తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో మాణిక్యాలరావు అంత్యక్రియలు జరుపుతున్న దృశ్యం

విజయవాడ, ఏలూరు, ఆగస్టు 1 (న్యూస్‌టైమ్): బీజేపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు కరోనా వల్ల కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 59 సంవత్సరాలు. నెల క్రితం కరోనా కారణంగా ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో నెల రోజులుగా విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం మృతి చెందారు. నారా చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో బీజేపీ కోటాలో మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 2014 నుంచి 2018 వరకూ ఆయన మంత్రిగా పనిచేశారు.

ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వారం క్రితమే విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గత కొద్ది రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ప్రాణాలు విడిచారు. మాణిక్యాలరావుకు భార్య సూర్యకుమారి, కుమార్తె సింధు ఉన్నారు. 9 ఏళ్లకే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరి అంచెలంచెలుగా ఎదిగి 1961 నవంబర్‌ 1న తాడేపల్లిగూడెంలో జన్మించిన మాణిక్యాలరావు అక్కడే పాఠశాల విద్యనభ్యసించారు.

ఆ తర్వాత కళాశాల విద్యను పెంటపాడులో పూర్తిచేశారు. 9 ఏళ్ల వయస్సులోనే రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)లో చేరారు. భాజపా ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఫొటోగ్రాఫర్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఫొటో స్టూడియో మూసివేసి సింధు షూ మార్ట్‌ను ప్రారంభించారు. దాన్ని సింధు ఎంటర్‌ప్రైజెస్‌గా మార్చి ఆటోమొబైల్‌ విడిభాగాల విక్రయాలు చేసేవారు. 2011-2013 వరకు ‘మానవత’ సంస్థ తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షుడిగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సంస్థ ద్వారా జిల్లాలోని పలు పట్టణాల్లో శీతల శవపేటికలు ఉచితంగా ఏర్పాటు చేసేవారు.

పైడికొండల మాణిక్యాలరావు

రాష్ట్ర విభజన అనంతరం తెదేపా-భాజపా కూటిమి అభ్యర్థిగా 2014లో తాడేపల్లిగూడెం నుంచి పోటీచేసిన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 నుంచి 2018 వరకు తెదేపా ప్రభుత్వంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

దశాబ్దాలపాటు బీజేపీకి విశేష సేవలందించిన నాయకుడు మాణిక్యాలరావు. మంత్రిగా రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించారు. ఆయన అకాల మరణం పార్టీకి పార్టీ శ్రేణులకు తీరని లోటని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. ఆయన స్వతహగా స్వయంసేవక్‌గా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో చురుకుగా పనిచేస్తూ 1987లో భాజపాలో చేరి అంచెలంచెలుగా జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షునిగా పార్టీకి పలు సేవలు అందించిన మాణిక్యాలరావు 2014 శాసనసభకు ఎన్నికై, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రిగా పని చేసి ఆయన 2018లో పార్టీ సంస్థాగత ఎన్నికల్లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు బిజెపి ఆంధ్రప్రదేశ్ శాఖ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోందని వీర్రాజు తెలిపారు.

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు: జగన్

కరోనా బారిన పడి చికిత్స పొందుతూ మాజీ మంత్రి, భాజపా నేత పైడికొండల మాణిక్యాల రావు తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాణిక్యాల రావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహణకు అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్ట్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. మాణిక్యాల రావు మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రులు నారా లోకేశ్‌, కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ సుజనా చౌదరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

‘‘పైడికొండల మాణిక్యాల రావు మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ భాజపా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి పని చేశాను. మంచి స్నేహశీలి. చిత్తశుద్ధి, నిబద్ధతతో ఆయన పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి మంత్రిగా పని చేశారు. మాణిక్యాల రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. ‘‘మాణిక్యాల రావు మరణం నాకు తీరని లోటు. మాణిక్యాలరావు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

‘‘మాణిక్యాల రావు మృతి పార్టీకి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ఫొటోగ్రాఫర్‌గా కెరీర్‌ను ప్రారంభించి, రాష్ట్ర మంత్రిగా ఎదిగిన ఆయన ప్రయాణం ఎంతోమందికి ఆదర్శం.’’ అని భాజపా ఎంపీ సీఎం రమేశ్ పేర్కొన్నారు. నటుడు చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తదితరులు మాణిక్యాలరావు మృతికి సంతాపం తెలిపారు.

మరోవైపు, అధికార లాంఛనాలతో మాజీమంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు అంత్యక్రియలు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని మానవతా శ్మశానవాటికలో పూర్తయ్యాయి. మాణిక్యాలరావు అంత్యక్రియలకు ఆయన కుటుంబసభ్యులతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. డీఎస్పీ కె.రాజేశ్వర రెడ్డి, ఆర్డీవో రచన, మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, పోలీస్ అధికారులు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

మాణిక్యాలరావు చివరి సందేశం…

తనకు కరోనా పాజిటివ్‌గా వచ్చిన విషయాన్ని ప్రకటిస్తూ ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కోరుతూ జులై 4న పైడికొండల మాణిక్యాలరావు ఇచ్చిన వీడియో సందేశం