న్యూఢిల్లీ, జులై 23 (న్యూస్‌టైమ్): యువతరం స్ఫూర్తి పొందేలా త్యాగం, దేశభక్తి, దిగ్గజ జాతీయ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధుల కథలపై పాఠశాల పుస్తకాలలో ఎక్కువ దృష్టి పెట్టాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈ రోజు పిలుపునిచ్చారు. బాలగంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్బంగా ఉపరాష్ట్రపతి ఫేస్‌బుక్ ద్వారా ఘన నివాళులు అర్పించారు.

వారి కలలను సాకారం చేసుకోవడానికి కృషి చేయాలని ప్రజలను కోరారు. స్మారక సందర్భాలకే వార్తలను కవర్ చేయకుండా, స్వాతంత్య్ర సమరయోధుల, జాతీయ నాయకుల గాథలను నిరంతరం ప్రముఖంగా చూపాలని ఆయన మీడియాకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. లోకమాన్య తిలక్, చంద్రశేఖర్ ఆజాద్ దేశం కోసం చేసిన త్యాగాలను గుర్తు చేసిన ఉపరాష్ట్రపతి, భారత స్వాతంత్య్ర పోరాటాన్ని పటిమను చూపడంలో వీరిద్దరూ మార్గదర్శక, ఉత్తేజకరమైన పాత్ర పోషించారని తెలిపారు. స్వాతంత్య్ర సంగ్రామంలో వీరు సల్పిన విలువ కట్టలేని పోరాటాన్ని ప్రస్తుత యువత చదవాలని, తెలుసుకోవాలని ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు. వలసరాజ్యాల శక్తులు తరచూ బాలగంగాధర్ తిలక్‌ను ‘భారత అశాంతి పిత ’ అని పిలిచేవారని, ఆయన ‘స్వరాజ్’ భావనను బలంగా నమ్మి, ప్రజల్లోకి తీసుకెళ్లారని ఉపరాష్ట్రపతి అన్నారు.

విద్యావేత్త, గణిత శాస్త్రవేత్త, తత్వవేత్త, జర్నలిస్ట్, సంఘ సంస్కర్త, అత్యంత బలమైన జాతీయవాది అని అన్నారు. స్వరాజ్యం నా జన్మహక్కు, నేను దానిని సాధించి తీరుతా ! అని లోకమాన్య తిలక్ చేసిన గర్జన భారత స్వాతంత్య్ర పోరాటంలో ఒక విప్లవాత్మకమైన మలుపు తిప్పిందని శ్రీ వెంకయ్య నాయుడు తెలిపారు. జాతీయ స్ఫూర్తిని రగిల్చిన లోకమాన్య తిలక్, ఇళ్లల్లో చేసుకునే వినాయక చవితి వంటి పండుగలను సార్వజనిక గణేషోత్సవాలుగా సమాజంలో ఒక పరివర్తన తెచ్చారని చెప్పారు.

కేసరి, ది మహారట్ఠా అనే రెండు పత్రికలను నడిపి ప్రజల్లో రాజకీయ చైతన్యం తేవడానికి కృషి చేసారని వెంకయ్య నాయుడు చెప్పారు. అలాగే నిస్వార్ధం, దేశభక్తి, శౌర్యానికి ప్రతీకగా నిలిచిన చంద్రశేఖర్ ఆజాద్ సేవలను కూడా ఉపరాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. అతి చిన్న వయసులోనే అనితర ధైర్యంతో స్వాతంత్య్రం కోసం పోరాడిన ధీరుడని కొనియాడారు. ఆయనకున్న నాయకత్వ పటిమ, సంస్థాపరమైన నైపుణ్యంతో హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్ఆర్ఎస్ఎ)ను కీలకమైన సంస్థగా తీర్చిదిద్దారు. భగత్ సింగ్ వంటి యువ స్వతంత్ర పోరాట యోధులకు చైతన్య స్ఫూర్తిగా, మార్గదర్శిగా, ఆజాద్ నిలిచాడని ఉపరాష్ట్రపతి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here