జకార్తా, ఏప్రిల్ 5 (న్యూస్‌టైమ్): ఇండోనేసియా తూర్పు ప్రాంతంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ దాదాపు 44 మంది మృతి చెందారు. వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. మృతుల్లో ఎక్కువ మంది ఫ్లోర్స్‌ ద్వీపంలోని తూర్పు నుసా టెంఘరా ప్రావిన్సుకు చెందినవారు. కొండ ప్రాంతంలో ఉన్న లామినేలే అనే గ్రామంలో ఇళ్లపైకి అర్ధరాత్రి ఒక్కసారిగా చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇళ్లన్నీ బురదలో కూరుకుపోయాయి. ఈ ఘటనలో 38 మంది మరణించారు.

మరో ఐదుగురిని సహాయక బృందాలు సురక్షితంగా వెలికి తీశాయి. కొంతసమయం తర్వాత వరదలు బురదను తుడిచిపెట్టేశాయి. అప్పటి వరకు మృతదేహాలు బురదలోనే కూరుకుపోయి ఉన్నాయి. అలాగే వేబురాక్‌ అనే మరో గ్రామంలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. అక్కడ మొత్తం ముగ్గురు మరణించగా మరో ఏడుగురు గల్లంతయ్యారు. అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ వర్షం కురియడంతో నదులన్నీ పొంగిపొర్లాయి. ఈ నేపథ్యంలోనే వరదలు ముంచెత్తాయి. నది పరీవాహన ప్రాంతంలోని సారవంతమైన భూముల్లో సాగు నిమిత్తం స్థిరపడ్డ గ్రామాలన్నీ తాజా వరదలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. ఇండోసేసియాలో ఏటా వచ్చే వరదలు వందలాది మందిని పొట్టనబెట్టుకుంటున్నాయి. దాదాపు 17,000 ద్వీపాల సమాహారమైన ఈ దేశంలో కొండ ప్రాంతాలే అధికం. దీంతో ఆకస్మికంగా వచ్చే వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి పరిణామాలు తీవ్ర నష్టాన్ని కలగజేస్తుంటాయి. నుసా తెంగ్గరా ప్రావిన్స్‌లోని ఫ్లోరెస్‌ ద్వీపంలో అర్థరాత్రి కురిసిన భారీ వర్షాలకు లామెనెలే గ్రామంలోని ఇండ్లను చుట్టుపక్కల కొండపైనుంచి వచ్చిన బురద ముంచెత్తింది. దీంతో 38 మంది ప్రాణాలు కోల్పోగా ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.

మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశాయి. రాత్రి మొత్తం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నది తీరం సమీపంలోని వైబురక్ గ్రామాన్ని వరద ముంచెత్తడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఏడుగురు గల్లంతయ్యారు. గాయపడిన నలుగురికి స్థానికంగా చికిత్స అందిస్తున్నట్లు విపత్తు నిర్వహణ స్థానిక అధికారి ఓలా తెలిపారు. వందలాది ప్రజలు సహాయక చర్యల్లో పాల్పంచుకుంటున్నారు. రహదారులు కొట్టుకుపోవడం, విద్యుత్ అంతరాయం, వరద ఉధృతి తగ్గని కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని జాతీయ విపత్తు ఉపశమన సంస్థ అధికార ప్రతినిధి రాధిత్యజాటి తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టంపై అధికారులు పూర్తిస్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు.