అమరావతి కోసం దేనికైనా సిద్ధం!

0
4 వీక్షకులు

అమరావతి, జనవరి 9 (న్యూస్‌టైమ్): అమరావతి పరిరక్షణ సమితి సమావేశంలో పాల్గొన్న అనంతరం మచిలీపట్నం బయలుదేరిన తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దారిపొడుగునా ప్రజలు ఘనస్వాగతం పలికారు. అమరావతి కోసం, అన్యాయం అయిపోతున్న రాజధాని రైతులకోసం ప్రభుత్వంతో పోరాడుతున్న ప్రజానాయకుడిపై అడుగడుగునా పూలవర్షం కురిపించారు ప్రజలు.

అంతకముందు విజయవాడలోని వేదిక కల్యాణ మండపంలో జరిగిన అమరావతి పరిరక్షణ సమితి సమావేశానికి తెదేపా నేతలతో కలిసి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. రాజధాని అంశంపై ప్రజలు నిరసన తెలిపేందుకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవడం, ఉద్యమాన్ని అణచాలని చూడడం దారుణమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్న ‘అమరావతి పరిరక్షణ సమితి’ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసింది. రాజధాని ఉద్యమం కోసం మచిలీపట్నంలో తెదేపా అధినేత చంద్రబాబు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సహా ఐకాస నేతలు ప్రజాచైతన్య యాత్ర చేపట్టారు. కోనేరు సెంటర్‌ వద్ద కాలినడకన తిరుగుతూ జోలెపట్టి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో విద్యార్థులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని వారంతా నినాదాలు చేశారు.

మరోవైపు, రాజధాని కోసం గుంటూరులో విద్యార్థి, యువజన ఐకాస ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున విద్యార్థులు, యువత, మహిళలు రోడ్లపైకి తరలివచ్చి అమరావతికి అనుకూలంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

శాంతిభద్రతల పేరుతో అణచివేయాలని చూస్తే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని కోసం పోరాడుతూ ఇప్పటికే 11 మంది రైతులు గుండెపోటుతో చనిపోయారని తెలిపారు. ఐకాస నేతల బస్సు యాత్రను పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. సెక్యూరిటీ కోసం బస్సులు ఆపామని కుంటి సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. నేను కూడా అడ్డుకుని ఉంటే వాళ్లు పాదయాత్రలు చేసేవారా? అని ప్రశ్నించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజారాజధాని కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

అమరావతిలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు అన్నీ సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ప్రజలు నమ్ముతారని ప్రతిరోజు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని ప్రచారం చేయడం కాదు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. హైకోర్టు జడ్జితో విచారణ జరిపించి తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అమరావతి ఇక్కడే ఉంటుందని ప్రకటించే వరకు జేఏసీ పనిచేయాలని, తాను అండగా ఉంటానని చెప్పారు. న్యాయవాదులు కూడా ముందుండి పోరాడితే ప్రభుత్వం దిగిరాకతప్పదన్నారు. సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ, తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, కనకమేడల రవీంద్ర, మాగంటి బాబు, జనసేన, కాంగ్రెస్‌, సీపీఎం, భాజపా నేతలు సమావేశానికి హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here