూడదని లేదు. అయితే కనీస మద్దతు ధర అనేవి కాగితాలపై కొనసాగవచ్చు. కాల క్రమంలో అది బీహార్‌లో లాగా నిర్వీర్యమైపోతుంది. బీహార్‌ రైతులకు ఎక్కుడున్నా ఎవరికైనా అమ్ముకునే స్వేచ్ఛ ఉన్న ఎక్కువ ధర రావడం లేదు. 2019-20లో కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 1,815 నిర్ణయించినా, వ్యాపారుల ఒత్తిడిలో రైతులు రూ. 1,350 నుంచి రూ. 1,400లకే క్వింటాల్‌ ధాన్యం అమ్ముకున్నారు. గోధుమలకు ఎంఎస్‌పీ రూ. 1,925గా నిర్ణయించినప్పటికి రైతులు రూ. 1,800లకు కొన్ని చోట్ల ఇంకా తక్కువ ధరకు బీహార్‌లో అమ్ముకున్నారు. మక్కలకు ఎంఎస్‌పీ రూ.1,850గా నిర్ణయించినా.. రైతులకు మాత్రం 1000-1350 మాత్రమే లభించింది.

  • అపోహ 5: కొత్త వ్యవసాయ చట్టాలు అమలు అయితే ప్రయివేటు వారు హోల్‌సేల్‌ మార్కెట్‌లు, శీతల గిడ్డంగులను గొలుసుకట్టుగా నిర్మిస్తారని ప్రకటిస్తున్నారు.

సమాధానం: బీహార్‌ అనుభవం ప్రకారం అలాంటిది ఏది జరుగలేదు. భారత ప్రభుత్వ అధ్యయనాలు కూడా మోడీ ప్రభుత్వం చెపుతున్నదాన్ని ఎక్కడా నిరూపించడం లేదు. ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ (ఎన్‌ఐఏయం) ప్రకారం వ్యవసాయ మార్కెట్‌ల నిర్వహణకు వ్యవస్థీకృత యంత్రాంగం లేకపోవడంలో ఒక శూన్యం ఏర్పడింది. ఈ పరిస్థితులలో చిన్న రైతులు మరో ప్రత్యామ్నామం లేక వ్యాపారస్తుల గుత్తాధిపత్యం ఉన్న మార్కెట్‌నే ఆశ్రయించాల్సి వస్తున్నది.

  • అపోహ నెం 6: ఏపీఎంసీల రద్దుకు చెబుతున్న ముఖ్యకారణం.. అవి కృత్రిమంగా ధరలను తగ్గిస్తూ రైతులను నష్టపెడుతున్నాయనీ,కార్పొరేట్లను అనుమతిస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు.

సమాధానం: విత్తనాలు, పురుగు మందులు వంటివన్నీ గత దశాబ్దంలో పెద్ద కార్పొరేట్‌ సంస్థల గుప్పిట్లోకి పోయాయి. అదే సందర్భంలో వ్యవసాయానికి అవసరమైన మధ్యంతర వస్తువుల ధరల విపరీతంగా పెరిగిపోయాయి. వ్యవసాయ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం వ్యవసాయానికి మధ్యంతరంగా అవసరమైన వస్తువుల ధరల పెరుగుదల అనేది వ్యవసాయ వాణిజ్యంలో స్తబ్దతకు క్రమంగా పరిస్థితి దిగజారి పోవడానికి ప్రధాన కారణంగా గుర్తించారు.

  • అపోహం నెం.7: వ్యవసాయ వాణిజ్యంలో ప్రయివేటు సంస్థలకు ద్వారాలు తెరవడం వలన పోటీ ఏర్పడి రైతులకు మంచి ధర లభిస్తుంది. కొనుగోలుదారులు ఎక్కువ మంది ఉంటారు. పోటీతత్వం ఏర్పడుతుంది అందుకని రైతు ఎక్కువ ధర కోసం బేరసారాలు ఆడే అవకాశం ఏర్పడుతుంది.

సమాధానం: క్షేత్ర స్థాయిలో ఈ వాదన సరికాదని అర్థం అవుతున్నది. కనీస మద్దతుధర ప్రభుత్వ సేకరణ అనేవి ఉండబట్టే వ్యవసాయ ధ్యానాల ధరలకు నిలకడ ఏర్పడుతుంది. నేషనల్‌ శాంపుల్‌ సర్వే ఆధ్వర్యంలోని పరిస్థితుల అంచనా సర్వే ప్రకారం 2012-13లో వరికి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 1,250గా ప్రకటించారు. పంజాబులోని సన్నకారు రైతులు వారి పంటలోని సగ భాగాన్ని మండీలలో రూ.1,500లకి అమ్ముకున్నారు. కనీస మద్దతు ధర కంటే 20 శాతం ఎక్కువ పొందారు. ఉత్తరప్రదేశ్‌లోని రైతులు వారి పంటలోని 16 శాతాన్ని కేవలం 1010కే అమ్ముకున్నారు. ఇది ఎంఎస్‌పీ కంటే చాలా తక్కువ తాజా వ్యవసాయ గణాంకాలు 2015-16 ప్రకారం వ్యవసాయం చేస్తున్న వారిలో 86 శాతం మంది చిన్న సన్నకారు రైతులే ఉంటారు. ఈ చిన్న రైతులకు ప్రయివేటు వ్యాపారస్తులతో బేరసారాలు ఆడే శక్తి ఉండదు. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే పెద్ద కార్పొరేట్‌ సంస్థలు ప్రవేశిస్తే.. చిన్న సన్నకారు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోతుంది.

