పోలీసు కష్టాలంటే ఇవే మరి… వైరల్‌గా మారిన వీడియో

3837

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28 (న్యూస్‌టైమ్): పోలీసుల కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెలవుల్లేని ఉద్యోగం, ప్రశాంతత లేని జీవితం. అర్థరాత్రి పిలిచినా పరిగెత్తుకెళ్లాలి. చిన్న పిల్లలు ఉన్న పోలీసు తండ్రుల బాధలైతే ప్రత్యేకమే. కనీసం వాళ్లతో కాసేపు సరదాగా ఆడుకునే సమయం కూడా దొరకదు. ‘దొర’గారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి, అది ఏ సమయమైనా కావచ్చు. చెప్పింది చేయాల్సిందే. లేకుంటే ఇచ్చే జీతభత్యాల మాట దేవుడెరుగు స్పెషల్ ట్రీట్‌మెంట్ తట్టుకోవడం కష్టమే. తండ్రి తనతో ఎక్కువసేపు గడపాలనే చిన్ని మనసును కష్టపెట్టక తప్పదు వారికి.

అచ్చం ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఓ పోలీసు అధికారి ఆఫీసుకు వెళ్లటానికి ప్రయత్నిస్తుంటాడు. అతడి కొడుకు పోలీసు తండ్రి కాళ్లు గట్టిగా పట్టుకుని వెళ్లవద్దంటూ ఏడుస్తుంటాడు. ఏడుస్తున్న పిల్లాడిని సముదాయించలేక, ఆఫీసుకు వెళ్లకుండా ఉండలేక అతడుపడ్డ వేదన వర్ణణాతీతం. పట్టువదలని విక్రమార్కుడిలాంటి కొడుకు తన పట్టు సాధించడాని పట్టు విడవకుండా తండ్రిని పట్టిన పట్టు సామాన్య జనాన్ని కదిలిస్తుంది. ఒకటి ఇరవై నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను చూసిన చాలా మంది హృదయం ద్రవించింది.

పోలీసు కుటుంబాలకు జోహార్లు. అందరి లాగా వారికి కూడా 8 గంటల డ్యూటీ, వారంతంలో సెలవు ఉండేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్లేమీ ఉగ్రవాదులో, తీవ్రవాదులో లేక చట్టం వర్తించని కట్టుబాసినలో కాదన్న విషయాన్ని ముందుగా గుర్తించాలి. పోలీసు దుస్తులు ధరించిన అందరికి సెల్యూట్‌! అంటూ ఎవరికి తోచినట్లు వాళ్లు తమ సానుభూతి ప్రకటిస్తున్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే, ఎక్కడి నుంచో సోషల్ మీడియాలో పోస్ట్ అయి వైరల్‌గా మారిన వీడియో సంగతి ఏమో గానీ నిజ జీవితంలో పోలీసుల విధి నిర్వహణ గురించి తెలియంది ఎవరి? రోజుకు ఇరవై నాలుగు గంటల డ్యూటీ. కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి ఉండదు.

ఇలాంటి ఉద్యోగం ఎవరైనా మీరు చేస్తారా అని అడిగితే వామ్మో అంటారు. ఇలాంటి ఉద్యోగం చేస్తూ వాళ్లు చస్తున్నారు. కుటుంబాలకు దూరంగా నెలల తరబడి అడవుల్లో పనిచేస్తుంటారు. ఈ అవస్థలేవి జనాలకు, నేతలకు, ఉన్నతాధికారులకు కనిపించవు. ఎంత కష్టపడ్డ అవినీతి ముద్ర తప్ప ఆదరణ మాత్రం దొరకదు. ఎవరికీ కనిపించని ఖాకీల కష్టాలపై మీడియాలో అనేక ప్రత్యేక కథనాలే వచ్చాయి. కానీ, స్పందించిన ప్రభుత్వాలు ఎన్ని? ఉద్యమాలు, పండుగలు, ఊరేగింపులు, ధర్నాలు, ఆందోళనలు, కర్ఫ్యూలు, బందోబస్తులు ఎన్‌కౌంటర్లు ఇలా చెప్పుకోలేని అవస్థలు. ఇవీ ఖాకీల జీవితంలో కొలువు దీరిన కష్టాలు.

ఖాకీలంటే భయపెట్టే వాళ్లనే ముద్ర ప్రజల్లో ఉంది. వాళ్ల జీవితాల్లో ఇబ్బందుల్లేవి ఉండవా? పెద్ద అధికారుల ఆర్డర్లను నోరు మూసుకొని భరిస్తూ సహిస్తూ వస్తున్న పోలీసుల కష్టాలు ఎవరికీ కనిపించవు. రోజుకు 24 గంటల డ్యూటీ. నెలకు ఒక్కరోజే సెలవు. భరించలేనంత పని ఒత్తిడి. ఇదీ మన పోలీసుల డ్యూటీ పరిస్థితి. వినడానికే ఇంత భయంగా ఉంటే మరి చేసే వారి పరిస్థితి ఏలా ఉంటుంది. రోజంతా పనిచేసేటప్పుడు తిండితిప్పలు లేకపోయినా అడిగే నాథుడు ఉండడు. ఆరోగ్యం బాగా లేకపోయినా చచ్చినట్లు చేయాల్సిందే. పైగా డ్యూటీలో ప్రాణాలకు గ్యారెంటీ కూడా ఉండదు. ఏ ఉద్యోగానికైనా డ్యూటీ టైమింగ్స్‌ ఉంటాయి. కానీ పోలీసు ఉద్యోగానికి మాత్రం నో వీక్లీ ఆఫ్స్‌, నో లీవ్స్‌, నో హాలీడేస్‌.

