హైదరాబాద్, సెప్టెంబర్ 16 (న్యూస్‌టైమ్): రాష్ట్ర ప్రభుత్వం అటవీ పునరుద్దరణకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నందున అటవీ శాఖ ఉద్యోగులు, సిబ్బంది మరింత బాధ్యతగా, అప్రమత్తంగా పనిచేయాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ తెలిపారు. సాచురేషన్ పద్దతిలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని అటవీ బ్లాకుల్లో ఉన్న క్షీణించిన అడవుల పునరుద్దరణ జరగాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ఆమె తెలిపారు. అటవీ సర్కిళ్లు, అన్ని జిల్లాల అటవీ అధికారులతో పీసీసీఎఫ్ రెండు రోజుల పాటు అరణ్య భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అటవీ పునరుద్దరణ కార్యక్రమం–కార్యాచరణ అంశంపై జరిగిన చర్చలో రాష్ట్రంలో పునరుద్దరణ చేయాల్సిన అటవీ ప్రాంతాలను విశ్లేషించారు. 21 లక్షల ఎకరాలను 1706 బ్లాకుల్లో పునరుద్దరించాల్సిన ఆవశ్యకతను అధికారులు గుర్తించారు. కృత్రిమ పద్దతుల ద్వారా పునరుద్దరణ లక్ష్యం 11 లక్షలు (మొత్తం = 21+11= 32 లక్షలుగా నిర్ణయించారు.

అటవీ పునరుద్దరణ చేసిన ప్రాంతం (2019-20 వరకు); 8.65 లక్షల ఎకరాలు/740 బ్లాకుల్లో సుమారు 35. 267 కోట్ల మొక్కల పునరుద్దరణ చేయడం జరిగిందని, ఈ యేడాది పెట్టుకున్న లక్ష్యం (2020-21) 2.10 లక్షల ఎకరాలు/920 బ్లాకుల్లో, సుమారు 8.165 కోట్ల మొక్కల పునరుత్పత్తిగా నిర్దారించినట్లు అధికారులు తెలిపారు. రానున్న నాలుగేళ్లలో పునరుద్దరణ కోసం నిర్దేశించుకున్న అటవీ భూమి ; 10.25 లక్షల ఎకరాలని, రాష్ట్రంలో పచ్చదనం, అటవీ సాంద్రత పెంచేందుకు వంద శాతం (సాచురేషన్ పద్దతిలో) అన్ని అటవీ బ్లాకుల్లో పునరుద్దరణ పనులు లక్ష్యగా పెట్టుకున్నామన్నారు. అటవీ భూముల సరిహద్దుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు, కందకాల తవ్వకం ద్వారా రక్షణ కల్పించడం, తద్వారా మానవ, జంతు సంచారాన్ని అడవుల్లో నివారించడం, సహజ పద్దతుల్లో అడవి పునరుద్దరణ జరిగేలా చర్యలు చేపట్టడం తమ ముఖ్యోద్దేశంగా పీసీసీఎఫ్ శోభ తెలిపారు. కందకాల కట్టలను బలోపేతం చేస్తూ, వాటిపై గచ్చకాయ మొక్కలు నాటి, పెంచటం ద్వారా సహజమైన రక్షణ కవచం లాగా ఉపయోగపడేలా చేయనున్నామన్నారు. అడవుల్లో ఖాళీ ప్రదేశాల్లో అయా ప్రాంతాలకు అనువైన మొక్కలనే నాటడం, అనవసరమైన కలుపు మొక్కలను తొలగించటం ద్వారా సహజంగా చెట్లు పెరిగేలా చేయడం, జీవ వైవిధ్యాన్ని సాధించడం, రూట్ స్టాక్ సహజంగా పెరుగేందుకు వీలుగా అనువైన పద్దతులను అనుసరించడం, సహజ నీటి చెలిమల చుట్టూ వెదురు మొక్కలు నాటడం, అగ్ని ప్రమాదాల కారణాలను పసిగట్టడం, నివారణ చర్యలు, నేల, తేమ పరిరక్షణ చర్యల ద్వారా అటవీ ప్రాంతాలు, సమీప గ్రామాల్లో నీటి సౌకర్యం పెరిగేలా చర్యలు చేపట్టడం లక్ష్యంగా నిర్ణయించామన్నారు.

అటవీ ప్రాంతాల్లో పచ్చదనం సాంద్రత అత్యంత తక్కువగా ఉన్న చోట్ల ఇరవై కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని సాధించేందుకు నాణ్యమైన, ప్రాంతీయ మొక్కలు నాటేలా చర్యలు చేపట్టడంతో పాటు గజ్వేల్‌తో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన అటవీ పునరుద్దరణ మంచి ఫలితాలు ఇస్తోందని, ప్రణాళికా బద్దంగా, మొత్తం క్షీణించిన అడవుల పునరుద్దరణ లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని పీసీసీఎఫ్ కోరారు. రెండు రోజుల పాటు జరిగిన సమావేశంలో అన్ని అటవీ సర్కిళ్లకు చెందిన చీఫ్ కన్జర్వేటర్లు, అన్ని జిల్లాల అటవీ అధికారులు, పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.