  • అపోహ నెం: 8: అన్ని సరుకులకు స్వేచ్ఛ మార్కెట్‌ ఉంటే, వ్యవసాయంలో ఎందుకు ఉండ కూడదు?

సమాధానం: ఆహారధాన్యాల ధరలు ఇష్టానుసారంగా పెరగవు. దిగుబడి అనేక కారణాలతో ప్రభావితమవుతుంది. వాతావరణలో వచ్చే తేడాలు బాగా ప్రభావం చూపుతుంటాయి. ధరలు బాగా తగ్గిపోతే రైతు అప్పుల పాలై పోతారు. అది వారికి శాశ్వతంగా పీడిస్తుంది. ధరలు బాగా పెరిగిపోతే కూడా కొనుగోలుదారు తగ్గిపోయి ఇబ్బందిలో చిక్కుకుంటారు. ఇది ఆహారధాన్యాల విషయంలో జరిగితే దారుణమైన పరిస్థితికి నెట్టబడుతారు. అందుకని వ్యవసాయ మార్కెట్‌ అనేది రెండు జాతీయ లక్ష్యాల మధ్య సమతుల్యతను సాధించాల్సి ఉంటుంది. ఒకటి రైతుకు ఆదాయం వచ్చేలా, కొనుగోలుదారుడికి ఆహార భద్రత ఏర్పడేలా ఉండాలి.

ఒకే పంటను పండించే రైతు కూడా ఇతరులకు కొనుగోలుదారుడే అవుతాడు.ఇలాంటి తీవ్ర పరిస్థితులలో ధరల విపరీతంగా పడిపోవడం ప్రతిబింబించే రెండు ఉదాహరణలలో ఒకటి 1990లో వచ్చిన సంక్షోభంతో రైతు విపరీతమైన అప్పుల భారంలో కూరుకుపోయారు. రెండవది 1943లో ఏర్పడిన బెంగాల్‌ కరువు అందులో 30 లక్షల మంది చనిపోయారు. 1930 ఆహారధాన్యాల ధరలు పడిపోవడంలో కొనుగోలుదారులు లాభపడలేదు. అదే విధంగా బెంగాల్‌ కరువులో ఆహార ధాన్యాల ఉత్పత్తి దారులు లాభపడలేదు. నియంత్రిత మార్కెట్‌ స్థానంలో స్వేచ్ఛ మార్కెట్‌ ఉండాలనే వాదన సరికాదని పై ఉదాహారణలు గమనిస్తే అర్థం అవుతుంది.

సరుకు కొరత ఏర్పడినప్పుడు స్వేచ్ఛ మార్కెట్‌లో ఎవరు కొనరు?. కొనుగోలు అనేది స్వేచ్ఛ మార్కెట్‌కు వదిలివేస్తే దాని పర్యావసనంగా భూమి అనేది ఆహార ధాన్యాల ఉత్పత్తి నుంచి దారి మళ్లించబడి, పంటలు వేయడానికి మళ్ళించబడటమో. సంపన్నులకవసరమైన ఇతర పద్ధతులకో భూమి మారిపోతుంది. ఈ పరిస్థితి ఆహారదాన్యాల ధరలను విదేశాల నుంచి దిగుమతి కారణంగా పెంచలేక పోయినా అది తప్పని సరిగా రెండు పనులను మాత్రం చేస్తుంది. ఒక్కటి మనం కొన్ని సంవత్సరాలు కష్టపడి సాధించిన స్వయం పోషకత్వాన్ని దెబ్బతీస్తుంది. తద్వారా మన దేశాన్ని ఆహార ధాన్యాల దిగుమతిపై ఆధారపడే దేశంగా మార్చివేస్తుంది. రెండు విపరీతంగా ఆకలితో బాధపడే వారి సంఖ్యను పెంచి వేస్తుంది.

  • ఆపోహ నెం. 9: వ్యవసాయ చట్టాలు చేసే ఆధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది కదా..!

సమాధానం: రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితాలో ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవసాయ చట్టాలను చేసి రాష్ట్రాల అధికారాలపై దాడి చేసింది. ఈ అంశంపై రైతులు సివిల్‌ కోర్టుకు పోకుండా ఈ చట్టాలు అడ్డుపడుతున్నాయి. ఇది రాజ్యాంగంలోని 32వ అధికరణకు విరుద్ధం ఎందుకంటే 32వ అధికరణలో ప్రతి పౌరుడికి న్యాయం పొందే హక్కును గ్యారంటీ చేసింది. ఈ చట్టాలు, కోర్టులకు ఉన్న అధికారాలను అధికారగణానికి బదిలీ చేస్తున్నది. భారత రాజ్యాంగాన్ని ఈ చట్టాలు ఉల్లంఘిస్తున్నాయి.

(* వ్యాసకర్త: విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ)