హైదరాబాద్, జులై 24 (న్యూస్‌టైమ్): అటవీ శాఖ ఆధ్వర్యంలో 65 వ నెంబర్ జాతీయ రహదారిపై (హైదరాబాద్ – విజయవాడ) హరితహారం కొనసాగుతోంది. గతంలో హైదరాబాద్ నుంచి సూర్యాపేట వరకు మొక్కలు నాటారు. ప్రస్తుతం సూర్యాపేట నుంచి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రామాపురం క్రాస్ రోడ్డు వరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీ శాఖ ప్రారంభించింది. మొత్తం యాభై కిలోమిటర్ల పరిధిలో తొలిదశలో 13 కిలోమీటర్ల ఎవెన్యూ ప్లాంటేషన్‌ను అటవీ శాఖ పూర్తి చేసింది. సూర్యాపేట శాంతి నగర్ నుంచి వల్లభాపురం వరకు 9 కిలో మీటర్లు , అలాగే మాధవపురం పరిధిలో నాలుగు కిలో మీటర్ల ఎవెన్యూ ప్లాంటేషన్‌ను మొక్కను నాటి విద్యుత్ శాఖ లాంఛనంగా మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. మొక్కలు నాటడం పర్యావరణం కాపాడటం ఇప్పుడు మన ముందు ఉన్న కర్తవ్యమని ఈ సందర్బంగా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.

పర్యావరణాన్ని రక్షిస్తే అది మనలను రక్షిస్తుందన్న హితోక్తి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని ఆయన కోరారు. ఇంట్లో, సమాజంలో జరిగే ప్రతి వేడుక గుర్తుండి పోయేలా ఒక మొక్కను నాటాలని ఆయన సూచించారు. మొత్తం 10,200 పెద్ద మొక్కలను ఈ 13 కిలోమీటర్ల పరిధిలో అటవీ శాఖ నాటిందని కార్యక్రమంలో పాల్గొన్న పీసీసీఎఫ్ (హరితహారం) ఆర్.ఎం. దోబ్రియల్ తెలిపారు. త్వరలోనే మిగతా 37 కిలోమీటర్ల హైవే ప్రాంతాన్ని కూడా పూర్తి చేస్తామని సూర్యాపేట జిల్లా డీఎఫ్ఓ ముకుంద్ రెడ్డి అన్నారు.

దీంతో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు దాకా మొత్తం హైవే అవెన్యూ ప్లాంటేషన్ పూర్తి అవుతుంది. మిగతా పరిధిలో మొత్తం 51 వేల మొక్కలను 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఇరుపక్కల నాటాలని అటవీ శాఖ నిర్ణయించింది. జాతీయ రహదారి వెంట గతంలో నాటిన మొక్కలు ఏ కారణంతోటైనా పెరగకపోవడం, చనిపోయినా వెంటనే అదే ఎత్తులో ఉన్న చెట్లను నాటుతున్నామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఖమ్మం రీజియన్ సీసీఎఫ్ పీవీ రాజారావు, డిసియంయస్ చైర్మన్ వట్టి జానయ్య యాదవ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు రజాక్, జడ్పిటిసి జీడీ బిక్షం, డిఎఫ్ఓ ముకుంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.