1,500 ఎకరాల్లో భారీ ఫర్నిచర్‌ పార్కు

ప్రధాన భాగస్వామిగా దేశీయ ఉత్పత్తిదారు

మరో రెండు ప్రముఖ సంస్థలతో ప్రభుత్వం చర్చలు

నెల్లూరు, సెప్టెంబర్ 25 (న్యూస్‌టైమ్): రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాన్న ఏకైక లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు జిల్లాలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫర్నిచర్ తయారీ పరిశ్రమలను నెలకొల్పేందుకు వీలుగా చర్యలు చేపట్టారు. దేశీయ అవసరాలకు తోడు ఎగుమతులే లక్ష్యంగా రాష్ట్రంలో భారీ ఫర్నిచర్‌ పార్కు ఏర్పాటు కానుంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శ్రీ సిటీకి సమీపంలో 1,500 ఎకరాల్లో ఫర్నిచర్‌ పార్కును నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా సుమారు 20 రకాల వస్తువులకు సంబంధించి దిగుమతులను తగ్గించుకుని ఎగుమతి చేసే విధంగా స్వయం సమృద్ధి సాధించాలని లక్ష్యంగా నిర్దేశించారు.

ఇందులో భాగంగా ఏపీలో ఫర్నిచర్‌ పార్కు ఏర్పాటు కానుంది. అంతర్జాతీయంగా ఏటా రూ. 20 లక్షల కోట్ల విలువైన ఫర్నిచర్‌ విక్రయాలు జరుగుతుండగా ఇందులో కనీసం రూ.3–4 లక్షల కోట్ల విలువైన మార్కెట్‌ను భారత్‌ దక్కించుకుంటే 25 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర వాణిజ్య శాఖ అంచనా వేసింది. ఇందులో భాగంగా డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపైఐఐటీ) దేశవ్యాప్తంగా ఫర్నిచర్‌ తయారీకి సంబంధించి పార్కుల ఏర్పాటుకు మార్గదర్శకాలను జారీ చేయడంతోపాటు అనువైన ప్రాంతాలను పరిశీలిస్తోంది. ఫర్నిచర్‌ తయారీకి అవసరమైన దుంగలు, ఇతర కలపపై దిగుమతి సుంకం ఎత్తివేయడంతో పాటు మరిన్ని అనుబంధ యూనిట్లకు రాయితీలు ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. పోర్టులకు దగ్గర్లో ఫర్నిచర్‌ తయారీ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చెన్నై, కృష్ణపట్నం రేవులకు చేరువలో ఉన్నందున నెల్లూరు జిల్లాలో భారీ యూనిట్‌ ప్రతిపాదనకు డీపీఐఐటీ నుంచి సూత్రప్రాయంగా ఆమోదం లభించిందని పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. డీపీఐఐటీ అధికారులు ఇప్పటికే స్థలాన్ని కూడా పరిశీలించారు.

ఇక్కడ ఏర్పాటయ్యే ఫర్నిచర్‌ పార్కులో ప్రధాన భాగస్వామిగా ఉండేందుకు ప్రముఖ దేశీయ ఫర్నిచర్‌ తయారీ సంస్థ ‘గోద్రేజ్‌’ ఆసక్తి వ్యక్తం చేసింది. అయితే, మరో రెండు సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని, ప్రస్తుతం ఇవి చర్చల దశలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఏసీలు, చర్మ పాదరక్షల తయారీ, ఆటో విడిభాగాలు, ఫర్నిచర్, సముద్ర ఉత్పత్తులు, స్టీల్, అల్యూమినియం, ఆగ్రో క్లస్టర్, ఆహార పదార్థాలు, వ్యవసాయ కెమికల్, టెక్సు టైల్, ఎలక్ట్రానిక్‌ కాంపోనెంట్లు, వైద్య చికిత్స ఉత్పత్తులు, టెలివిజన్, కెమెరాలు, బొమ్మలు, ఇథనాల్, ఎలక్ట్రానిక్‌ వెహికిల్‌ కాంపోనెంట్, స్పోర్ట్సు, జిమ్‌ పరికరాలు వంటివి ఆత్మనిర్భర భారత్‌ ప్రత్యేక ప్రోత్సాహం కింద ఏర్పాటుచేస్తున్న పరిశ్రమలు.