వారమంతా పనిచేయాల్సిందే. వారు శాంతి భద్రతలను కాపాడానికి అనుక్షణం పనిచేయాల్సిందే. వాస్తవానికి కానిస్టేబుల్‌ స్థాయిలో రోజుకు 24 గంటల డ్యూటీ చేస్తే మరుసటి రోజు లీవ్‌. కానీ ఇది కాగితాలకే పరిమితి. ఒక్కసారి డ్యూటీలోకి వెళితే పెద్దసార్‌ చెప్పే వరకు ఉండాల్సిందే. అదే బందోబస్తు డ్యూటీకి వెళితే అడుగనే అక్కర్లేదు. తిండి తిప్పలుండవు. కానిస్టేబుల్‌ స్థాయి వారికి సెలవులు, వారంతపు సెలవులుండవు. ఒక్క కానిస్టేబుళ్ళకే కాదు. ఎస్‌ఐ, సీఐ ఆపై స్థాయి అధికారులు ఉద్యోగులకు సెలవులనేవి ఉండవు. సాధారణ పోలీసుల పరిస్థితి ఇలా ఉంటే ఇక, బెటాలియన్‌లో పనిచేసే ప్రత్యేక పోలీసులది మరో స్టోరీ. అక్కడి కానిస్టేబుళ్లకు ఆర్నెళ్లు డ్యూటీలు ఉంటాయి.

ఇళ్లు వదిలి ఒక్కసారి డ్యూటీ కోసం బయటకు వెళితే మళ్లీ చూసేది వాళ్లు వచ్చిన తర్వాతే. ఇక నక్సల్స్‌ వేట కోసం వెళ్లే గ్రేహౌండ్స్‌ విషయం వేరు. వాళ్లకు ఓ టైముండదు. ఎప్పుడు వెళ్తారో, ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియదు. ఒక్కసారి అడవిలోకి కాలు పెట్టిన అనంతరం మళ్లీ ఇంటికి చేరే వరకు గ్యారెంటీ ఉండదు. వీళ్లంతా డ్యూటీలు ముగించుకొని ఇంటికి వచ్చి హాయిగా ఉంటారనుకుంటే పొరపాటే. ఆ సమయంలో కూడా మళ్లీ ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పేరిట సగంరోజులు నాన్‌ డ్యూటీ సర్వీసులో ఉంచుతుంటారు. ఇలా పోలీసులంటే విపరీతమైన పని ఒత్తిడికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నారు. పోలీసులకు వారంతపు సెలవు ఇస్తామని, పని ఒత్తిడిని తగ్గిస్తామని చెప్పిన మాటలన్ని కాగితాలకే పరిమితమయ్యాయి.

తీవ్రమైన సిబ్బంది కొరత కారణంగా వరుసగా డ్యూటీలు చేయాల్సిన దుస్థితి. పోలీసు మాన్యువల్‌ ప్రకారం ప్రతీ 500 మందికి ఒక పోలీసు ఉండాలని నిబంధన ఉంది. దానికి భిన్నంగా పదివేల మంది జనాభాకు ఒకరు చొప్పున సిబ్బంది ఉండడంతో వారంతపు సెలువు మిథ్యగానే మిగిలిపోయింది. దీనికి తోడు పోలీసుల వ్యవస్థకు సమాంతరంగా పనిచేస్తున్న మరో విభాగమే హోంగార్డులు. నక్సల్స్‌ పోరులో వీళ్లు సైతం బలైపోయారు. పోలీసులు వెళ్లలేని దగ్గరికి ఈ వ్యవస్థే వెళ్లేది. హోంగార్డులకు సైతం టైమింగ్‌ అంటూ లేదు. ఎప్పుడు ఏ అధికారి ఏ పని చెప్తారో తెలియదు. అడవుల్లోకి సైతం పంపిస్తుంటారు.

ఎలాంటి ఉద్యోగ భద్రత లేకపోయినా పోలీసులకు దీటుగా పనిచేస్తుంటారు. సమాజం కోసం మేమున్నామంటూ పనిచేస్తున్న పోలీసులకు సెల్యూట్‌ చేయాల్సిందే. ఈ నేపథ్యంలో కుర్రాడు తన తండ్రి కోసం ఇలా చేయడంలో తప్పేముంది? అయినా, దాన్ని చూసే పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ పాలకులూ ఎంతమంది? వారు చూస్తే కదా? విషయం ఏమిటో తెలిసేది.