దేశీయ స్టాక్ మార్కెట్లకు లాభాల పంట!

1620
  • పదేళ్ల తర్వాత తారాజువ్వలా ఎగిసిన సూచీ!

  • ఎగ్జిట్‌పోల్స్ అంచనాల నేపథ్యంలో మదుపరుల హుషారు

ముంబయి, మే 20 (న్యూస్‌టైమ్): సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్ అంచనాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు అనూహ్య ఫలితాలను నమోదుచేసుకున్నాయి. దాదాపు పదేళ్ల తర్వాత అతిభారీ లాభాలతో మదుపరులు పండుగ చేసుకున్నారు. తారాజువ్వలా ఎగిసిపడిన సూచీలతో సోమవారం స్టాక్ మార్కెట్లు ముగిశాయి. సెన్సెక్స్‌ 1,434 పాయింట్లు లాభపడి 39,365 వద్ద, నిఫ్టీ 422 పాయింట్లు లాభపడి 11,830 వద్ద ముగిశాయి. భారతీయ జనతా పార్టీ కూటమి మరోసారి భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించడంతో మార్కెట్లు లాభపడ్డాయి. ఊహించని విధంగా డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా బలపడింది. సోమవారం నాటి ర్యాలీని ప్రధానంగా బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌ షేర్లు నడిపించాయి. బ్యాంక్‌ నిఫ్టీ దాదాపు 4 శాతం లాభపడింది.

ఇక, ఆటో ఇండెక్స్‌ లాభాలు కూడా 4 శాతంగా నమోదయ్యాయి. సెన్సెక్స్‌లోని ఎస్‌బీఐ 8 శాతం, యస్‌బ్యాంక్‌ 6 శాతం, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, మారుతీ, టాటా స్టీల్‌, ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లు 4 నుంచి 5 శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు, రూపాయి మారకం విలువ రెండు వారాల్లో అత్యధిక స్థాయికి చేరింది. 69.36 మార్కును తాకింది. శుక్రవారం రూ.70.23 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. ఒక వేళ ఎన్‌డీఏ కనుక 300 మార్కును దాటితే ర్యాలీ మే 23 తర్వాత కూడా కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వ్యవస్థలో నగదు ప్రవాహ పరిస్థితి, కార్పొరేట్‌ లాభాలు, ప్రపంచ వ్యాప్త పరిస్థితులు వంటి అంశాలను దృష్టిలోపెట్టుకొని సోమవారం నాటి మార్కెట్‌ జోరు కొనసాగింది. స్థిరమైన ప్రభుత్వం వస్తే ఆటో, ఇన్ఫ్రా, క్యాపిటల్‌ గూడ్స్‌, బ్యాంకింగ్‌ రంగాలు మెరుగైన పనితీరుకనబరుస్తాయని మార్కెట్‌ వర్గాలు భావించాయి. అందుకే ఆయా రంగాల షేర్లు పరుగులు తీశాయని చెప్పాలి. ట్రేడింగ్‌ ఆరంభం నుంచే అతి భారీ లాభాలతో సూచీలు దూసుకెళ్తాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ (బీఈఎస్) దాదాపు 1300 పాయింట్లు ఎగబాకి మళ్లీ 39 వేల మైలురాయిని దాటింది. 2009 మే 18 తర్వాత సెన్సెక్స్‌ ఒక రోజులో ఇంత భారీగా లాభపడటం మళ్లీ ఇప్పుడే. ఈ నేపథ్యంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ చరిత్రలో ఇప్పటివరకు నమోదైన ఒక రోజు భారీ ర్యాలీలలో కొన్నిటిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే, పదేళ్ల క్రితం 2009 మే 18న సెన్సెక్స్‌ చరిత్ర సృష్టించింది. ఒకే ఒక్క సెషన్‌లో రికార్డు స్థాయిలో 2,110 పాయింట్లు ఎగబాకింది.

కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడం మార్కెట్లలో సరికొత్త హుషారు నింపింది. దీంతో ఆ రోజున సూచీలు దూసుకెళ్లాయి. సెన్సెక్స్‌ ఒక రోజులో 2000 పాయింట్లు లాభపడటం మళ్లీ ఇప్పటి వరకు జరగలేదు. ఆ తర్వాత 2015 జనవరి 15న సెన్సెక్స్‌ 729 పాయింట్లు లాభపడింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీరేట్లను తగ్గించడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపర్చింది. ఆ మరుసటి ఏడాది 2016 మార్చి 1న 777 పాయింట్లు ఎగబాకింది. కేంద్ర బడ్జెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలు అప్పట్లో మార్కెట్లకు జోష్‌ను నింపాయి. ఆ తర్వాత రెండున్నరేళ్లకు అంటే 2018 అక్టోబరు 12న 732 పాయింట్లు లాభపడింది. తాజాగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో సూచీ దూసుకెళ్లింది. ఈ నెలలో సెన్సెక్స్‌ దాదాపు 6శాతం పెరిగింది.

కేవలం పదిసెషన్లలో 2,150 పాయింట్లకు పైగా పెరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లు బాగా పెరిగాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ తర్వాత సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాలు మార్కెట్లలో జోష్‌ నింపాయి. ఇప్పటికే ఎన్‌డీఏ ప్రభుత్వం వస్తుందని మార్కెట్లు కొంత ఉత్సాహంగా ఉన్నాయి. దీనికి మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌షేర్ల దూకుడు జోరు పెంచింది. సూచీల్లోని ప్రధాన షేర్లు ఈ ర్యాలీని ముందుండి నడిపించాయి. బ్యాంక్‌ నిఫ్టీ పదిసెషన్లలో ఏకంగా 10శాతం లాభపడింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వంటి షేర్లు దూకుడుగా ఉన్నాయి. విదేశీ సంస్థాగత మదుపుదార్లు ఈ ర్యాలీని దూకుడుగా నడిపించారు. ఎఫ్‌ఐఐలు ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.30వేల కోట్లను మార్కెట్లలోకి తీసుకొచ్చారు. గురువారం ఒక్కరోజే రూ.1,482.99 కోట్ల మేరకు కొనుగోళ్లు చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనాన్ని దృష్టిలో పెట్టుకొని పలు దేశాల కేంద్రీయ బ్యాంక్‌లు వడ్డీ రేట్లను పెంచడంలేదు. అమెరికా ఫెడ్‌ కూడా వడ్డీరేట్ల పెంపుపై కొంత దూకుడు తగ్గించింది. ఇది భారత మార్కెట్లకు కలిసొచ్చింది. దీనికి తోడు ఆర్‌బీఐ వడ్డీ రేట్లను మరింత తగ్గించే సూచనలు ఉండటం కూడా మరో కారణం. మరోపక్క చైనాతో చర్చలు చాలా బాగా జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా ప్రకటించడం మార్కెట్లలో జోష్‌ను పెంచింది.

దీనిపై మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. మొత్తానికి అటు అంతర్జాతీయ, ఇటు దేశీయ పరిణామాలు మదుపరులకు బాగానే అనుకూలిస్తున్నాయి. ఈ ర్యాలీ మంగళ, బుధవారాలలో కూడా కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నట్లు మార్గెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం కూడా ఇదే తరహా ఊపు కనిపిస్తే అంతర్జాతయ రికార్డులను దేశీయ స్టాక్ మార్కెట్లు బద్దలుకొట్టడం ఖాయమనే చెప్పాలి.