న్యూఢిల్లీ, ఏప్రిల్ 30 (న్యూస్‌టైమ్): దేశంలోని ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వైద్య పరికరాల అవసరాలు తీర్చడం కోసం కేంద్ర వినియోగదారు వ్యవహారాల శాఖ తగు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దిగుమతిదారులు 28.04.2021 నుంచి మూడు నెలలపాటు కొన్ని పేర్కొన్న కేటగిరీలలో ఆయా పరికరాలను వారు దిగుమతి చేసుకోవచ్చు.

అయితే, వారు కొన్ని షరతులను పాటించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా సంబంధిత నిబంధనల కింద దిగుమతి చేసుకున్న/కస్టమ్స్ అనుమతిపొందిన తర్వాత అవసరమైన అంశాల నివేదనతోపాటు అమ్మకానికి ముందు స్టాంపింగ్ లేదా స్టిక్కర్ అంటించడం లేదా ఆన్‌లైన్‌ ప్రింటింగ్ ఏది అవసరమైతే అది చేయించాల్సి ఉంటుంది. ఈ జాబితాలోగల పరికరాల వివరాలు ఇలా ఉన్నాయి:- నెబ్యులైజర్లు, ఆక్సిజన్ కాన్‌సెంట్రేట‌ర్లు, కంటిన్యువస్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెజర్ (సీపీఏపీ) పరికరాలు, బైలెవల్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్ (బీఐపీఏపీ) పరికరాలు, ఫ్లో మీటర్, రెగ్యులేటర్, కనెక్టర్లు, ట్యూబులుసహా ఆక్సిజన్ కాన్‌సెంట్రేట‌ర్లు, వాక్యూమ్ ప్రెజర్ స్వింగ్ అబ్జార్ప్షన్ (వీపీఎస్ఏ), ప్రెజర్ స్వింగ్ అబ్జార్ప్షన్ (పీఎస్ఏ) ఆక్సిజన్ ప్లాంట్లు, ద్రవ/వాయు ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే క్రయోజెనిక్ ఆక్సిజన్ ఎయిర్ సెపరేషన్ యూనిట్లు (ఏఎస్‌యూ), ఆక్సిజన్ కానిస్టర్, ఆక్సిజన్ ఫిల్లింగ్ సిస్టమ్స్. క్రయోజెనిక్ సిలిండర్లుసహా ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ జనరేటర్లు, ఆక్సిజన్ ఉత్పత్తి, రవాణా, పంపిణీ లేదా నిల్వ కోసం పరికరాల తయారీకి వాడే విడిభాగాలు, ఆక్సిజన్ ఉత్పత్తి చేయగల ఇతరత్రా పరికరాలు, నాసల్ కాన్యులాసహిత (హై-ఫ్లో పరికరాల్లా పనిచేసే సామర్థ్యంగల) వెంటిలేటర్లు; అన్ని ఉపకరణాలు-ట్యూబులుసహా సహా కంప్రెషర్లు; హ్యుమిడిఫయర్లు, వైరల్ ఫిల్టర్లు, అన్నిరకాల జోడింపు ఉపకరణాలతో కూడిన హై-ఫ్లో నాసల్ కాన్యులా పరికరం, నాన్-ఇన్వేసివ్ వెంటిలేషన్ సహిత ఉపయోగం కోసం హెల్మెట్లు, ఐసీయూ వెంటిలేటర్ల కోసం నాన్-ఇన్వేసివ్ వెంటిలేషన్ ఓరోనాసల్ (ముక్కు-నోరు) మాస్కులు, ఐసీయూ వెంటిలేటర్ల కోసం నాన్-ఇన్వేసివ్ వెంటిలేషన్ నాసల్ మాస్కులు.

కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ తూనికలు-కొలతల చట్టం-2009ని అమలు చేస్తుంది. కొలతలు- కొలిచే సాధనాలకు చట్టపరమైన నిబంధనలను ఈ చట్టం వర్తింపజేస్తుంది. బరువులు-కొలతలకు సంబంధించిన భద్రత-కచ్చితత్వంపై ప్రజలకు భరోసా కల్పించడం తూనికలు-కొలతల శాఖ లక్ష్యం. ప్యాక్ చేసిన వస్తువులపై అవసరమైన ప్రకటనల ప్రచురణద్వారా వినియోగదారులకు ఎంపిక స్వేచ్ఛనిచ్చేలా చేయడమే లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్), రూల్స్-2011 ప్రధానోద్దేశం. దేశంలో కోవిడ్ రెండోదశ ఉధృతి నేపథ్యంలో ఈ వస్తువుల కోసం పెరుగుతున్న డిమాండ్ మేరకు వాటి దిగుమతికి వేగంగా అనుమతులు ఇవ్వడం కోసం ప్రభుత్వం ఈ సడలింపు ఉత్తర్వులిచ్చింది. రోగులకు చికిత్సలో ఎంతో అవసరమైన వైద్య పరికరాలకు సంబంధించి కస్టమ్స్ విభాగం అనుమతుల తర్వాత, అమ్మకాలకు ముందు వీటిపై ప్రకటన చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ సౌలభ్యం కల్పించింది. ఆ మేరకు దిగుమతిదారులు, సదరు అనుమతి కింద వైద్య పరికరాల దిగుమతి చేసుకోవచ్చు. అయితే, తక్షణమే దిగుమతి చేసుకున్న రాష్ట్రంలోని డైరెక్టర్ (లీగల్ మెట్రాలజీ), కంట్రోలర్ (లీగల్ మెట్రాలజీ)కి దిగుమతి చేసుకున్న సదరు పరికరాల సంఖ్య తదితరాల గురించి సమాచారం నివేదించాలి.