మాజీ మంత్రి దేవినేని నిరాహారదీక్ష

0
6 వీక్షకులు

విజయవాడ, మే 1 (న్యూస్‌టైమ్): కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా కృష్ణా జిల్లా గొల్లపూడిలోని తన నివాసం వద్ద తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శుక్రవారం 12 గంటలు నిరాహార దీక్ష చేపట్టారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలకు రూ.5 వేల పరిహారం ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్‌తో టీడీపీ ఈ నిరసనకు పిలుపునిచ్చింది. మే ఒకటో తేదీ కార్మిక పోరాట స్ఫూర్తి, చైతన్యానికి ప్రతీకని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మిక సోదరులందరికి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా గొల్లపూడి తన నివాసంలో మాజీ మంత్రి దేవినేని ఉమా 12 గంటల నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో జీవనభృతి కోల్పోయి ఉపాధి లేక వలస కూలీలు, కార్మికులు చాలా పెద్ద ఎత్తున రాష్ట్రాల మధ్య నడుస్తున్నారని, రాష్ట్రంలో సుమారుగా 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వాలు వద్ద భవన నిర్మాణ కార్మికుల నిధి క్రింద సెస్ రూపంలో నిధులును వాటిని వెంటనే వారికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ఆయన దీక్షకు దిగారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రతి పేద కుటుంబానికి రూ. 5 వేలు ఆర్థిక సహాయం అందించాలని, మూసేసిన అన్నా క్యాంటీన్లను వెంటనే తెరవాలని, చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, ధాన్యం, మామిడి, పత్తి, మిర్చి, మల్లె, టమాటా, పండ్ల తోటల ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలుచేయాలని, వ్యవసాయ, ఉద్యానవన, సెరికల్చర్, ఆక్వా, పౌల్ట్రీ రైతాంగాన్ని ఆదుకోవాలని దేవినేని డిమాండ్ చేశారు.

కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది పోలీసులు ఇతర అధికారులకు రక్షణ కిట్లను అందించాలని, ప్రజా రాజధానిగా అమరావతి కొనసాగించాలని, పేదలను, రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలనే ఆరు ప్రధాన డిమాండ్లతో మాజీ మంత్రి దీక్ష చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here