వైవీ సుబ్బారెడ్డి, కన్నబాబుతో కలిసి గురుమూర్తి ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పటి దృశ్యం

తిరుపతి, ఏప్రిల్ 2 (న్యూస్‌టైమ్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీచేస్తున్న డాక్టర్ ఎం. గురుమూర్తి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి నగరంలో విస్తృతంగా పర్యటించారు. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన తిరుపతిలోని 6వ వార్డు మారుతీ నగర్లో సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ ప్ర‌చారంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు త‌దిత‌రులు పాల్గొన్నారు. జిల్లా, నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు చర్యలు చేపట్టామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.

గండికోట నుంచి గాలేరుకు నగరి జలాలు రాబోతున్నాయని పేర్కొన్నారు. పైప్‌లైన్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారన్నారు. అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే 90 శాతం హామీలు నెరవేర్చామని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి రాగానే 4.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు. కుల, మత, పార్టీలకతీతంగా గురుమూర్తికి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన కోరారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాాల కన్నబాబు మాట్లాడుతూ గురుమూర్తికి వచ్చే మెజార్టీ ఢిల్లీ వరకు రీ సౌండ్‌ వినిపించాలన్నారు. సామాన్యులను పార్లమెంట్‌కు పంపించిన ఘనత సీఎం జగన్‌దన్నారు. మాధవి, నందిగం సురేష్‌లాగానే గురుమూర్తి కూడా పార్లమెంట్‌కు వెళ్తారని కన్నబాబు ధీమావ్యక్తం చేశారు.

సీఎం జగన్‌ పాలనకు ప్రజలు మునిసిపల్‌ ఎన్నికల ద్వారా బలమైన తీర్పు ఇచ్చారని చెప్పారు. తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లోనూ అదే తీర్పు పునరావృతమవుతుందని పేర్కొన్నారు. దేశం మొత్తం చూసేలా భారీ మెజార్టీ తప్పక సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కులాలు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయన్నారు. చిన్న కుటుంబం నుంచి వచ్చిన విద్యావంతుడు గురుమూర్తి ఒక వైపు, ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులు, ఓ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఇలా హేమాహేమీలు మరోవైపు బరిలోకి దిగారని చెప్పారు. గురుమూర్తి గెలుపు ఎప్పుడో ఖాయమైందన్నారు. రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం ఆలోచించే రీతిలో భారీ మెజార్టీ సాధించడానికి తాము ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నామన్నారు.

సంక్షేమ పథకాలు ఇంటింటికి అందిస్తున్న సీఎం రుణం తీర్చుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దేశమంతా ఆసక్తిగా చూస్తున్న పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో 5 లక్షల మెజార్టీ సాధిస్తామన్నారు. ఈ ఎన్నికలు రెఫరెండం కాదని చెప్పి టీడీపీ ముందే చేతులెత్తేసిందన్నారు. జగన్‌ 21 నెలల పరిపాలనకు ప్రజలు భారీ మెజార్టీతో తిరుపతి పార్లమెంట్‌ స్థానం కానుకగా ఇవ్వనున్నారని పేర్కొన్నారు. మాట్లాడుతూ దళిత వర్గానికి చెందిన సామాన్యడైన గురుమూర్తిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ, బీజేపీ ఉనికి కాపాడుకోడానికి డ్రామాలకు తెరతీశాయని విమర్శించారు.