తిరుపతి, జులై 31 (న్యూస్‌టైమ్): పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో నిర్మాణంలో ఉన్న గరుడ వారథి ఫ్లైఓవర్‌ వంతెన పనులు వేగంగా జరుగుతున్నాయని తిరుమల, తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి పనులు వచ్చే ఏడాది ప్రారంభంలోనే పూర్తి అవుతాయన్నారు. గరుడ వారధి వల్ల శ్రీవారి భక్తులను అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయని తెలిపారు. ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా తిరుమలకు రావచ్చన్నారు. తిరుపతి వాసులకు కూడా ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ, తుడా, టీటీడీ అధికారులు, కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తున్న కంపెనీ ప్రతినిధులతో కలిసి శుక్రవారం ఆయన తిరుపతి పట్టణంలో వంతెన నిర్మాణ పనుల తీరును స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గరుడవారధి అందుబాటులోకి వస్తే, తిరుపతిలో ట్రాఫిక్ సమస్య అన్నది కనిపించదన్నారు. గతం కంటే ప్రస్తుతం వారధి పనులు వేగంగా సాగుతున్నాయని, నిర్ణీత గడువులోపు పూర్తయ్యేలా పర్యవేక్షిస్తున్నామన్నారు. అలాగే కరోనా నుంచి తిరుపతి అర్చకులు కోలుకున్నారని సుబ్బారెడ్డి తెలిపారు. ఇప్పట్లో దర్శనాల టికెట్ల సంఖ్య పెంచే ఆలోచనల లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు రోజుకు 12 వేల టికెట్లు ఆన్‌లైన్‌లో పెడుతుంటే 9 వేలు మాత్రమే బుక్‌ అవుతున్నాయని పేర్కొన్నారు. ఆగస్ట్‌ 1 తర్వాత కేంద్రం ఇచ్చే సూచనల ద్వారా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

శ్రీవారి ఆలయంలో కరోనా బారిన పడిన అర్చకులందరూ కోలుకున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. భక్తుల దర్శనాల సంఖ్య ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని చెప్పారు. ఎస్వీబీసీని యాడ్‌ ఫ్రీ ఛానల్‌గా మార్చాలని నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు. ఇకమీదట దాతల విరాళలతో ఎస్వీబీసీ ఛానల్‌ను నడుపుతామన్నారు. హిందీ, కన్నడ భాషల్లో కూడా ఎస్వీబీసీ ప్రసారాలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే ఆన్‌లైన్‌లో కల్యాణోత్సవ సేవను నిర్వహిస్తామని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here