న్యూఢిల్లీ, ఆగస్టు 8 (న్యూస్‌టైమ్): దేశంలో కరోనా కల్లోలం ఆగటంలేదు. రోజురోజూకూ తన ప్రభావం పెంచుకుంటున్న వైరస్‌ నయా రికార్డులను నెలకొల్పుతోంది. ఇదే దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా నిత్యం 50 వేల కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభించడంతో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 62 వేల కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 62,498 మందికి కరోనా వైరస్‌ సోకింది.

దేశంలో కోవిడ్‌-19 వెలుగు చూసినప్పటి నుంచి ఒకే రోజు ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. అంతకుముందు జులై 31న అత్యధికంగా 57,151 కేసులు బయటపడ్డాయి. ఇదే సమయంలో కరోనాతో పోరాడుతూ 886 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా రోగుల మరణాల సంఖ్య 41,585 పెరిగింది. మొత్తం వైరస్‌ సోకిన వారి సంఖ్య 20,27,034కు చేరింది. ప్రస్తుతం 6,07,384 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 13,78,106 మంది కోలుకున్నారు. కరోనా విజృంభణతో దేశంలో రెట్టింపు కేసులు నమోదుకావడానికి 21 రోజుల సమయం పడుతోంది. జూలై 28 నాటికి దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 15 లక్షలకు చేరగా, ఆ తర్వాత కేవలం 9 రోజుల వ్యవధిలోనే 5 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం ఈ మహమ్మారి వ్యాప్తికి అద్దంపడుతోంది.

కాగా, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 ప్రభావం అధికంగా ఉన్న దేశాల జాబితాలో 50 లక్షలకు పైగా కరోనా కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉంది. 28 లక్షల కేసులతో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది. కేసుల్లో మూడో స్థానంలో ఉన్న భారత్‌ కోవిడ్‌-19 మరణాల్లో మాత్రం ఐదో స్థానంలో కొనసాగుతోంది. ప్రధాని మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో కరోనా మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దీంతో రాష్ట్రంలో వైరస్‌ సోకిన వారి సంఖ్య 70 వేలకు చేరువైంది. ఇప్పటికే 2600 మంది వైరస్‌ కారణంగా మరణించారు. సూరత్‌, అహ్మదాబాద్‌, వడోదరాల్లో నిత్యం 100కు పైగా కొత్త కేసులు నమోదవుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అహ్మదాబాద్‌లో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 27 వేలు దాటింది.

సూరత్‌లో 14,500, వడోదరాలో 5,200 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరోవైపు, కరోనా వ్యాక్సిన్‌ ధరను మూడు డాలర్లుగా నిర్ణయించినట్టు సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) వెల్లడించింది. భారత్‌ సహా దిగువ, మధ్య ఆదాయ దేశాలకు ఈ ధరతో వ్యాక్సిన్‌ సరఫరా చేయనుంది. ఈ మేరకు గవి, బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఆక్స్‌ఫర్డ్‌, నోవావాక్స్‌కు చెందిన వ్యాక్సిన్‌లకు 100 మిలియన్ల డోసులను తయారు చేసి, భారత్‌ సహా 92 దిగువ, మధ్య ఆదాయ దేశాలకు సరఫరా చేయనున్నట్టు సీరమ్‌ సంస్థ తెలిపింది.