రైతులకు పూర్తి భరోసా: కలెక్టర్

28

నెల్లూరు, మే 21 (న్యూస్‌టైమ్): రైతులు పంటలు సాగు విషయంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ముందుగానే గుర్తించి వాటి నివారణకై సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని జిల్లా కలెక్టరు ఎం.వి. శేషగిరిబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అందించవలసిన విత్తనాలు అందుబాటులో వున్నాయా, లేదా విత్తనాలు నాణ్యత లో సం లేకుండా వున్నాయా, లేవా అడిగి తలుసుకున్నారు. విత్తన కొరత ఏమైనా వున్నట్లయితే అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి విత్తనాలను అందుబాటులో వుంచాలన్నారు. ఎన్ని వేల ఎకరాలలో సాగుచేస్తున్నది ఎప్పటికప్పుడు వివరాలు సేకరించాలని అన్నారు. మండల స్థాయిలో, గ్రామస్థాయిలో రైతుల వివరాలను అందుబాటులో వుంచాలన్నారు. ఏ పంటలు వేస్తున్నది వివరాలు సేకరించాలని అన్నారు. త్వరలో ఏర్పాటు చేయనున్న రైతుభరోసా కేంద్రాలు భవిష్యత్తులో చాలా కీలకం కానున్నాయని ఆయన అన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ఆయా ప్రాంతాల రైతుల వివరాలు అందుబాటులో వుంచాలన్నారు. రైతుభరోసా కింద లబ్ది పొందిన వారి వివరాలను పొందుపరచాలన్నారు.

జిల్లాలో సుమారుగా 14వేల మందికి పైగా వివిధ కారణాలతో రైతుభరోసా నగదు జమకాలేదని, వారికి నగదు జమ అయ్యే విధంగా తగిన చర్యలు చేపట్టాలన్నారు. సబ్సిడీపై ఎరువులు అంద చేయుటకు యూరియా వంటివి పూర్తి స్థాయిలో అందుబాటులో వుంచుకోవాలని, యింకనూ కావల్సి వుంటే సరైన ప్రతిపాదనలు సమర్పించాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు వాస్తవాలను గుర్తించి వాటి వివరాలను నివేదికల ద్వారా అందించాలన్నారు. అవసరమైన మేర పెస్టిసైడ్స్ వున్నాయా, లేదా అడిగి తెలుసుకున్నారు. డి.ఆర్.సి. ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కర్షక్ ద్వారా నమోదు చేసుకున్న వారందరికి సబ్సిడీ ద్వారా అందిస్తున్న లబ్ది ప్రతి రైతుకు అందాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టరు ఆనందకుమారి, డిప్యూటీ డైరెక్టర్లు ప్రసాద్, శివనారాయణ, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.